రాజకీయంగా ప్రత్యర్థులైన నారా చంద్రబాబునాయుడు, విజయసాయిరెడ్డి మీడియా సమావేశంలో కలిసి పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది. చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నంత సేపూ విజయసాయిరెడ్డి శ్రద్ధగా వింటూ నిలిచి వున్నారు. నిజానికి ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రత్యర్థులుగా కంటే శత్రువులుగా వ్యవహరిస్తున్నారు. పరస్పరం దూషణలకు బరితెగించారు.
ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాలు కలుషితం అయ్యాయనే ఆవేదన ప్రతి ఒక్కరిలోనూ వుంది. ఈ పరిస్థితుల్లో కారణం ఏదైనా చంద్రబాబునాయుడు, విజయసాయిరెడ్డి ఇద్దరూ కలిసి మీడియా సమావేశంలో పాల్గొనడం సంతోషించాల్సిన విషయం.
సినీ నటుడు తారకరత్న మృత్యువుతో పోరాటంలో అలసిపోయి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. తారకరత్న భార్య స్వయాన విజయసాయిరెడ్డి మరదలి కుమార్తే. విజయసాయిరెడ్డికి తారకరత్న వరుసకు అల్లుడవుతాడు. మరోవైపు చంద్రబాబుకు తారకరత్న బామ్మర్ది కుమారుడు. వరుసకు అల్లుడవుతాడు.
విజయసాయిరెడ్డి మృతుని ఇంటికి వెళ్లి అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇదే సందర్భంలో చంద్రబాబు వెళ్లారు. తారకరత్నకు నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చిన్నవయసులోనే తారకరత్న మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డిని పక్కనే పెట్టుకుని చంద్రబాబు మాట్లాడ్డం విశేషం.
చంద్రబాబు, లోకేశ్‌పై ట్విటర్ వేదికగా విజయసాయిరెడ్డి దారుణ కామెంట్స్ చేసేవారు. గత రెండు నెలలుగా విజయసాయిరెడ్డి పూర్తిగా సైలెంట్ కావడంపై వైసీపీలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పుడు బాబు, విజయసాయిరెడ్డి ఒకే చోట కనిపించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.