2020 సంక్రాంతి సందర్భంగా విడుదలై, భారీ కలెక్షన్లను రాబట్టుకున్న 'అల వైకుంఠపురంలో' హిందీ రీమేక్ వెర్షన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వేటలో వెనుకబడినట్టుగా చెబుతోంది ట్రేడ్ రిపోర్ట్. తొలి రోజే ఈ సినిమా పట్ల ప్రేక్షకుల నుంచి పెద్ద ఆసక్తి వ్యక్తం కాలేదని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ శుక్రవారం అల్లు అర్జున్ సినిమా హిందీ రీమేక్ 'షెహ్జాదా' విడుదలయ్యింది. ఇదే రోజున హాలీవుడ్ నుంచి యాంట్ మ్యాన్ సీరిస్ లో ఒక సినిమా విడుదలయ్యింది. తొలి రోజున అల వైకుంఠపురంలో కన్నా హాలీవుడ్ సినిమానే బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద జోరు చూపించినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
యాంట్ మ్యాన్ సుమారు 4.15 కోట్ల రూపాయల వసూళ్లను సాధించగా, షెహ్జాదా 2.91 కోట్ల రూపాయలకు పరిమితం అయ్యిందని సమాచారం. తొలి రోజునే ఈ సినిమా పట్ల ప్రేక్షకుల నుంచి కాస్త తిరస్కరణ భావం వ్యక్తం అయ్యింది.
ఇక రివ్యూలు కూడా పెద్ద సానుకూలంగా లేవు. బహుశా ఎప్పటితో తాతల నాటి కథ ను చూసే ఆసక్తి లేకపోయి ఉండవచ్చు జనాల్లో. అది కూడా రీమేక్ గా చూడాలంటే చాలా ఓపికే ఉండాలి. అల వైకుంఠపురంలో తెలుగులో ఆడిందంటే.. పండగ సీజన్ తో సహా పలు కారణాలున్నాయి. తాతల నాటి కథ అని అప్పట్లోనే ఈ సినిమా పై ట్రోల్ నడిచింది.
లైటర్ వెయిన్ సినిమా కావడంతో.. పండగ సీజన్లో దీనికి వర్కవుట్ అయ్యింది. సంక్రాంతి సీజన్లో కాకుండా మరో సమయంలో విడుదలయి ఉంటే ఆ సినిమా బాక్సాఫీస్ వసూళ్లు హిందీ రీమేక్ కు ప్రేరేపించేవే కాదేమో! ప్రస్తుతానికి అయితే ఆ తెలుగు సినిమా హిందీ రీమేక్ జోరు అంతగా లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.