విధి ఆడిన వింత ఆట-తారకరత్న

పోయినోళ్లు అందరూ మంచోళ్లు అన్నాడు మహాకవి ఆత్రేయ. ఓ మహానటుడికి, మహా నాయకుడికి మనవడుగా పుట్టి కూడా సరైన జీవితాన్ని తయారు చేసుకోలేక, 39 ఏళ్ల తక్కువ వయసులో ఈ జీవిత యవనిక మీద…

పోయినోళ్లు అందరూ మంచోళ్లు అన్నాడు మహాకవి ఆత్రేయ. ఓ మహానటుడికి, మహా నాయకుడికి మనవడుగా పుట్టి కూడా సరైన జీవితాన్ని తయారు చేసుకోలేక, 39 ఏళ్ల తక్కువ వయసులో ఈ జీవిత యవనిక మీద నుంచి నిష్క్రిమించాడు నందమూరి తారకరత్న. బతికున్నపుడు పంతాలు, పట్టింపులతో తండ్రి ఇంట్లో రాకో..రాలేకో బయటే వుండిపోయినా, ఇప్పుడు అతగాడి మృతదేహం ఆ ఇంటికే చేరింది. విధి ఎంత విచిత్రమైనది. డెస్టినీ అంటే ఇదేనా?

పెద్ద కుటుంబంలో పుట్టాడు. ఓ విధంగా గోల్డెన్ స్పూన్ జీవితం. మరే వ్యాపారంలోకి వెళ్లినా ఎలా వుండేదో జీవితం. కానీ నటన వైపు వచ్చాడు. క్లిక్ కాలేకపోయాడు. అయినా సమస్య కాలేదు. బాబాయి దగ్గర నుంచి అందరూ కొన్నాళ్లు బాగానే చూసుకున్నారు. కానీ ఎప్పుడయితే పెళ్లి చేసుకున్నాడో, ఎప్పుడయితే అనివార్యమై కొన్ని కొన్ని తప్పటడుగులు వేసాడో అయిన వారందరికీ దూరమైపోయాడు. 

ఒకప్పుడు అన్ని విధాలా ఆదరించిన వారు సైతం అపాయింట్ మెంట్ ఇవ్వని పరిస్థితి. తండ్రితో పంతంతో ఇంట చేరని, చేరలేని వైనం. ఇవన్నీ కలిసి తారకరత్న జీవితాన్ని మరింత చిన్నా భిన్నం చేసాయి.

పెళ్లి చేసుకున్నా, తండ్రి అయినా కుటుంబం దూరంగానే వుంచింది. మొత్తానికి ఏదో మంచికో చెడుకో బుద్ది పుట్టింది. రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్నాడు. కానీ అక్కడా పాపం, విధి వక్రీకరించింది. బతికి వున్నన్నాళ్లు తారకరత్నకు దక్కాల్సినంత గౌరవం దక్కిందా? దక్కించుకోలేకపోవడంతో అతని పాత్ర ఎంత? ఇవన్నీ పక్కన పెడితే పోయిన తరువాత మాత్రం ఘనమైన నివాళి దక్కింది.

ముఖ్యమంత్రుల దగ్గర నుంచి అతిరథ మహారథులంతా నివాళి అర్పించారు. బతికున్నపుడు మొహం చాటేసిన వారు సైతం తరలి వచ్చారు. అంతకన్నా ఏం కావాలి? తారకరత్నతో పరిచయం వున్నవారు ఒకటే అంటారు. 

తారకరత్న జీవితం అతనితో ఆడుకుందా? అతనే తన జీవితంతో ఆడుకున్నాడా? లేదా మొండితనం అన్నది అతన్ని అలా తయారుచేసిందా? మొత్తానికి ఇలా స్వల్ప సమయంలో విషాదాంతం అయిపోయింది.