నందమూరి తారకరత్న మహాశివరాత్రి రోజు తుదిశ్వాస విడిచారు. ఇది లోకం దృష్టిలో. కానీ లోకేశ్ పాదయాత్ర రోజు గుండె పోటుకు గురై, అప్పుడే ప్రాణాలు వదిలారనేది నందమూరి లక్ష్మీపార్వతి వాదన. చంద్రబాబు దుర్మార్గమైన రాజకీయ స్వార్థానికి తమ కుటుంబం (నందమూరి) నరకం అనుభవిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ ఆమె ఓ చానల్‌తో మాట్లాడుతూ తారకరత్న మృతిపై సంచలన కామెంట్స్ చేశారు.
తారకరత్న మృతి చాలా బాధాకరం. మరోసారి నీచమైన రాజకీయం తమ కుటుంబంలో బయటపడిందన్నారు. కేవలం తన కొడుకు కోసం, రాజకీయ స్వార్థంతో చంద్రబాబు నాటకాలాడారని విమర్శించారు. తారకరత్న ప్రాణాలు ఎప్పుడో పోయాయని, అయినా ఇంత కాలం ఆ అబ్బాయిని అలా వుంచడం ఏం రాజకీయమని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. ఇలాంటి రాజకీయాలకు అంతం లేదా? అని ఆమె ప్రశ్నించారు.
చంద్రబాబు వల్ల తన భర్త ఎన్టీఆర్ కుమిలికుమిలి చనిపోయారని లక్ష్మీపార్వతి గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఎంతో మంచి పిల్లాడైన తారకరత్న వాళ్లకు సాయం చేయడానికి పాదయాత్రకు వెళ్లాడన్నారు. అక్కడ చనిపోతే పాదయాత్రను వాయిదా వేసుకుంటే ఏమయ్యేదని ఆమె నిలదీశారు. ఒక వారం తర్వాత పాదయాత్ర పెట్టుకుని వుంటే సరిపోయేది కదా అని ఆమె ప్రశ్నించారు. తారకరత్న మరణం ఆ రోజే సంభవించినట్టు డాక్టర్లు అప్పుడే చెప్పారన్నారు.
గుండె ఆగిపోయిందని చెప్పినప్పుడే అందరికీ అర్థమైందన్నారు. కానీ పాదయాత్రలో చనిపోతే, ప్రజలు అపశకునంగా భావిస్తారనే స్వార్థంతో ఇదంతా నడిపారన్నారు. కానీ తండ్రీతనయులు అపశకునం అని అందరికీ తెలుసన్నారు. ఈ ఎపిసోడ్ గుండెల్ని పిండేస్తోందని ఆమె వాపోయారు. ఇలాంటి దుర్మార్గాన్ని రాజకీయ పబ్బం కోసం వాడుకోవడం ఒక్క చంద్రబాబుకే తెలుసన్నారు.