చాట్ జీపీటీకి అనూహ్య స్పందన వచ్చిన తర్వాత అసలా ఐడియా తమకెందుకు రాలేదని మథన పడ్డాయి మైక్రోసాఫ్ట్, గూగుల్ సంస్థలు. చాట్ జీపీటీకి పోటీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలను లైన్లోకి తెచ్చాయి. బార్డ్ పేరుతో గూగుల్ కొత్త చాట్ బాట్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.
మైక్రోసాఫ్ట్ తన బింగ్ సెర్చ్ ఇంజిన్లో మార్పులు చేర్పులు చేసి చాట్ బాట్ వ్యవస్థను తెరపైకి తెచ్చింది. అయితే ఈ రెండూ చాట్ జీపీటీకి పోటీ ఇవ్వలేకపోతున్నాయి. పేరుగొప్ప మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన బింగ్ చాట్ బాట్ లో అప్పుడే మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చింది. బింగ్ చాట్ బాట్ కి పలు లిమిటేషన్స్ పెట్టేసింగి మైక్రోసాఫ్ట్.
సెషన్ కి 5, రోజుకి 50
బింగ్ సెర్చ్ ఇంజిన్ లో చాట్ బాట్ వినియోగించుకునేవారు ఒక్కో సెషన్ లో కేవలం 5 ప్రశ్నలు మాత్రమే అడగాలి, అంటే 5 ప్రశ్నలకు మాత్రమే బింగ్ సమాధానాలు చెబుతుంది. ఇక రోజుకి కేవలం 50 ప్రశ్నలకు మాత్రమే బింగ్ సమాధానాలు ఇవ్వగలదు. అంతకంటే ఎక్కువ ప్రశ్నలు అడిగితే చాట్ బాట్ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలున్నాయని మైక్రోసాఫ్ట్ టెక్నికల్ టీమ్ చెప్పడం గమనార్హం. ఆటోమేటిక్ గా యూజర్లు తక్కువ ప్రశ్నలు అడిగే విధంగా చాట్ బాట్ కి కోడింగ్ మార్చేశారు.
బింగ్ తో అన్నీ సమస్యలే..
చాట్ జీపీటీతో బింగ్ పోటీపడలేకపోతోంది. బింగ్ ని అడిగే ప్రశ్నలకు సూటిగా సమాధానాలు రాకపోవడంతోపాటు, అడ్వర్టైజ్ మెంట్ సెషన్లు అప్ డేట్ అవుతున్నాయి. అంటే పరోక్షంగా ఈ చాట్ మోడల్ ని కూడా మైక్రోసాఫ్ట్ తన సెర్చ్ ఇంజిన్ కస్టమర్లకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటోందనమాట.
వాస్తవానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ పూర్తి స్థాయిలో వినియోగదారులకు అందుబాటులోకి తేలేకపోతున్నాయి. కేవలం ఓపెన్ ఏఐ తయారు చేసిన చాట్ జీపీటీని వెనక్కు నెట్టేందుకు మాత్రమే హడావిడి ప్రయత్నాలు మొదలు పెట్టి అభాసుపాలయ్యాయి. ఇప్పుడు సమాధానాలకు కూడా లిమిటేషన్స్ పెట్టి మైక్రోసాఫ్ట్ కవర్ చేసుకోలేక కష్టాలు పడుతోంది.