భోళా..ఆగస్టు…పుప్ప 2..మార్చి 2024!

ఈ ఏడాది సినిమాల సంగతి అలా వుంచితే వచ్చే ఏడాది మీద ఎగ్జిబిటర్లు గట్టి ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతి, సమ్మర్, పోస్ట్ సమ్మర్, దసరా సీజన్లలో తప్పిస్తే మరీ ఎక్కువ సినిమాలు…

ఈ ఏడాది సినిమాల సంగతి అలా వుంచితే వచ్చే ఏడాది మీద ఎగ్జిబిటర్లు గట్టి ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతి, సమ్మర్, పోస్ట్ సమ్మర్, దసరా సీజన్లలో తప్పిస్తే మరీ ఎక్కువ సినిమాలు ఈ ఏడాది లేవు. 

ఎన్టీఆర్, బన్నీ, చరణ్ సినిమాలు ఏవీ ఈ ఏడాది లేనట్లే. మహేష్, మెగాస్టార్, ప్రభాస్ సినిమాలు మాత్రమే వుండే అవకాశం వుంది. అందువల్ల అందరి దృష్టి వచ్చే ఏడాది మీద పడింది. అక్కడ కాస్త గట్టి పోటీ కనిపిస్తోంది. అందుకే ఇప్పటి నుంచి డేట్ లు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా డేట్ ను సంక్రాంతి 2024 కు ప్రకటించేసారు. వేసవిలో రామ్ చరణ్-శంకర్ సినిమా వుంటుందంటున్నారు. ఈ రెండింటి మధ్యలో బన్నీ – సుకుమార్ పుష్ప 2 సినిమా వుండే అవకాశం వుంది. మరి ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా పరిస్థితి ఏమిటో తెలియాలి. ఇప్పటి నుంచి వేగంగా రెడీ చేసినా, సంక్రాంతికి ప్రభాస్ సినిమాతో పోటీకి దిగాలి లేదా, 2024 సమ్మర్ వరకు వేచి వుండాలి.

ఇదిలా వుంటే ఈ ఏడాది ఆగస్ట్ 11 డేట్ కు కూడా మంచి పోటీ కనిపిస్తోంది. ఈ డేట్ కు మహేష్-త్రివిక్రమ్ సినిమా వస్తుందని ఇప్పటికే ప్రకటించారు. కానీ ఇదే డేట్ కు మెగాస్టార్ భోళాశంకర్ కూడా వస్తుందని వినిపిస్తోంది. మరి మహేష్ సినిమాను ఎక్కడికి జరుపుతారో చూడాలి. ఇదిలా వుంటే అనిల్ రావిపూడి-బాలయ్య సినిమాను ఈ ఏడాది దసరాకు ఫిక్స్ చేసుకున్నారు. దానికి కాస్త అటు ఇటు ఇటుగా ప్రభాస్ సలార్ వుంటుంది.

ఇలా మొత్తం మీద ఇప్పుడు టాలీవుడ్ లో డేట్ ల సర్దుబాటు కార్యక్రమాలు జరుగుతున్నాయి.