ఇది కాశ్మీరం కాదు.. ఈశాన్యం

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు దేశ రాజధానిలో జరుగుతున్న అల్లర్లు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వాస్తవానికి జమ్మూకాశ్మీర్ విభజన సమయంలో ఇంతకంటే ఎక్కువ అల్లర్లు జరుగుతాయని భారతావని ఊహించింది.…

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు దేశ రాజధానిలో జరుగుతున్న అల్లర్లు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వాస్తవానికి జమ్మూకాశ్మీర్ విభజన సమయంలో ఇంతకంటే ఎక్కువ అల్లర్లు జరుగుతాయని భారతావని ఊహించింది. కానీ బీజేపీ ప్రభుత్వం ఆ ఊహల్ని పటాపంచలు చేస్తూ అక్కడ అంతా బాగుంది అని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేసింది, అప్రకటిత ఆంక్షలతో ఇంకా ఆ ప్రయత్నం చేస్తూనే ఉంది.

జమ్మూ కాశ్మీర్ విభజన తర్వాత దేశవ్యాప్తంగా ఓ వర్గం ఆందోళనలకు సిద్ధమైనా.. బీజేపీ ప్రభుత్వం వాటిని తీవ్రంగా అణచివేసింది. నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేసి, సైనిక బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చుకుంది. కానీ ఈశాన్యం మాత్రం మోదీ-షా జోడీకి అంతు చిక్కడం లేదు. ఇలాంటి పరిస్థితులు ఉంటాయని ఊహించే పౌరసత్వ చట్ట సవరణ బిల్లు పార్లమెంట్ లో ఉండగానే పారామిలటరీ దళాలు అసోం, పశ్చిమ బెంగాల్ లో మోహరించాయి. కానీ అక్కడ పరిస్థితి అంతకంతకూ చేయి దాటుతోంది.

ఊహించని రీతిలో ఆందోళనలు చెలరేగుతున్నాయి. పశ్చిమబెంగాల్ లోని కొన్ని జిల్లాల్లో జాతీయ రహదారులను ఆందోళనకారులు తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. ఎక్కడికక్కడ రవాణా స్తంభించింది. ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. రాష్ట్రపతి పాలన తెస్తామంటూ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు.

ఇక అసోంలో కూడా పరిస్థితి ఆదివారం మరింత దిగజారింది. ఇప్పటి వరకూ అక్కడ పోలీసుల కాల్పుల్లో ఐదుగురు చనిపోయారని అంచనా. గువహటి మెడికల్ కాలేజీలో బుల్లెట్ల గాయాలతో 29మంది చికిత్స పొందుతున్నారు. వీటికి తోడు ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీ వద్ద జరిగిన ఆందోళనలు, బస్సులు తగలబెట్టడం, ఆఖరికి పైరింజన్లను కూడా ధ్వంసం చేయడం నిరసనల తీవ్రతను తెలియజేస్తోంది. ఇందులో 60 మంది గాయపడ్డారు.

అయితే కేంద్రం మాత్రం కాశ్మీర్ లో అల్లర్లు చెలరేగకుండా చేసిన తమకు, ఈశాన్యం ఓ లెక్క కాదు అనే భావనలో ఉంది. రెండు రోజుల తర్వాత అయినా ఆందోళనలు తగ్గిపోతాయని, చట్టంపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెబుతున్నారు బీజేపీ నేతలు. అయితే పైకి ఎంత చెబుతున్నా, ఈశాన్య రాష్ట్రాలు మాత్రం బీజేపీకి కొరకరానికొయ్యలా మారాయనేది వాస్తవం. కశ్మీర్ అంశాన్ని హ్యాండిల్ చేసినంత సమర్థవంతంగా ఈశాన్యాన్ని హ్యాండిల్ చేయడంలో కేంద్రం పూర్తిగా ఫెయిలైంది.