జనసేనలో కనిపించని రవితేజలు ఎంతమందో..?

జనసేన పార్టీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తుందనగానే పొలోమంటూ చాలామంది మాజీ నాయకులు, రిటైర్డ్ నాయకులు, ఇంకే పార్టీ తమకు అవకాశం ఇవ్వదు అని డిసైడ్ అయిన వాళ్లు జనసేనలోకి వెళ్లారు. వీరిలో చాలామందికి…

జనసేన పార్టీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తుందనగానే పొలోమంటూ చాలామంది మాజీ నాయకులు, రిటైర్డ్ నాయకులు, ఇంకే పార్టీ తమకు అవకాశం ఇవ్వదు అని డిసైడ్ అయిన వాళ్లు జనసేనలోకి వెళ్లారు. వీరిలో చాలామందికి ఎన్నికలనాటికే పూర్తిగా జ్ఞానోదయం అయింది, రిజల్ట్ వచ్చాక ఎవరిదారి వారు చూసుకున్నారు. ఇలాంటి వారితో ఏ సమస్యా లేదు, వీరు ఎక్కడైనా బతికేస్తారు, ఏ కండువా అయినా కప్పేసుకుంటారు.

కానీ కొంతమంది పవన్ కల్యాణ్ ఆవేశం, ఆశయాలు నచ్చి, నిజంగానే సమాజానికి మన వల్ల ఏదో ఉపయోగం ఉంటుందనుకుని, తాము చేస్తున్న వృత్తులు, ఉద్యోగాలు వదిలేసి మరీ జనసేనలోకి వచ్చేశారు. డాక్టర్లు, లాయర్లు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, విదేశాల్లో సొంత కంపెనీలు ఉన్నవాళ్లు కూడా జిల్లాల్లోకి వచ్చేసి పార్టీ కోసం కష్టపడ్డారు. అలాంటి వారిలో ఇప్పుడు ఎంతమంది మిగిలున్నారు. ఈ లిస్ట్ జనసేన దగ్గర కూడా లేదు.

వెళ్లిపోయే వాళ్లంతా చాలా సైలెంట్ గా తమ దారి తాము చూసుకున్నారు. పవన్ కల్యాణ్ పై నిందలు వేయడం కూడా అనవసరం అనుకుని చడీచప్పుడు లేకుండా తప్పుకున్నారు. ఒక్క రాజు రవితేజ మాత్రమే, స్నేహితుడికి కాస్త హితబోధ చేసి వెళ్లారు. కుల, మతాల పిచ్చి ఒంటబట్టించుకున్న నువ్వు జన్మలో మారవంటూ స్ట్రాంగ్ డోస్ ఇచ్చి మరీ వెళ్లిపోయారు. ఇలాంటి రాజు రవితేజలు జనసేనలో చాలామందే ఉన్నారు. పవన్ కల్యాణ్ అంటే ఇష్టం ఉన్నా, ఆయన విధానాలు నచ్చక, పార్టీని వదల్లేక ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో 50శాతం మంది ఇప్పటికే సైలెంట్ గా తప్పుకున్నారట.

పార్టీని వీడిపోయే వారెవరైనా ఓ ప్రెస్ మీట్ పెట్టి, లేక అధినేతను అడ్రెస్ చేస్తూ ఓ లేఖ రాసి, కాస్తో కూస్తో సెన్సేషన్ క్రియేట్ చేసి బైటకు వెళ్తుంటారు. పవన్ కల్యాణ్ అదృష్టమో లేక, ఆయనపై ఉన్న సింపతీనో తెలియదు కానీ ఇప్పటివరకూ ఎవరూ అలాంటి పనిచేయలేదు. రాజు రవితేజ మాత్రం ఉండబట్టలేక పవన్ తప్పుల్ని ఎత్తి చూపారు.

జరిగిందేదో జరిగిపోయింది, ఇకనైనా పవన్ తన క్యాడర్ పై, తనను నమ్మి వచ్చిన వాళ్లపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి. లేదంటే మరింత మంది రాజు రవితేజ్ లాంటోళ్లను అతడు కోల్పోవాల్సి వస్తుంది