బాలీవుడ్ లో 'జాగో' అంటూ ఒక సినిమా వచ్చింది. అది 2004లో విడులైంది. చిన్నారిపై లైంగిక వేధింపుల కథాంశం అది. ఆ తర్వాత 2007లో 'దేశముదురు' సినిమా వచ్చింది. ఈ రెండు సినిమాలకూ సంబంధం ఏమిటంటే.. జాగోలో చిన్న పిల్లగా కథలో ప్రధాన పాత్రను పోషించిన హన్సికా మోత్వానీ దేశముదురులో హీరోయిన్ అయ్యింది!
నాలుగేళ్ల లోపు వ్యవధిలోనే చైల్డ్ ఆర్టిస్ట్ కాస్తా హీరోయిన్ కావడం అప్పట్లోనే చర్చగా నిలిచింది. కేవలం జాగో లోనే కాదు.. చైల్డ్ ఆర్టిస్టుగా హన్సికా మోత్వానీ అప్పటికే చాలా మందికి పరిచితురాలు బాలీవుడ్ లో. ఆమె ఉన్నట్టుండి హీరోయిన్ గా తెరపై కనిపించే సరికి ఆశ్చర్యాలు వ్యక్తం అయ్యాయి. అదే సమయంలో.. ఆమె హార్మోనల్ ఇంజక్షన్లు తీసుకుని యుక్త వయసుకు ఎదిగినట్టుగా కనిపిస్తోందనే రూమర్లు వచ్చాయి. అయితే అలాంటి రూమర్లు కేవలం హన్సిక మీదే కాదు, మరి కొందరు హీరోయిన్లపై కూడా గతంలో వచ్చాయి. ప్రత్యేకించి చైల్డ్ ఆర్టిస్టు నుంచి సినిమా హీరోయిన్లు అయిన వారిపై ఇలాంటి రూమర్లు రావడం రొటీనే!
ఈ రూమర్లపై హన్సిక, ఆమె తల్లి ఇన్నాళ్లూ పెద్ద రియాక్ట్ కాలేదు. అయితే తాజాగా ఆ అంశంపై వారు స్పందించారు. అవన్నీ బోగస్ అని వారు కొట్టి పడేశారు. ఒకవేళ తన కూతురుకు తను హార్మోనల్ ఇంజక్షన్లు ఇచ్చి ఉండాలంటే తను చాలా ధనికురాలిని అయి ఉండాలని హన్సిక తల్లి వ్యాక్యానించారు. టాటా, బిర్లాల స్థాయి ధనికులే అలాంటి ఇంజక్షన్లను కొనగలరని ఆమె వ్యాక్యానించారు. రాసేవాళ్లు కామన్ సెన్స్ లేకుండా అలాంటి రాస్తారంటూ ఆమె విరుచుకుపడ్డారు.
తాము పంజాబీలమని.. పంజాబీ ఆడపిల్లలు 12 నుంచి 16 సంవత్సరాల వయసు మధ్యనే అలా ఎదగడం మామూలే అని ఆమె వివరించారు. టాలీవుడ్ , కోలీవుడ్ లతో పాటు హిందీలో కూడా గుర్తింపును కలిగిన హన్సిక పెళ్లి కూడా చేసుకుంది. అది ఒక రెండో పెళ్లి వాడిని కావడంతో మరిన్ని రూమర్లు వచ్చాయి. హన్సిక కోసం అతడు విడాకులు తీసుకున్నాడనే టాక్ రొటీన్ గానే వచ్చింది. అయితే అతడు 2014లోనే విడాకులు తీసుకున్న వ్యక్తి అట. ఇప్పుడు హన్సికను పెళ్లాడాడు అంతేనట.
మొత్తానికి ఒకానొక దశలో తెలుగునాట కూడా డ్రీమ్ గర్ల్ గా నిలిచిన హన్సిక ఆ తర్వాత ఆ ప్రాభవాన్ని అయితే ఇక్కడ నిలుపుకోలేకపోయింది. తమిళనాట మాత్రం అవకాశాలు బాగా దక్కాయి. 50 సినిమాలను పూర్తి చేసుకుంది. అలాగే పలువురు అనాథలను దత్తత తీసుకుని వారిని పోషిస్తూ తన సహృదయాన్ని చాటుకుంటోంది.