శివరాత్రి ఉత్సవం గొప్పగా వాడవాడలా జరుగుతుంది. మహాశివుడిని సోషలిస్ట్ అంటారు. ఆయన పేదల పక్షపాతి అని కూడా అంటారు. ఆయన శ్మశాన వాకిట ఉంటాడు. పులి చర్మం ధరించి అతి నిరాడంబరుడిగా కనిపిస్తాడు. ఆయన సంపన్నుడు అయిన స్వామి కాదు, మాస్ జనాలకు అసలైన దేవుడిగా మహా శివుణ్ణి చెప్పుకోవాలి.
శివరాత్రి ఉత్సవాలు ఆలయాల్లో వైభవంగా జరుగుతాయి. కానీ జనంలోకి శివుణ్ణి తెచ్చి సాదర జనాలకు అభిషేకం చేసుకునే అవకాశం కల్పించిన వారిలో విశాఖలో చూస్తే కళా బంధు టి సుబ్బరామిరెడ్డి కనిపిస్తారు. ఆయన ప్రతీ ఏటా విశాఖ బీచ్ లో కోటి శివలింగాలు ప్రతిష్టించి అంగరంగ వైభవంగా శివరాత్రి వేడుకలను జరిపించేవారు.
కరోనా రానంతవరకూ ఈ ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగేవి. గత మూడేళ్ళుగా బ్రేక్ పడింది. దాంతో టీఎస్సార్ కూడా ఆపేశారు. వయోభారం ఒక కారణంగా చెబుతారు. సాగర తరంగాలతో పోటీ పడుతూ ఉత్సవాలను రోజంతా విరామం లేకుండా నిర్వహించిన ఘనత మాత్రం ఆయనదే అని అంటారు.
విశాఖలో శివరాత్రి వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతున్న సాగరతీరాన్ని చూస్తే మాత్రం ఆ లోటు అలా కనిపిస్తుంది. రెడ్డి గారు అలా బలమైన ముద్ర వేశారు. పరమ శివుని పరమ భక్తుడిగా ఆయన మూడున్నర దశాబ్దాలుగా ఒక యాగం మాదిరిగా శివరాత్రి ఉత్సవాలను జరిపించిన తీరు మాత్రం నభూతో నభవిష్యత్తు అనే ఎవరైనా అంటారు.
రాజకీయ నాయకులకు ఆధ్యాత్మికత ఉన్నా అది వారికే సొంతం. కానీ టీఎస్సార్ అలా కాదు అపర భక్తుడిగా ఆయన దర్శనమిస్తారు. సినీ పరిచయాలు అటు వివిధ రంగాల ప్రముఖులతో తన సాన్నిహిత్యాన్ని కూడా మేళవించి అందరినీ విశాఖ రప్పించి కనువిందుగా శివరాత్రి పండుగను చేసిన టీఎస్సార్ విశాఖ దత్తపుత్రుడు. రాజకీయంగా ఆయన ఇపుడు చురుకుగా లేరు. కాంగ్రెస్ కే కట్టుబడిపోయారు. అలా తన రాజకీయాన్ని కూడా ఆయన అక్కడే ఆపేశారు.