బోడెద్దుకు పోట్లు మప్పడం అనేది వెనకటికి సామెత. బుర్రలో లేని ఆలోచనలు ప్రవేశపెట్టి, వ్యవహారం ఖరాబు చేయడానికి ఇలాంటి సామెతలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. జనసేనాని పవన్ కళ్యాణ్ కు ప్రస్తుతానికి వున్న ఆలోచన ఒకటే. ఆంధ్రలో అవకాశం వున్నన్ని సీట్లలో పోటీ చేయడం. ఎన్నో కొన్ని సీట్లు వస్తే, వాటి సంఖ్య బట్టి అధికారం షేర్ చేసుకోవడం వంటి ఆలోచనలో వున్నారు అన్నది రాజకీయ వర్గాల బోగట్టా. ఈ క్రమంలో అధికారం షేరింగ్ కోసం తెలుగుదేశంతో భావ సారూప్య పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యం లేదు. కానీ ఇలాంటి అల్పసంతోషి కి లేని పోని ఐడియాలు ఇవ్వడం అంటే ఏమి అనుకోవాలి?
ఆంధ్రజ్యోతి ఆర్కే వెల్లడించిన విషయం ఏమిటంటే ఆంధ్రలో ఓట్లు చీల్చి జగన్ కు సాయం చేయడం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఓ ఎత్తుగడ వేసారట. ఎన్నికల ఖర్చుల కింద వెయ్యి కోట్లు అయినా ఇస్తాము, విడిగా పోటీ చేయమని పవన్ దగ్గరకు దూతను పంపారట. అదీ విషయం.
ఇలాంటి అద్భుతమైన ఎక్స్ క్లూజివ్ సమాచారాన్ని అందించడం ద్వారా ఆర్కే రెండు గొప్ప ప్రయోజనాలు సాధించారు.
ఒకటి.. పవన్ కళ్యాణ్ కు డబ్బు ఆశ చూపించవచ్చు.
రెండు..పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇదే డీల్ ను తెలుగుదేశం ముందు బేరానికి వుంచుకోవచ్చు.
ఇప్పుడు ఏదో పదో ఇరవయ్యో సీట్లు విదిల్చి పవను ను పక్కకు తీసుకుని, అధికారం సంపాదించేయవచ్చు అనే ఆలోచనలో వుంది తెలుగుదేశం పార్టీ. కానీ అలా కాదు, తన బలం విలువ వెయ్యి కోట్ల ఖర్చు అని చెప్పి, పవన్ తన డిమాండ్లకు పదునుపెడితే చంద్రబాబు పరిస్థితి ఏం కాను? ఎక్కడో ఓ పాయింట్ దగ్గర బెడిసి కొట్టి, ఇగో క్లాష్ లకు దారి తీస్తే పరిస్థితి ఏమిటి?
ఆ సంగతి అలా వుంచితే ఇదేదో డీల్ బాగుందే, ఈసారి పరిస్థితులు అనుకూలిస్తాయేమో, మళ్లీ మరోసారి ఒంటరిగా తన లక్ పరిశీలించుకుందాం అని పవన్ అనుకుంటే అప్పుడు పరిస్థితి ఏమిటి?
ఇవన్నీ అలా వుంచితే వెయ్యి కోట్లు ఖర్చులకు అని ఆర్కే రాసినా, పవన్ కళ్యాణ్ అంటే గిట్టని వారికి అదేదో ప్యాకేజ్ మాదిరిగా వినిపిస్తుంది. అసలే పవన్ మీద ఈ ఆరోపణలు, విమర్శలు ఎప్పటి నుంచో వున్నాయి. ఇకపై వెయ్యి కోట్ల ప్యాకేజ్ అన్న పదం ప్రాచుర్యంలోకి తీసుకువస్తారు.
ఇన్ని బహుళార్ధక ప్రయోజనాలు, అపార్థాలకు దారితీసే వ్యాసాన్ని ఆర్కే వండి వార్చడం అన్నది తెలుగుదేశం అభిమానులకు సైతం ఇప్పుడు మింగుడు పడడం లేదు. ఆర్కే మీద సోషల్ మీడియాలో కారాలు మిరియాలు నూరుతున్నారు. శతృవులు ఎక్కడో వుండరు, మన పక్కనే వుంటారు అనే డైలాగు మాదిరిగా ఆర్కేను చంద్రబాబు శతృవుగా ముడేస్తున్నారు. నిజానికి ఆర్కే తెలిసో, తెలియకో తెలుగుదేశానికి మేలు చేయబోయి కీడు చేస్తారనే విమర్శ చాలా ఏళ్లుగా వుంది. ఇప్పుడు ఇలాంటి వ్యాసాలు వండి వార్చడం ద్వారా తెలుగుదేశం-జనసేన సంబంధాలు దెబ్బతింటాయనే భయం వుండనే వుంది.
కేసిఆర్ ను కూడా..
ఆంధ్రలో చంద్రబాబు పర్యటనకు అడ్డం పడ్డారని జగన్ మీద మండి పడ్డారు ఆర్కే. అలా రాయడం సహజమే. ఇలాంటి తప్పుడు బుద్ది ఎవరికి పుట్టింది, దీని వల్ల జగన్ మరింత డ్యామేజ్ అవుతున్నారని సుద్దులు కూడా చెప్పారు. బాగానే వుంది. మరి తెలంగాణలో పరిస్థితి ఏమన్నా వేరుగా వుందా? ప్రతిపక్షాల పర్యటనలకు ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుస్తోందా? భాజపా నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు తెరాస శ్రేణుల నుంచి ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొంటున్నారు. షర్మిల మీద ఎస్సీ ఎస్టీ కేసు ఎవరు పెట్టారు. యాత్రను ఆపేసి, అరెస్ట్ చేసి, వెనక్కు తీసుకువస్తున్నది ఎవరు?
మరి కేసిఆర్ మీద కూడా తానులకు తానులు వండి వార్చ వచ్చు కదా..పలుకులో అస్సలు ఉడకని పలుకులు లేకుండా చూసుకుని. జగన్ ఒక్కడే ఆర్కేకు చిక్కిన మేక అనుకోవాలేమో?