ఫిరాయింపులు- ఎన్‌ కౌంటర్లు- చంద్రబాబు వ్యాఖ్యలు పద్దతేనా

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చాలా తీవ్రమైన ఆరోపణ చేశారు. టిడిపి ఎమ్మెల్యేలను పార్టీ మారాలని బెదిరిస్తున్నారని, లేకుంటే తెలంగాణలో మాదిరి ఏదో ఒక రేప్‌ కేసు పెట్టి ఎన్‌కౌంటర్‌ చేస్తామని బెదిరిస్తున్నారని…

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చాలా తీవ్రమైన ఆరోపణ చేశారు. టిడిపి ఎమ్మెల్యేలను పార్టీ మారాలని బెదిరిస్తున్నారని, లేకుంటే తెలంగాణలో మాదిరి ఏదో ఒక రేప్‌ కేసు పెట్టి ఎన్‌కౌంటర్‌ చేస్తామని బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. నిజానికి ఇది పెద్ద విషయం. అది నిజమే అయితే చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఈ ఆరోపణ చేసి ప్రభుత్వాన్ని నిలదీయాలి. కాని ఆయన మీడియా సమావేశంలో మాత్రమే ఈ ఆరోపణ చేశారు. దీనిపై అసెంబ్లీలో ఆయన ఏమీ చెప్పలేదు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వారు ప్రశ్నించినట్లు లేదు. ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే దిశ ఘటనలో అంత దారుణమైన పరిస్థితి ఒక యువతి ఎదుర్కుంటే జరిగిన ఎన్‌కౌంటర్‌తో చంద్రబాబు పోల్చడం. తెలంగాణలో మాదిరి ఏదో ఒక రేప్‌ కేసు పెట్టి ఎన్‌కౌంటర్‌ చేస్తామని బెదిరిస్తున్నారని చెప్పడం. 

అంటే ఆ ఎన్‌కౌంటర్‌ సరైనది కాదని చెబుతున్నారా? మరో వైపు ఆడబిడ్డ వంటి మీద చెయ్యి పడితే అదే చివరి రోజు కావాలని మహిళ భద్రత చర్చలో అంటారు. ఈ రకమైన డబుల్‌ టాక్‌ తోనే చంద్రబాబు గత ఎన్నికలలో దెబ్బతిన్నారు. అయినా ఇప్పటికీ అదే కొనసాగిస్తున్నారు. విశేషం ఏమింటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. పైగా తన అనుకూల మీడియాలో కాని, తెలుగుదేశం పరంగా కాని అభివృద్ది కోసం ఫిరాయింపులు జరిగాయని ప్రచారం చేసేవారు. అది నిజమా? అన్నది చూడాలి. నంద్యాలలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పక్షాన భూమా నాగిరెడ్డి గెలుపొందారు. ఆయన ఆ పార్టీలో ఉన్నంతకాలం ఆయనపై పలు కేసులుపెట్టారు. చివరికి ఒక పోలీస్‌ ఆఫీసర్‌తోనే ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారు. అంతేకాదు. జైలుకుపంపారు. వేధింపులతో పాటు మంత్రి పదవి ఆఫర్‌ కూడా ఇచ్చారు. 

ఈ వేదింపులకన్నా, మంత్రి పదవి బెటర్‌ అనుకుని నాగిరెడ్డి తన కుమార్తె, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియతో కలిసి టిడిపిలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. దాంతో ఆయన తీవ్రమానసిక వేదనకు గురయ్యారు. చివరికి దాని ఫలితంగానే గుండెపోటుకు గురై మరణించిన ఘట్టం ఇంకా కళ్ల ముందే ఉంది. ఆ తర్వాత అఖిలప్రియకు మంత్రి పదవి ఇచ్చారు. అలాగే కర్నూలు జిల్లాకు కొడుమూరుకు అప్పట్లో ప్రాతినిధ్యం వహించిన మణిగాంధీ స్వయంగానే వెల్లడించారు. తనకు ఎన్నికోట్లు ఇస్తానన్నది, ఎంత ఇచ్చింది.. తాను ఎలా తప్పు చేసింది అన్ని వివరాలు ఆధారాలతో సహా ఉన్నాయి కదా. ఇక అద్దంకి వైసిపి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం దెబ్బకు భయపడి పార్టీ మారిన సంగతి బహిరంగ రహస్యమే. 

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక వైసిపి ఎమ్మెల్యే అప్పులు తీర్చడంతో పాటు, ఆయన కుమారుడికి జడ్పి చైర్మన్‌ పోస్టు ఇచ్చిన విషయం అబద్దం కాదు కదా? కర్నూలు జిల్లాలో మరో వైసిపి ఎమ్మెల్యేకి బెంగుళూరులో ఎన్ని కోట్లు అందచేసింది తెలియని విషయం కాదు కదా.. ఇలా అన్ని అరాచకాలు చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు సుద్దులు చెబితే పర్వాలేదు. కాని దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు., ఏకంగా ఎమ్మెల్యేలపై రేప్‌ కేసులు పెట్టి ఎన్‌కౌంటర్‌ చేస్తామని బెదిరిస్తున్నారని అన్నారంటే దానికి ఆధారాలు చూపాలి కదా. అలాకాకుండా ఏది బడితే అది మాట్లాడితే చెల్లుతుందా? నిజంగానే జగన్‌ పిరాయింపులను ప్రోత్సహించాలనుకుంటే, ఆయన కూడా తన ఆఫీస్‌కు టిడిపి ఎమ్మెల్యేలను పిలిచి వైసిపి కండువాలు కప్పేవారు కదా.

ప్రస్తుతం ఉన్న పవర్‌ పాలిటిక్స్‌లో అదేమంత కష్టం కాదు కదా. గన్నవరం టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ వైసిపిలో చేరడానికి సిద్దమైనా ఎందుకు చేర్చుకోలేదు? పార్టీ పిరాయింపులను ప్రోత్సహించినట్లు అవుతుందనే కదా.. ఎవరైనా తన పార్టీలోకి రావాలని అనుకుంటే రాజీనామాలు చేసి రావాల్సిందేనని చట్టానికి కట్టుబడి మాట్లాడుతున్న జగన్‌ పై ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం డెబ్బై ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబుకు తగునా అన్నది ఆలోచించాలి. మరి నలుగురు టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలో ఎందుకు చేరారు? దాని గురించి చంద్రబాబు ఒక్క మాట మాట్లాడడం లేదు. ప్రధాని మోడీ కాని, హోం మంత్రి అమిత్‌ షా కాని ఎవరిని ఎన్‌కౌంటర్‌ చేస్తామని హెచ్చరించారు? అసలు మళ్లీ బిజెపితో కలవాలని చంద్రబాబు ఎంతగా తహతహ లాడుతున్నారు. 

దానికి కారణం ఏమిటి? ఎవరు బెదిరిస్తున్నారు? ఆ ఎంపీలను విలీనం చేసుకున్నట్లు ప్రకటించిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును చంద్రబాబు ఒక్క మాట అనకపోవడంలో ఉద్దేశం ఏమిటి? ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. పైగా తాను అసలు నైతిక విలువలు పాటించకుండా ఫిరాయింపులను ప్రోత్సహించి, ఎదుటివారు మాత్రం అలా చేయకూడదని నీతులు చప్పడమే చంద్రబాబు విశిష్టత అని చెప్పాలి. ఇక పవన్‌ కళ్యాణ్‌ పై విమర్శలుచేస్తారా? ఆయన పెళ్లిళ్లు గురించి మాట్లాడతారా అని కూడ చంద్రబాబు అంటున్నారు. గతంలో మంగళగిరి వద్ద పవన్‌ కళ్యాణ్‌ సభ పెట్టి తనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తే, తిరుగు జవాబు ఇప్పిస్తూ ఎలాంటి విమర్శలు చేశారో గుర్తు లేదా? అప్పట్లో టిడిపి  అధికారప్రతినిధిగా ఉన్న యామినితో ఏమని అనిపించారు. 

పవన్‌ కళ్యాణ్‌కు మల్లెపూలు నలపడం తప్ప ఏమి తెలుసునని అనిపించారే? ఆ వ్యాఖ్యలతో సంబంధం లేకపోతే అప్పుడేమీ చంద్రబాబు ఖండించలేదే? పైగా అసెంబ్లీలో ఎక్కడా ముఖ్యమంత్రి జగన్‌ ఎవరిని ఉద్దేశించి పేరు చెప్పలేదు. కొందరు రెండు, మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. అది సమాజానికి మంచిదా అని అడిగితే చంద్రబాబు ఎందుకు పవన్‌ కళ్యాణ్‌ పేరు చెప్పి జగన్‌ పై విమర్శలు చేశారు? అది పవన్‌కు మేలు చేసినట్లవుతుందా? మరింత బ్రస్టు పట్టించినట్లు అవుతుందా? లేక ఎవరైనా ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోవచ్చని చంద్రబాబు కూడా చెబుతున్నారా? ఏది ఏమైనా సమాజానికి ఆదర్శంగా ఉండవలసిన విషయాలలో నేతలు అర్థం పర్థం లేకుండా మాట్లాడడం, వ్యవహరించడం మంచిది కాదని చెప్పాలి. అయినా చంద్రబాబు మాత్రం అదే దోరణి కొనసాగిస్తుండడం దురద ష్టకరం.

కొమ్మినేని శ్రీనివాసరావు