19వ శతాబ్దం మధ్యలో బ్రిటీష్ ఇంజినీర్ సర్ అర్థర్ థామస్ కాటన్ గోదావరి పరివాహక ప్రాంతంలో కాలువలు తవ్వించి అక్కడి బీడు భూములను సస్యశ్యామలం చేశారు. ఇప్పటికీ ఆయన పేరును ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు నిత్యం స్మరించుకుంటారు. అపర భగీరథుడని కాటన్ దొరను కొనియాడుతుంటారు. ఇప్పుడు 160 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రభుత్వం గోదావరి నీటిని మళ్లించి తెలంగాణను సస్యశ్యామలం చేసే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ అనే బృహత్ ప్రాజెక్టును చేపట్టింది. ఈ స్థాయి ప్రాజెక్టు భారతదేశంలోనే ఇంత వరకు ఏ రాష్ట్రమూ చేపట్టలేదు. కోట్లాది మంది తెలంగాణ ప్రజలకు ఇది ఆశాకిరణం ఇది. ఎన్నో సవాళ్లు, ఎన్నో సంక్లిష్టతలతో కూడిన ఈ ప్రాజెక్టులో మేఘా ఇంజినీరింగ్ భాగస్వామిగా నిలిచి తన శక్తియుక్తులు, నైపుణ్యంతో ప్రపంచాన్ని అబ్బురపరిచింది.
ఇంజనీరింగ్ అద్భుతం కాళేశ్వరం..
తెలంగాణ దశ- దిశ మార్చి రాష్ట్రాన్ని బలీయమైన ఆర్థికశక్తిగా తీర్చిదిద్దాలనే సదాశయంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తెలంగాణ మొత్తాన్ని సస్యశ్యామలం చేయాలన్నది ఆయన సంకల్పం. ఇందులో భాగస్వామిగా నిలిచి తన వంతు కర్తవ్యాన్ని సకాలంలో నిర్వర్తించింది మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. సాంకేతిక, ఇంజినీరింగ్ రంగంలో తన ముఫ్పై ఏళ్ల అనుభవాన్ని రంగరించి కాళేశ్వరం ప్రాజెక్టును ఇంజినీరింగ్ అద్భుతంగా తీర్చిదిద్దింది.
ప్రపంచ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతంగా చెప్పుకోవచ్చు. దాదాపు తెలంగాణ రాష్ట్రమంతటికి ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం అందుతుంది. 45 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తుంది ఈ ప్రాజెక్టు. 13 జిల్లాల పరిధిలో విస్తరించిన 20 రిజర్వాయర్లు 145 టీఎంసీల నీటిని నిల్వ చేస్తాయి. ఈ నీటిని దాదాపు 200 కిలోమీటర్ల సొరంగాల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. వీటిని అనుబంధంగా ఉండే కాలువలు గోదావరి జలాలను దాదాపు 500 కిలోమీటర్ల దూరంలోని పంటపొలాలకు చేర్చుతాయి. అంతే కాదు తెలంగాణ రాజధానికి తాగునీరు అందించడంతో పాటు రాష్ట్ర పారిశ్రామిక అవసరాలకు ఈ నీరు ఉపయోగపడుతుంది.
ప్రపంచంలోనే అతిపెద్దది…
అమెరికాలోని కొలరాడో, ఈజిప్టులోని గ్రేట్ మ్యాన్ మేడ్ రివర్, ఆంధ్రప్రదేశ్‌లోని హంద్రీ-నీవా ప్రాజెక్టులకు ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకాలుగా పేరుంది. వాటితో పోల్చితే కాళేశ్వరం ఎక్కువ నీటిని తక్కువ సమయంలో ఎత్తిపోయగల సామర్ధ్యం కలిగినది. గోదావరి జలాలను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకొని తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప ఆలోచనకు ప్రతిరూపం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్. అనితర సాధ్యమైన ఈ ప్రాజెక్టు కోసం అత్యధిక సామర్ధ్యం కలిగిన ఎలక్ట్రో మెకానికల్ వ్యవస్థను అతి తక్కువ సమయంలో మేఘా ఇంజినీరింగ్ ఇన్ప్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఏర్పాటు చేసింది. భూగర్భం, సాంకేతికంగా ఎన్నో సంక్లిష్టమైన సవాళ్లను అధిగమించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించిన రీతిలో మూడేళ్లలో తనకప్పగించిన బృహత్ ప్రాజెక్టును మేఘా నిర్విఘ్నంగా పూర్తి చేసింది.
వాస్తవానికి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ఆషామాషీ వ్యవహరంర కాదు. ఒక్కో ప్రాజెక్టు పూర్తి కావడానికి దశాబ్దాలు పడుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించిన నాగార్జునసాగర్, శ్రీశైలం కుడి, ఎడమ కాలువలు, తెలుగుగంగ, శ్రీరాం సాగర్ ప్రాజెక్టులు దీనికి ఉదాహరణలు. ఇప్పటికీ అవి పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాలేదన్నది వాస్తవం. కాని ఎంతో క్లిష్టమైనప్పటికీ రోజుకు రెండు టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోసే భారీ ప్రాజెక్టును మేఘా మూడేళ్లలో పూర్తి చేసి ఇంజినీరింగ్ నిపుణులు సైతం నివ్వెరపోయేలా చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు జూన్ 21న ప్రారంభించారు. అప్పట్లో ప్రయోగాత్మకంగా మేడిగడ్డ లక్ష్మి పంప్ హౌస్ నుంచి నీరు ఎత్తిపోసి ఆచరణ సాధ్యమని నిరూపించారు.
ఇప్పటి వరకు ఆసియాలోనే పెద్దదిగా పరిగణిస్తున్న హంద్రీ –నీవా ఎత్తిపోతల పథకం కింద ఏడాదికి 18 టీఎంసీల నీరు పంపింగ్ అవుతోంది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఏడాదికి సరాసరిన 100 టీఎంసీల నీటిని గోదావరి నుంచి కృష్ణకు తరలిస్తున్నారు. ఇప్పుడు గోదావరి నది మట్టానికి 300 మీటర్ల ఎగువనున్న మిడ్ మానేరు జలాశయానికి జలకళ తెప్పించడంలో మేఘా పంపింగ్ స్టేషన్లు కీలక పాత్ర పోషించారు. 20 రోజుల్లోనే 25 టీఎంసీల సామర్ధ్యం కలిగిన మిడ్ మానేర్ జలాశయం నిండిందంటే అది కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గొప్పదనానికి నిదర్శనం. రోజుకు సరాసరి 2 టీఎంసీల నీటిని పంప్ చేస్తూ మధ్యలోని జలాశయాలనూ నింపుతూ మళ్లీ అక్కడి నుంచి నీటిని పంప్ చేయడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ఈ తరహా ఇంజినీరింగ్ వ్యవస్థ మరే ఎత్తిపోతల పథకాల్లోనూ లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని రోజుకు 2 టీఎంసీల చొప్పున160 టీఎంసీల వరకు పంపింగ్ చేయవచ్చు.
కీలకమైన పంప్ హౌసులు…
ఈ ప్రాజెక్టులోని పంపు హౌజులకు లక్ష్మి, సరస్వతి, పార్వతి, గాయత్రి అని దేవతల పేర్లు పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ జలంపై తనకున్న భక్తిప్రపత్తులు చాటుకున్నారు. ఈ పంపుహౌసులన్నీ ఎటువంటి సాంకేతిక సమస్యలు లేకుండా చూడటంలో తెలంగాణ నీటిపారుదల నిపుణులు, ఎంఇఐఎల్, బీహెచ్‌ఈఎల్‌తో పాటు ఆండ్రిజ్, జైలం వంటి అంతర్జాతీయ సంస్థలు తమ పనితనాన్ని చాటిచెప్పాయి.
గోదావరి జలాలను ఎత్తిపోసే మొదటి పంప్ హౌజ్ లక్ష్మి. ఈ ఏడాది జూలై 5 నుంచి డిసెంబర్ 6 వరకు అంటే 3157 గంటల్లో 24.062 టీఎంసీల నీటిని లక్ష్మి పంప్ హౌజ్ ఎత్తిపోసింది. ఇందులో ఏర్పాటు చేసిన మొత్తం 11 పంపులు వినియోగంలోకి వచ్చేశాయి. 40 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన ఈ పంపులు ఒక్క గంట పాటు పనిచేస్తే పల్లెల్లో ఉండే చెరువు నిండిపోతుంది. సరస్వతి పంప్ హౌస్‌లో ఒక్కొక్కటి 40 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 8 పంపులను మేఘా ఇంజినీరింగ్ నెలకొల్పింది. ఈ ఏడాది జులై 22 నుంచి డిసెంబర్ 6 వరకు ఈ పంపులు 1781 గంటలపాటు పంపింగ్ చేసి 18.559 టీఎంసీల నీటిని పైకి ఎత్తిపోశాయి. లింకు ఒకటిలో చివరిదైనా పార్వతి పంపింగ్ కేంద్రంలోని పంపులు 1639 గంటలు పనిచేసి 15.404 టీఎంసీల నీటిని ఎల్లంపల్లి శ్రీపాద సాగర్‌కు చేర్చాయి.
ఈ ప్రాజెక్టులో అన్నింటికంటే కీలకమైన గాయత్రి పంప్ హౌస్. భూమి లోపల 430 అడుగల లోతున నిర్మించిన ఈ పంప్ హౌస్ ప్రపంచంలోనే అతి పెద్దది. ఇందులో 139 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 7 యూనిట్లు ఏర్పాటు చేశారు. ఇంత పెద్ద యూనిట్లు ఇంత వరకు నీటిపారుదల రంగంలో ప్రపంచంలో ఎక్కడా ఉపయోగించలేదు. ఈ పంపులు ఇప్పటి వరకు 2602 గంటలు పనిచేసి 29.70 టీఎంసీల నీటిని సిరిసిల్ల సమీపంలోని మిడ్ మానేరు వైపు తరలించాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా గోదావరి దశ-దిశ మార్చడంలో మేఘా ఇంజినీరింగ్ పోషించిన పాత్ర మరువలేనిది. నీరు పల్లమెరుగనే సామెతను తిరగరాసి గోదావరికి కొత్త నడకను నేర్పింది.