ఒకవైపు ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా వందల కోట్ల రూపాయలకు చేరుతోందని ప్రకటిస్తూ ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ వాళ్లకు ఈ రివర్స్ టెండరింగ్ అంశం సుతారమూ ఇష్టం లేదనేది తెలిసిన అంశమే. దీని వల్ల టీడీపీకి రెండు రకాలుగా దెబ్బ పడుతున్నట్టుగా ఉంది.
అందులో ఒకటి తమ హయాంలో కాంట్రాక్టులను భారీ గా అంచనాలను పెంచి ఇచ్చారనే విషయం చర్చకు దారి తీస్తూ ఉంది. చంద్రబాబు హయాంలో కమిషన్లను కలుపుకుంటే అంచనాలు భారీగా పెరిగిపోయిన వైనం ప్రజల్లో చర్చగా మారుతూ ఉంది.
ఇక మరో అంశం.. తెలుగుదేశం అయిన వారి నుంచి కొన్ని కాంట్రాక్టులు చేజారడం! తెలుగుదేశం పార్టీ హయాంలో కొన్ని కీలకమైన కాంట్రాక్టులు కొందరు కాంట్రాక్టర్లకే దక్కాయి. అలాంటి వాటిల్లో రివర్స్ టెండరింగ్ అంశం బాగా చర్చగా నిలిచింది. కోట్ల రూపాయల తక్కువ ధరకు కొత్త కాంట్రాక్టర్లు ఆ పనికి ముందుకు వచ్చారు. దీంతో ఆ కాంట్రాక్టులు టీడీపీ సన్నిహితుల నుంచి చేజారి కొత్త వారి చేతికి అందాయి.
ఒకవైపు తమ హయాంలో అంచనాలు పెంచారనే అపఖ్యాతి, మరోవైపు తాము అప్పగించిన వారి నుంచి పనులు చేజారడం.. ఈ రెండు అంశాలూ టీడీపీకి మింగుడు పడటం లేదు. అందుకే రివర్స్ టెండరింగ్ పట్ల టీడీపీ బాగా ఫైర్ అయిపోతూ ఉంది. కానీ ఈ మంటలు జనాలను అస్సలు తాకడం లేదు. అందుకే వెనక్కు నడిచి నిరసన తెలిపారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు , టీడీపీ నేతలంతా.. వెనక్కు నడిచి నిరసన తెలిపారు. తెలిపితే తెలిపారు కానీ, చంద్రబాబు నాయుడు పదే పదే వెనక్కు నడిచే ప్రయత్నాలు చేయవద్దని, వెనక్కు నడవడంలో తేడా వాస్తే బోల్తా పడతారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.