పౌరసత్వ సవరణ చట్టానికి (సీసీఏ) వ్యతిరేకంగా అసోంలోని గువాహటిలో ఆల్ ఆర్టిస్ట్ ఆఫ్ అసోం ఆందోళనకారులకు సంఘీభావం ప్రకటించింది. అంతేకాదు వందలాది మంది నటులు ప్రత్యక్ష ఆందోళనకు దిగి రోడ్డెక్కారు. ఆందోళనకారులకు మద్దతుగా తమవంతు నిరసన ప్రకటించారు. ఈ సందర్భంగా నటి బర్సారాణి బైశ్య ఆవేశంతో మాట్లాడుతున్న ఫొటో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.
పౌరసత్వ సవరణ చట్టంపై మరీ ముఖ్యంగా ముస్లింలు ఆందోళన చెందుతున్నారు. కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా వారు ఊరూరా ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వారికి పలు ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు మద్దతుగా పాల్గొంటున్నాయి.
మరి టాలీవుడ్ సంగతేంటి? ఇటీవల దిశ నిందితుల ఎన్కౌంటర్పై పోటీపడి ప్రకటనలు ఇచ్చిన సినీరంగ సెలబ్రిటీలు….ఇప్పుడు దేశ వ్యాప్త సమస్యపై ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారనే ప్రశ్న తలెత్తుతోంది. తమ సౌకర్యాన్ని బట్టి ఆయా సమస్యలపై స్పందిస్తూ టాలీవుడ్ నటులు చాలా లౌక్యం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు.
సీసీఏకి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనకారుల ఉద్యమాలపై పోలీసులు తూటా ఎక్కుపెట్టారు. దీంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ టాలీవుడ్ నటుల హృదయాలు చలించడం లేదు.
తెలుగు సినీరంగం కంటే తమిళనటులు కొంచెం నయమంటున్నారు. సమస్యల ప్రాతిపదికన వారు తీవ్రంగా స్పందించిన దాఖలాలున్నాయి. తెలుగు నటుల విషయానికి వస్తే బాగా బతకనేర్చిన వాళ్లనే విమర్శ బలంగా ఉంది.