పోలీసుల రాజ్యంలోకి వివాదాల ముద్దుబిడ్డ రాంగోపాల్‌వర్మ వెళ్లాల్సి వస్తోంది. తనకు మనశ్శాంతి లేకుండా చేసిన వర్మపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫిర్యాదు మేరకు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మకు హైదరబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు పంపారు.
కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా టైటిల్ వివాదం కావడం….ఆ తర్వాత పేరు మార్చుకుని అమ్మరాజ్యంలో కడపబిడ్డలుగా అనేక వివాదాలు, వాదనల మధ్య ఈ నెల 12న ఎట్టకేలకు ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. ఈ సినిమాలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్, జనసేనాని పవన్‌కల్యాణ్, ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్‌లను పోలిన పాత్రలతో అవహేళన చేశారంటూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.
కేఏ పాల్‌పై ప్రత్యేకంగా ఓ పాటను కూడా చిత్రీకరించారు. దీనిపై పాల్ తీవ్ర అభ్యంతరం చెబుతూ వస్తున్నారు. ఆ సినిమాను నిలుపుదల చేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు సెన్సార్‌బోర్డు, రివైజింగ్ కమిటీలు తుది నిర్ణయం తీసుకోవడంతో సినిమా విడుదలకు మార్గం సుగుమం అయ్యింది.
అయితే సినిమాలో తన ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి వాడారని ఆయన ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వర్మకు సైబర్‌క్రైమ్ పోలీసులు వర్మకు నోటీసులు జారీ చేశారు. సోమవారం తమ ఎదుట హాజరు కావాలని ఆయన్ను పోలీసులు ఆదేశించారు. సో…పోలీసుల రాజ్యంలోకి వివాదాలు, సంచలనాల దర్శకుడు అడుగుపెట్టక తప్పని పరిస్థితి. అయితే వర్మకు ఇలాంటివి కొత్తేమి కాదు. గతంలో కూడా ఫోర్న్ సినిమాను తలపించేలా తీసిన సినిమాపై మహిళా సంఘాల ఫిర్యాదు మేరకు ఆయన్ను హైదరాబాద్ పోలీసులు విచారించారు.