మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలపై తనవైన అభిప్రాయాల్ని కుండబద్దలు కొట్టినట్టు వెల్లడించారు. ముఖ్యంగా అనపర్తిలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని అడ్డగించడంపై ఆయన అధికార పార్టీని తప్పు పట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, షర్మిల, చంద్రబాబు, వైఎస్ జగన్, ప్రస్తుతం నారా లోకేశ్ వరకూ అందరి పాదయాత్రలు చూశానన్నారు. అయితే అనపర్తిలో చంద్రబాబునాయుడిని అడ్డుకున్నట్టు తనెప్పుడూ చూడలేదన్నారు.
టీవీలు ఏమైనా ఎక్కువ చేసి చూపాయేమో అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. నాడు కాంగ్రెస్ పార్టీ జగన్‌ను జైలుకు పంపకపోయి వుంటే… ఇవాళ ఆయన సీఎం అయ్యేవారు కాదన్నారు. 1977లో ఇందిరాగాంధీ ఓడిపోయిందన్నారు. అప్పుడు ఇందిరాగాంధీ స్వయంగా ఇద్దరు ప్రముఖల వద్దకెళ్లి చేతులు జోడించి ఏం చేయాలని అడిగిందన్నారు. విదేశాలకు వెళ్లిపోవాలా? అని అడిగారన్నారు. ఆమెను నాటి పాలకులు జైలుకు పంపారన్నారు. దీంతో ఆమెపై సానుభూతి వచ్చి, మళ్లీ ప్రధాని అయ్యారన్నారు.
జగన్ విషయంలోనూ అదే జరిగిందన్నారు. జగన్‌ను జైలుకు పంపి కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద తప్పు చేసిందన్నారు. అది తుడిచేయ లేని తప్పన్నారు. ఆ తప్పు వల్లే జగన్‌పై ప్రజల్లో సానుభూతి వచ్చిందన్నారు. డబ్బులు తినేశాడా? అనేది ముఖ్యం కాదన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కొడుకును జైల్లో పెడతారా? ఇదెక్కడి అన్యాయం? మొన్నటిదాకా ఇదే కాంగ్రెస్ వాళ్లుంతా గ్రేట్ అన్నారని ప్రజల్లో సానుభూతి పెరిగిందన్నారు. ఎప్పుడైనా రాజకీయాల్లో ఆత్మహత్యే తప్ప హత్యలుండవన్నారు. ఆ విషయాన్ని అధికారంలో వున్న వాళ్లు తెలుసుకోవాలని ఆయన సూచించారు.
చంద్రబాబు అధికారంలోకి రావడానికి ఎంత ప్రయత్నం చేయాలో అంతా చేస్తాడన్నారు. అధికారాన్ని నిలబెట్టుకోడానికి జగన్ ఏం చేయాలో అంతా చేస్తాడన్నారు. అనపర్తిలో చంద్రబాబును అడ్డుకోవడం వల్ల అధికార పార్టీకి ఎంతోకొంత నష్టమే తప్ప లాభం వుండదని ఆయన తేల్చి చెప్పారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఉండవల్లి అత్యంత సన్నిహితుడైన సంగతి తెలిసిందే.
గత ఎన్నికలకు ముందు టీడీపీపై ఉండవల్లి నిత్యం విమర్శలు గుప్పించేవారు. అవన్నీ వైసీపీకి అనుకూలించాయి. ఇప్పుడు తన మిత్రుడి కుమారుడు జగన్ సీఎం పీఠంపై ఉన్నారు. అప్పుడప్పుడు ఉండవల్లి మీడియా ముందుకొచ్చి సద్విమర్శలు చేస్తుండడం గమనార్హం.