విద్య, ఉద్యోగాల్లో మహిళలకు ప్రత్యేక కోటా, బస్సుల్లో ప్రత్యేక సీట్లు….ఇప్పుడు ఏకంగా వారి కోసమే ఓ ప్రత్యేక గేమ్ షో. అవును ఇది నిజం. మహిళల కోసం వంటావార్పు, ఫ్యాషన్ షో తదితర ప్రత్యేక కార్యక్రమాలను ఇంత వరకూ చానళ్లలో చూశాం. కాని మేధస్సులో వారు మగవాళ్లకు ఏ మాత్రం తీసిపోరనే ఉద్దేశంతో కాబోలు…వారి టాలెంట్‌ను ప్రపంచానికి చాటేందుకు ప్రత్యేకంగా ఓ గేమ్ షోను మొదలు పెట్టనున్నారు.
ఈ షో తమిళంలో ఈ నెల 23న ప్రారంభం కానుంది. షోలో విజేతగా నిలిచే వారికి రూ.కోటి చెక్కును పరిచయం చేస్తూ నటి రాధికా శరత్‌కుమార్, కలర్స్ చానల్ తమిళ్ బిజినెస్ హెడ్ అనూప్ చంద్రశేఖర్ ఆవిష్కరించారు. ఈ నెల 23న రాత్రి 8 గంటలకు కలర్స్ తమిళ చానల్‌లో ప్రారంభం కానున్న షోకు హోస్ట్‌గా నటి రాధికా వ్యవహరించనున్నారు. కలర్స్ తమిళ టీవీచానల్, స్టూడియో నెక్ట్స్ సంయుక్తంగా నిర్వహించనున్నాయి.
రాధికా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో జంటగా ఆమె అనేక చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. కాగా ఈ షో సోమవారం నుంచి శుక్రవారం ప్రసారమవుతుందని రాధికా తెలిపారు.
గతంలో తెలుగులో మాటీవీలో ప్రసారమైన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ఎంతో ప్రాచుర్యం పొందింది. అప్పట్లో మొదటి సీజన్‌కు హీరో నాగార్జున, రెండో సీజన్‌కు మెగాస్టార్ చిరు హోస్ట్స్‌గా వ్యవహరించారు. ఇప్పుడు తమిళ్‌లో ప్రారంభమవుతున్న షో కేవలం మహిళలకు సంబంధించింది కావడంతో ‘మీలో ఎవరు కోటీశ్వరి’ అని పేరు పెట్టారు. పోటీకి వచ్చే మహిళలకు రాధికా మొత్తం 15 ప్రశ్నలు వేస్తారు.
మొదటి ప్రశ్నకు వెయ్యితో ప్రారంభమై అంచెలంచెలుగా జవాబులు చెప్పుకుంటూ పోవాలి. చిట్టచివరి 15వ ప్రశ్నకు జవాబు చెబితే రూ.కోటిని బహుమతిగా గెలుచుకునే అవకాశం ఉంటుంది. మీలో ఎవరు కోటీశ్వరుడులోని నిబంధనలే ఈ షోలో కూడా ఉంటాయి. షోలో పాల్గొనేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారని, ఇప్పటి వరకు 3,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారని కలర్స్ చానల్ తమిళ్ బిజినెస్ హెడ్ తెలిపారు.