కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు పంపింది. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డి గత నెల 28న సీబీఐ విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. వివేకా హత్య కేసు విచారణను తెలంగాణకు సుప్రీంకోర్టు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అవినాష్‌రెడ్డి గత నెలలో హైదరాబాద్‌కు వెళ్లి సీబీఐ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని సీబీఐ అధికారులు తనతో అన్నట్టు అవినాష్‌రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈ నెల 24న విచారణకు హాజరు కావాలని అవినాష్‌రెడ్డి వాట్సప్‌నకు సీబీఐ అధికారులు నోటీసులు పంపారు. కాల్ డేటా ఆధారంగా అవినాష్‌రెడ్డిని మొదటి విడతలో విచారించిన సంగతి తెలిసిందే. అవినాష్‌రెడ్డి చెప్పిన సమాచారం మేరకు వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, అలాగే వైఎస్ భారతి పీఏ నవీన్‌లను సీబీఐ అధికారులు కడపలో ఇటీవల విచారించారు.
వాళ్ల నుంచి సేకరించిన వివరాలు, ఇతరత్రా సమాచారాన్ని దగ్గర పెట్టుకుని అవినాష్‌ను సీబీఐ విచారించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత తన తండ్రి హత్య కేసు నిందితులను ఎలాగైనా పట్టుకుని శిక్షించాలనే పట్టుదలతో ఉన్నారు.
ఎంతో సౌమ్యుడిగా పేరున్న తన తండ్రిని అత్యంత దారుణంగా చంపడాన్ని ఆమె జీర్ణించుకోలేకున్నారు. వివేకా హత్య వైఎస్ కుటుంబంలో విభేదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. చివరికి సీబీఐ దర్యాప్తు ఏం తేలుస్తుందో చూడాలి.