అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విషయానికి వస్తే ఎంతో తేడా? తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అనుచిత వ్యాఖ్య చేశారనే కారణంతో ఆమెను అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. అంతటితో ఆగలేదు. ఏకంగా షర్మిల పాదయాత్ర అనుమతుల్ని రద్దు చేశారు. అంటే షర్మిల అడుగులు రేపటి నుంచి ముందుకు పడవు. మళ్లీ ఆమె హైకోర్టును ఆశ్రయించి, ఏదైనా ఉపశమనం పొందితే తప్ప!
ఇదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే సీఎం జగన్‌పై ఇష్టానుసానం ప్రత్యర్థులు నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే వున్నారు. కానీ చర్యలు తీసుకునే దిక్కే లేకుండా పోయింది. ఒకవేళ కేసులు పెట్టినా, ఏమవుతున్నదో మనందరికీ తెలిసిందే. టీడీపీ యువనేత నారా లోకేశ్ ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన సీఎం జగన్‌పై ఇష్టానుసారం నోరు పారేసుకున్నారు.
అరేయ్, ఒరేయ్, నా కొడకా , పిరికిపందా అంటూ జగన్‌పై లోకేశ్ ఇష్టమొచ్చినట్టు తిట్ల వర్షం కురిపించారు. అయినా ఆయన్ను ఏ శక్తీ అడ్డుకోలేకపోతోంది. లోకేశ్ పాదయాత్రకు జనం నుంచి అంతంత మాత్రమే స్పందన వస్తోంది. దీంతో ప్రభుత్వం అడ్డుకుంటే నైనా ప్రచారం పొందవచ్చనే చిల్లర ఎత్తుగడకు లోకేశ్ పాల్పడ్డానికే అవాకులు చెవాకులు పేలుతున్నారనే అభిప్రాయాలు లేకపోలేదు.
కారణాలేవైనా లోకేశ్ ఏం మాట్లాడినా ఏపీ ప్రభుత్వం మాత్రం చేష్టలుడిగి ప్రేక్షకపాత్ర పోషిస్తోంది. ఇదే తెలంగాణలో భిన్నమైన పరిస్థితులున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులను పోల్చుతూ రాజకీయ చర్చకు తెరలేపారు.