హ్యాట్సాఫ్….ఆర్కే

ప్రత్యర్థి బలహీనతలను, బలాన్ని కరెక్ట్ గా అంచనా వేసి, అక్కడ దెబ్బ కొట్టగలిగినవాడే మొనగాడు. వైకాపా నేత, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బలాన్ని అంచనా వేయలేక, కేవలం బలహీనతలను హైలైట్ చేస్తూ వచ్చారు…

ప్రత్యర్థి బలహీనతలను, బలాన్ని కరెక్ట్ గా అంచనా వేసి, అక్కడ దెబ్బ కొట్టగలిగినవాడే మొనగాడు. వైకాపా నేత, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బలాన్ని అంచనా వేయలేక, కేవలం బలహీనతలను హైలైట్ చేస్తూ వచ్చారు ఇటు తెలుగదేశం నేతలు, అలాగే ఆ పార్టీ మద్దతు మీడియా కూడా. కానీ ఈ వ్యూహం బెడిసి కొట్టి, జగన్ అధికారంలోకి వచ్చారు. 

ఇప్పటికీ ఈ విషయంలో తెలుగుదేశం పార్టీకి జ్ఞానోదయం అయినట్లు లేదు. కానీ ఆంధ్రజ్యోతి ఆర్కే మాత్రం సూక్ష్మం గ్రహించారు. జగన్ ను బలహీనుణ్ణి చేస్తే తప్ప దెబ్బతీయలేం అని తెలుసుకున్నారు. అందుకే ఇప్పుడు జగన్ ను ఎలా దెబ్బతీయాలి అన్నది అర్థం చేసుకుని ఆచరణలో పెడుతున్నారు.

గత ఆరునెలలుగా ఆర్కే రాస్తున్న రాతలు గమనిస్తే ఇది ఇట్టే అర్థం అయిపోతుంది ముందుగా ఆయన జగన్ బలాలు ఏమిటి? అన్నది తెలుసుకున్నారు. భాజపా మద్దతు వుంది. తెరాస మద్దతు వుంది. బ్రాహ్మణుల మద్దతు వుంది. కాపులు కూడా కొంత కాపు కాసారు. బిసిల సంగతి సరేసరి. 

ఇప్పుడు ఏం చేయాలి? విభజించి పాలించు అన్నట్లుగా, ఈ వర్గాలు అన్నింటినీ జగన్ కు దూరం చేయాలి. అదీ ప్లాన్. ఆ దిశగా ఆయన వార్తలు వండి వార్పించడం, తను స్వయంగా వ్యాసాలు వండి వార్చడం ప్రారంభించారు.

ముందుగా భాజపాకు వైకాపాకు చెడింది అన్న ప్రచారం వీలయినంతగా ఆయన రాతల్లో కనిపించింది. భాజపా ఎంపీలు ఇలా అంటున్నారు. నేతలు ఇలా చెబుతున్నారు అంటూ గ్యాసిప్ లు వ్యాసాలుగా మారి బయటకు వచ్చాయి.

ఎల్ వి సుబ్రహ్మణ్యం ఉదంతాన్ని ఆసరగా తీసుకుని, బ్రాహ్మణులను దూరం చేసే విధంగా తెలివైన రాతలు పుట్టుకువచ్చాయి. క్రిస్టియానిటీ వ్యవహారాలు చూపించి, హిందూ వాదులను, బ్రాహ్మణులను దూరం చేయించే కార్యక్రమం రాతల్లో కనిపించింది.

పవన్ కళ్యాణ్ ను నెత్తిన పెట్టుకుని ఆ విధంగా కాపులను ఇటు రప్పించే కార్యక్రమం మరో వైపు. ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ ఇదే ఆర్కే గురించి మాట్లాడుతూ, కాస్త సంస్కారం కూడా భోజనంలో వడ్డించమ్మా అని ఆర్కే భార్యకు సలహా ఇచ్చారు. ఇప్పుడు అదే పవన్ ఇంటర్వూ జ్యోతిలో ప్రముఖంగా వచ్చేసింది. అంటే సంస్కారం వడ్డించేసారని పవన్ అనుకున్నారో? లేక పవన్ మాటలను ఆర్కే మరిచిపోయారో?

ఇక ఈవారం లేటెస్ట్ గా కేసిఆర్ కు జగన్ కు మధ్య ఎడం పెంచే ప్రయత్నం రాతల్లో కనిపించింది. అలాగే అధికారులకు జగన్ మధ్య దూరం పెంచే ప్రయత్నం కూడా. ఇక మిగిలింది బిసి లు. వీరిని ఎలా దూరం చేయాలి? అందుకే ఎక్కువ పదవులు అన్నీ రెడ్లకే అంటూ ఓ స్టోరీ. రెడ్లకు పేరు వెనుక తోక వుంటుంది కాబట్టి సులువుగా గుర్తు పట్టేయచ్చు. కమ్మ వారిని అలా గుర్తు పట్టడం వీజీ కాదు. తెలుగుదేశం హయాంలో లిస్ట్ కూడా ఆర్కే సంపాదించి ప్రచురించి వుంటే బాగుండేది. కానీ ఆయన అలా చేయరు కదా?

మొత్తం మీద అన్ని వర్గాలను జగన్ కు దూరం చేయాలి లేదా జగన్ కు వారికి మధ్య విభజించు పాలించు తరహా సూత్రం అమలు చేయాలనే ఆర్కే సూత్రం ఆయన రాస్తున్న వ్యాసాలు, ఆయన పత్రికలో వస్తున్న వ్యాసాలు అన్నీ పక్క పక్కన పెట్టి చూస్తే ఇట్టే అర్థం అయిపోతుంది.  చంద్రబాబు కోసం ఇంత కష్టపడుతున్న ఆయన నిజంగా గొప్పవాడు. చంద్రబాబు కన్నా ఎక్కువగా వ్యూహరచన చేసి అమలు చేయగలుగుతున్నారు. హ్యాట్సాప్ ఆర్కే.

కానీ ఆర్కే తెలుసుకోవాల్సింది ఏమిటంటే జగన్ ఇలా పాలిస్తున్నంతకాలం జగన్ కు జనానికి మద్య విభజన సాధించడం అంత సులువు కాదు. అక్కడ ఈ రాతలు పనిచేయడం లేదని ఆయన తెలుసుకోవాలి.