'మనల్నెవ్వరా ఆపేది..' అంటూ అహంభావంతో ఏ ముహూర్తాన పవన్ కల్యాణ్ ప్రశ్నించారో కానీ, ఆయన ఎంతో ముచ్చట పడి కస్టమైజ్ చేయించుకున్న వారాహికి మాత్రం పెద్ద పెద్ద బ్రేకులే పడుతూ ఉన్నాయి! మరి పవన్ యాత్రలు ఎందుకు ఆగిపోయాయి? అంటే.. లోకేష్ పేరే వినిపిస్తూ ఉంది. లోకేష్ పాదయాత్రకు కవరేజ్ తగ్గిపోతుంది, దానిపై చర్చ పరిమితం అవుతుందనే లెక్కలతోనే తన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ యాత్రను చంద్రబాబు ఆపించారు అనే మాట సర్వత్రా వినిపిస్తూ ఉంది.
సొంత పుత్రుడు పాదయాత్రకు ప్రచారం రావడం కోసం దత్తపుత్రుడును చంద్రబాబు ఆపారనేది సహజంగా వినిపించే విశ్లేషణే. ఎలాగూ చంద్రబాబు పల్లకి మోయడమే పనిగా పెట్టుకున్న పవన్ కల్యాణ్ ఇలా బ్రేక్ తీసుకోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు కూడా! మనల్నెవ్వరా ఆపేది.. అంటే చంద్రబాబు అని అనుకోవాల్సి వస్తోంది ఇప్పుడు జనసైనికులు!
ఎవ్వరూ ఆపలేరని ప్రకటించుకుని, తనే ఆగిపోయిన వైనంపై పవన్ కల్యాణ్ పై విమర్శల వాన కురుస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే కాదు, రాజకీయ పరిశీలకులు కూడా.. పవన్ కల్యాణ్ మరీ ఇలా దొరికిపోతున్నాడేంటి.. అనే అంటున్నారు! దీంతో వారాహి అంటూ ఏదైనా హైప్ సృష్టించుకుని ఉంటే, అది కూడా ఆవిరి అవుతోంది.
ఇలాంటి నేపథ్యంలో పవన్ కల్యాణ్ వీరాభిమానులు డ్యామేజ్ కవరేజీకి పాట్లు పడుతూ ఉన్నారు! వారాహి ఎందుకు ఆగిందంటే.. అంటూ వారు వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఇంతకీ ఎందుకంటే.. రాజకీయం చేయడానికి డబ్బు కావాలట, అందుకు పవన్ కల్యాణ్ సంపాదించుకురావడానికి వెళ్లారట. అంటే సినిమాలు చేసేసి.. ఎడా పెడా డబ్బులు సంపాదించేసి, పార్టీ కోసం, ప్రజల కోసం ఖర్చు పెట్టేస్తారట! పవన్ కల్యాణ్ డబ్బులు సంపాదించుకురావడానికి వెళ్లారు కాబట్టి… వారాహి ఆగిపోయింది. పవన్ కల్యాణ్ ప్రజల మధ్యకు రావడం లేదు!
ఇలా ఉంది జనసైనికుల డ్యామేజ్ కవరేజీ ప్రయత్నం. ఎన్ని రోజులు ఇక బీద అరుపులు? చంద్రబాబు కోసం పవన్ కల్యాణ్ ఇంకా ఎన్ని రకాలుగా బద్నాం అవుతారు? చంద్రబాబు ఆటలో పావుగా పవన్ కల్యాణ్ ఇంకా ఎంతకాలం మిగిలిపోతారు?