వైసీపీలోకి వెళ్లాలని మనసున్నా.. పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందేమోనని భయపడే టీడీపీ ఎమ్మెల్యేలకు ఓ అద్భుతమైన అవకాశం. చేతికి మట్టి అంటకుండా పని పూర్తి చేసుకుని వైసీపీ అనుబంధ సభ్యుడిగానో లేక స్వతంత్ర సభ్యుడిగా అసెంబ్లీలో సెపరేట్ గా కూర్చునే మంచి ఛాన్స్. ఇలా వెళ్లాలనుకునేవాళ్లంతా తలకు మించిన పనులేవీ చేయక్కర్లేదు, కేవలం చంద్రబాబుని చడామడా తిడితే సరి.
అవును.. టీడీపీలోనే ఉంటూ బాబుని చడామడా తిడితే, ఆయనతో విభేదించి పార్టీ పరువుని బజారున పెడితే చాలు ఆటోమేటిగ్గా పనైపోతుంది. ఎలాగూ తిట్టేవాళ్లను పార్టీలో ఉంచుకోరు కాబట్టి సస్పెండ్ చేస్తారు. ఈలోగా ఒక్క షోకాజ్ నోటీసుకే ఎమ్మెల్యేలు కూడా రెచ్చిపోవచ్చు, పార్టీకి, పార్టీలో పదవులకు రాజీనామా చేసి పారేయొచ్చు. రాజీనామా చేశాక ఆటోమేటిక్ గా ఇగో చల్లార్చుకునేందుకు పార్టీ కూడా వారిని సస్పెండ్ చేసిపారేస్తుంది. ఆ తర్వాత ఎంచక్కా స్వతంత్ర అభ్యర్థిగా సభలో కూర్చోవచ్చు.
ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చూపించిన ఓ ప్రత్యేక మార్గం ఇది. ఇప్పుడు దీన్ని ఫాలో అయ్యేందుకు చాలామంది సిద్ధమవుతున్నారని సమాచారం. ప్రభుత్వం మారి 6 నెలలైంది. రోజురోజుకీ జగన్ ఇమేజ్ పెరుగుతోంది, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా టీడీపీ దారుణంగా విఫలమవుతోంది. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలంతా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. బాబు పక్కనుంటే బ్యాండే అనే విషయం వీళ్లకు అర్థమైపోయింది.
ఈ ఇబ్బందుల నుంచి బైటపడాలన్నా, భవిష్యత్తు లేని టీడీపీని వదిలేయాలన్నా ఇదే మధ్యేమార్గంగా భావిస్తున్నారు ఎమ్మెల్యేలు, మిగతా నేతలు. చంద్రబాబుపై మాటల తూటాలు పేల్చేందుకు సిద్ధమవుతున్నారు, సమయం సందర్భం కోసం వేచి చూస్తున్నారంతే. వీలు చూసుకుని, బాబుపై అటాక్ చేసి, అధికారంలో ఉండగా బాబు చేసిన దగుల్బాజీ పనులన్నీ బైటపెట్టి, టీడీపీలో ఉన్నోళ్లంతా చేతగాని వాళ్లనే నిందవేసి ఎంచక్కా బైటకు పోయేందుకు కొంతమంది సిద్ధమవుతున్నారు.
అయితే వీరికి కావాల్సింది ఇంకోటి ఉంది. వంశీకి కొడాలి నాని సపోర్ట్ చేసినట్టు, ఓ బలమైన మద్దతుదారు ఉంటే పని మరింత ఈజీగా అయిపోతుంది. అందరికీ అలాంటి సపోర్ట్ దొరక్కపోవచ్చు. వంశీ బయటకొచ్చినప్పటి పరిస్థితులు వేరు, ఆయన రాజకీయ దృక్పథం వేరు. అందర్నీ జగన్ ఇదే తరహాలో ఎంకరేజ్ చేయకపోవచ్చు. అది కూడా తెలుసుకొని అప్పుడు చంద్రబాబును తిడితే బెటర్.