భూమా ఇంటి పేరుపై ఆ ఇంటి పేరుగల వారు పోటీ పడుతున్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇన్నేళ్లూ భూమా అంటే.. ఒకరే గుర్తుకు వచ్చేవారు. అది భూమా నాగిరెడ్డి మాత్రమే. ఇంటి పేరు మీద ఆయన వ్యవహారికం అయ్యారు. భూమా శోభ నాగిరెడ్డి కూడా రాజకీయాల్లో ఉన్నా.. ఆమెను మీడియా, ప్రజలు కూడా శోభగా వ్యవహరిస్తూ వచ్చారు. భూమా అంటే భూమా నాగిరెడ్డి, శోభ అంటే భూమా శోభా నాగిరెడ్డి అన్నట్టుగా గుర్తుకు వచ్చే వారు. అయితే వారిద్దరి మరణం తర్వాత.. వాళ్లింటి రాజకీయాలు రకరకాల మలుపులు తీసుకున్నాయి.
భూమా నాగిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశంలోకి చేరడం దగ్గర నుంచినే రాజకీయ మలుపులు మొదలయ్యాయనే సంగతి వేరే చెప్పనక్కర్లేదు. శోభ స్థానంలో ఆమె కూతురు అఖిలప్రియ రాజకీయాల్లోకి వచ్చారు. తల్లి స్థానంలో ఏకగ్రీవంగా ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అలాంటి క్రమంలో ఆమె భూమా అఖిలప్రియగా ఎమ్మెల్యే అయ్యారు. తండ్రి ఇంటి పేరునే ఆమె రాజకీయాల్లో కొనసాగించారు. మంత్రి అయ్యింది కూడా ఆమె భూమా అఖిలప్రియగానే. సాధారణంగా ఆడపిల్లల ఇంటి పేరు పెళ్లితో మారుతూ ఉంటుంది. అయితే పెద్ద పెద్ద కుటుంబాల వాళ్లు ఇలాంటి నియమాలను పట్టించుకోరు. పెద్ద కుటుంబాల వాళ్లే కాదు చదువుకున్న అమ్మాయిలెవరి ఇంటి పేరూ ఈ రోజుల్లో మారేదేం లేదు.
ఎందుకంటే వాళ్ల వాళ్ల డిగ్రీ సర్టిఫికెట్స్ లో తండ్రి ఇంటి పేరే ఉంటుంది. ఆ డిగ్రీల మీదే వారు వృత్తి, ఉద్యోగాలు చేపట్టినప్పుడు ఆ ఇంటి పేరునే కొనసాగించాల్సి వస్తోంది. దీంతో పెళ్లితో ఇంటి పేరు మారిపోయే రోజులు పోయాయి. ఇది మామూలుగా అయితే సమస్యే కాదు. పుట్టినింటి పేరు పెట్టుకుంటారా, మెట్టినింటి పేరు పెట్టుకుంటారా.. అనేది అమ్మాయిల ఇష్టం. అందులో వారికి పూర్తి స్వతంత్రాలు ఉండవచ్చు.
అయితే రాజకీయాల్లోకి వచ్చాకా.. ప్రతిదీ రాజకీయమే కదా! అందుకే ఇప్పుడు భూమా ఇంటి పేరు కూడా రాజకీయం అవుతున్నట్టుగా ఉంది. భూమా రాజకీయ వారసత్వం మీద ఇప్పుడు ఒకింత పోటీ నెలకొంది. ఇప్పటికే భూమా కుటుంబంలో రాజకీయమైన చీలిక వచ్చింది.
భూమా నాగిరెడ్డి సోదరుడి కొడుకుల్లో ఒకరైన భూమా కిషోర్ రెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీ ద్వారా రాజకీయ గుర్తింపుతో తన వర్గాన్ని సమాయత్తం చేసుకుంటున్నారు ఆయన. అఖిలప్రియతో విబేధిస్తూ ఆయన సాగుతూ ఉండటం గమనార్హం. అఖిలప్రియ భర్త అంటే కిషోర్ రెడ్డి వర్గానికి ఏ మాత్రం పడటం లేదు కూడా. ఈ నేపథ్యంలో వారు భూమా ఇంటి పేరు మీద హక్కులు తమకే ఉంటాయని అంటున్నారు.
పెళ్లి తర్వాత అమ్మాయి ఇంటి పేరు మారుతుందని, అఖిలప్రియ తన భర్త ఇంటి పేరును పెట్టుకోవాలని.. భూమా ఇంటి పేరును వదులుకోవాలని కూడా కిషోర్ కుమార్ రెడ్డి వర్గం వాదిస్తూ ఉంది! అఖిలతో రాజకీయ విబేధాలు వీరికి ఆ స్థాయికి చేరినట్టుగా ఉన్నాయి.