జనసేనాని పవన్‌కల్యాణ్‌ను రాజకీయంగా నమ్ముకుంటే నట్టేట మునిగిపోవడం ఖాయమని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ భయపడ్డారు. అందుకే కులపరంగా పవన్‌పై అభిమానం ఉన్నప్పటికీ, రాజకీయంగా జనసేనకు భవిష్యత్ లేదని కన్నా భావించారు. బీజేపీపై అసంతృప్తిగా ఉన్న కన్నా కోసం నాదెండ్లతో పవన్ రాయబారం నడిపారు. పవన్‌పై తనకెంతో ప్రేమ ఉన్నట్టు కన్నా తన మార్క్ రాజకీయ నటన ప్రదర్శించారు. పవన్‌కు అండగా వుంటానని కూడా ఆయన బహిరంగంగా ప్రకటించారు.
చివరికి చంద్రబాబు పంచన చేరడానికే కన్నా నిర్ణయించుకున్నారు. ఇటీవల బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వ్యవహారశైలి నచ్చకపోవడంతో బీజేపీ నుంచి బయటికి వచ్చినట్టు కన్నా ప్రకటించిన సంగతి తెలిసిందే. భవిష్యత్ కార్యాచరణ గురించి త్వరలో ప్రకటిస్తానని కన్నా ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో ఇవాళ తన అనుచరులతో కన్నా కీలక సమావేశం నిర్వహించారు.
టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు అనుచరులకు తేల్చి చెప్పారు. ఇదంతా నాటకీయంగా కన్నా నడుపుతున్నారనేది బహిరంగ రహస్యమే. ఎందుకంటే టీడీపీ అగ్రనేతలతో కన్నా చాలా రోజులుగా టచ్‌లో ఉన్నారు. రాజకీయంగా తన ప్రతిపాదనల్ని చంద్రబాబు ముందు కన్నా వుంచారు. ఇందుకు సానుకూల స్పందన రావడంతో సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావుపై ఘాటు వ్యాఖ్యలకు కన్నా దిగారు. చివరికి పార్టీని వీడారు.
సత్తెనపల్లి నుంచి పోటీకి టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే తన వాళ్లకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరికను చంద్రబాబు మన్నించినట్టు తెలిసింది. దీంతో ఈ నెల 23 లేదా 24 తేదీల్లో చంద్రబాబు సమక్షంలో కన్నా లక్ష్మీనారాయణ పసుపు కండువా కప్పుకోనున్నారు. ఇదే విషయాన్ని ఇవాళ అనుచరులతో కన్నా లక్ష్మీనారాయణ చెప్పడం గమనార్హం. జనసేనానిపై కన్నా ఉత్తుత్తి ప్రేమ మాటలే తప్ప, ఆచరణలో నిల్ అని చెప్పొచ్చు.