బిర్యానీ, జిలేబి, సమోసా.. మన రుచులు కావా?

సమోసా, జిలేబీ, చికెన్ టిక్కా మసాలా, బిర్యానీ.. ఇవేవీ భారతీయ వంటకాలు కావు. ఇవి పక్కా భారతీయ వంటకాలే అని మనం నమ్మేవాటిలో చాలా వరకు మనం ఇతర దేశాల నుంచి అరువు తెచ్చుకున్నవే…

సమోసా, జిలేబీ, చికెన్ టిక్కా మసాలా, బిర్యానీ.. ఇవేవీ భారతీయ వంటకాలు కావు. ఇవి పక్కా భారతీయ వంటకాలే అని మనం నమ్మేవాటిలో చాలా వరకు మనం ఇతర దేశాల నుంచి అరువు తెచ్చుకున్నవే కావడం విశేషం. విదేశీయులు మనకి వాటిని పరిచయం చేస్తే, అవి భారతీయ వంటకాలే అనేంతగా మనం వాటిని మార్చేసుకున్నాం. మనదైన ముద్రవేశాం. ఇంతకీ మనవి అని మనం సొంతం చేసుకున్న పరాయి వంటకాలేంటో ఓసారి చూద్దాం.

సమోసా

భారత్ లో సమోసా గురించి తెలియనివారు ఉండరేమో. ప్రాంతీయ భేదం లేకుండా అన్నిచోట్లా, సమోసాలు అందుబాటులో ఉంటాయి. సమోసా-చాయ్ ఈ కాంబినేషన్ చాలా చోట్ల సూపర్ హిట్. కానీ సమోసా మనది కాదు. సమోసా పుట్టిల్లు పర్షియా. సాంబుసక్ అనే పర్షియన్ వంటకం, భారత్ లో మార్పులు చేర్పుల అనంతరం సమోసాగా మారింది. పర్షియాలో సమోసాలో ఉడికిన మాంసం పెట్టి వడ్డించేవారు. కానీ మనం ఇక్కడ ఆలూ సమోసా, ఆనియన్ సమోసా, స్వీట్ కార్న్ సమోసా, చిల్లీ సమోసా.. ఇలా రకరకాలుగా మార్చేశాం, సమోసాపై మన ముద్ర వేసుకున్నాం.

జిలేబి

జిలేబీ అనేది బెంగాలీ వంటకం అనుకుంటాం, కానీ జిలేబీ అనేది ఓ అరేబియన్ వంటకం. అరబిక్ దేశాల్లో జలాబి అనే వంటకం ఫేమస్. జలాబి స్వీట్ లో పెరుగు నంచుకోవడం ఓ ప్రత్యేకత. అది మనకు జిలేబీగా పరిచయం అయింది. పశ్చిమబెంగాల్, అసోంలో కూడా జిలేబీ బాగా ఫేమస్. అరబిక్ జలాబిని మనం జిలేబీగా ప్రపంచానికి సరికొత్తగా పరిచయం చేశామన్నమాట.

బిర్యానీ..

స్విగ్గీ, జొమాటో రికార్డులు పరిశీలిస్తే భారత్ లో అత్యథికంగా వచ్చే ఆర్డర్లు బిర్యానీవే. కానీ బిర్యానీ మనది కాదు, అది మొఘలాయీల ఆస్థాన వంటకం. మొఘల్ చక్రవర్తులతోపాటు అది భారత్ కి వచ్చింది. మొఘల్ సైన్యంకోసం అప్పటికప్పుడు త్వరగా పూర్తిచేసి వడ్డించేందుకు బిర్యానీని మెనూలో చేర్చారట. కానీ ఇప్పుడు బిర్యానీ అంటే అందులో ఇండియన్ స్టైల్ అనేది ప్రత్యేకంగా మారింది.

చికెన్ టిక్కా మసాలా..

బిర్యానీకి భారత్ పుట్టిల్లు కాదంటేనే ఎవరూ నమ్మరు, అలాంటిది చికెన్ టిక్కా మసాలా కూడా మనది కాదు అంటే ఎవరైనా నమ్ముతారా. కానీ అది కూడా మనది కాదు అనేది పచ్చి నిజం. చికెన్ టిక్కా మసాలాని బంగ్లాదేశ్ కి చెందిన ఓ వంటమాస్టర్ స్కాట్లాండ్ లో మొదటిసారిగా తయారు చేశాడు. ఆ తర్వాత అది అనేక రూపాంతరాలు చెంది భారత్ లో చికెన్ టిక్కా మసాలాగా బాగా ఫేమస్ అయింది. అమెరికా, యూకేలో కూడా ఇండియన్ స్టైల్ చికెన్ టిక్కా మసాలా కావాలని అడిగి మరీ తీసుకెళ్తారు.

రాజ్మా..

ఉత్తర భారతంలో రాజ్మా బాగా ఫేమస్. పంజాబ్ లో రాజ్మా లేని ఇల్లు ఏదీ ఉండదు. అలాంటిది రాజ్మా కూడా మనది కాదంటే నమ్మాల్సిందే. అది మెక్సికో వంటకం. పోర్చుగీసు వారి దండయాత్రల సమయంలో రాజ్మా భారత్ లోకి వచ్చింది. ఉత్తరాదివారికి రోజువారీ వంటకంగా మారిపోయింది.

గులాబ్ జామ్..

నోరూరించే గులాబ్ జామ్ లు కూడా మనం అరువు తెచ్చుకున్నవే. పర్షియాలో గులాబ్ జామ్ రెసిపీ మొదలైంది. టర్కీ నుంచి గులాబ్ జామ్ భారత్ కు పరిచయం అయింది. మొదట్లో వీటిని తేనెలో నానబెట్టి తినేవారు. కానీ భారత్ లో గులాబ్ జామ్ కి చక్కెరపాకం చక్కని కాంబినేషన్ గా మారింది.

విండలూ..

గోవాలో విండలూ అనే వంటకం బాగా ఫేమస్. పంది మాంసంతో చేసే ఈ వంటకాన్ని పోర్చుగీస్ వారు మనకు పరిచయం చేశారు. ఆ తర్వాత దీనికి గోవా మెట్టిల్లుగా మారింది.

టీ..

భారతీయులకు సూర్యోదయంతోపాటు ఉదయాన్నే గొంతులో కాసిని టీ నీళ్లు పడితేనే తెల్లారినట్టు లెక్క. బెడ్ టీ తో మొదలయ్యే ఈ పానీయం.. భారతీయుల జీవన విధానంలో ఓ భాగంగా మారింది. ఎవరైనా బంధువులు ఇంటికొస్తే ముందు టీ తాగుతారా అని అడగటం మర్యాద. ప్రపంచంలో టీ వినియోగంలో రెండో అతిపెద్ద దేశం భారత్. అయితే టీ కూడా మనది కాదు అనేది నిజం. టీ పుట్టిల్లు చైనా. చైనాలోని హన్ వంశీయులైన రాజుల కాలంలో టీ వాడకం మొదలైంది. అప్పట్లో కేవలం రాజులు మాత్రమే ఈ పానీయం తాగేవారు. రాజరికానికి చిహ్నంగా టీ ఉండేది. ఇప్పుడు సామాన్యుల జీవితంలో టీ భాగమైపోయింది.

ఈ వంటకాలు, పానీయాలేవీ మనవి కావు. కానీ వీటికి భారత్ పుట్టిల్లు అనేంతగా వాటిపై మన బ్రాండ్ పడిపోయింది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి, చివరకు ఇండియన్ స్టైల్ అనే దగ్గరకొచ్చేసరికి వాటికి బ్రహ్మాండమైన క్రేజ్ వచ్చేసింది.