ఎమ్‌స్వర్త్ జమీందారు లండన్‌లో తను తరచుగా వెళ్లే క్లబ్బులో కొడుకు కోసం ఎదురుచూస్తూన్నాడు. లండన్‌కు దగ్గర్లో ఉన్న ఎమ్‌స్వర్త్ గ్రామంలో పూలతోటలతో, పశువుల కొట్టాలతో అలరారే తన ఎస్టేటులో ఉండాల్సిన ఆయన లండన్ రావడానికి యిలా చికాగ్గా కూర్చోవడానికి గల కారణం, వాళ్లబ్బాయి ఫ్రెడ్డీ అమెరికా నుంచి పంపిన ఓ టెలిగ్రాం! తను చిక్కుల్లో ఉన్నాననీ, లండన్‌కు వస్తున్నాననీ క్లబ్బులో కలుసుకుంటే సమస్త విషయాలు చెప్తాననీ ఆ టెలిగ్రాం సారాంశం. ఫ్రెడ్డీ చిక్కుల్లో లేని రోజుల్ని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చని జమీందారు గారి స్వానుభవం. ఫ్రెడ్డీ పుట్టినప్పటినుంచి ఏదో ఒక యిబ్బంది తెచ్చిపెడుతూనే ఉన్నాడు. అతనసలు దేన్నో ఒకదాన్ని కాలితో తన్నకుండా, దేన్నీ గుద్దుకోకుండా గదిలో ఒక మూల నుంచి మరో మూలకు వెళ్లలేడనేది అందరూ ఒప్పుకునే వాస్తవం.
చదువు మీద శ్రద్ధ లేదు సరే ఉద్యోగం, వ్యాపారం వగైరా వేటి మీదా లేదు. అప్పులు చేసి బేవార్సు స్నేహితులకు సాయం చేయడం, ప్రేమవ్యవహారాలకు కుడీఎడమా లేకుండా ఖర్చు పెట్టడం, అల్లరిచిల్లరి వ్యవహారాల్లో యిరుక్కుని కోర్టుకి జరిమానాలు కట్టడం.. యిలా అనేక విధాలుగా డబ్బు తగలేసినా చింత లేదు జమీందారుకి. తాతముత్తాలిచ్చిన కొండంత ఆస్తిని తమ జీవితకాలంలో కరిగించడం యిద్దరి వల్ల అయ్యే పని కాదు. ఏమీ చేయకపోయినా ఫర్వాలేదు కానీ ప్రేమలో పడకుండా ఉంటే అంతే చాలనుకున్నాడు తండ్రి. కానీ ఫ్రెడ్డీ ప్రేమలో ఎన్నిసార్లు పడ్డాడో, ఎన్నిసార్లు లేచి, మళ్లీ జారిపడ్డాడో ఏ స్కోరుకీపరూ చెప్పలేడు. ప్రేమను ఎంగేజ్మెంట్ దాకా తీసుకురావడం, దాన్ని బ్రేక్ చేయడం, చెల్లాచెదురైన ముక్కలను వారంలోగా అతికించి, మళ్లీ యింకో అమ్మాయితో ఎంగేజ్మెంట్ అనడం… యిలా ఎంతోమంది అమ్మాయిలు అతని జీవితంలో మెరుపుల్లా వచ్చి మబ్బుల్లా వెళ్లిపోయారు. నిజం చెప్పాలంటే పాపం యితను తెంపుకున్న సందర్భాల కంటె అవతలివాళ్లు ఛీపొమ్మన్న సందర్భాలే పది రెట్లెక్కువ. ఏ అమ్మాయీ యితన్ని వారం కంటె ఎక్కువ భరించలేక పోయేది.
జమీందారుకి యువకుడిగా ఉన్న రోజుల్లో ఒక భయం ఉండేది. అనేక నవలల్లో ప్రతీ జమీందారు వంశాన్ని ఓ శాపం వెంటాడడం గురించి ఆయన చదివాడు. పూర్వీకుడెవరో ఓ గ్రామీణ బాలికనో, గిరిజన యువతినో మోసగించి, పెళ్లాడను పొమ్మనడం, ఆమె చచ్చి దెయ్యమై శాపం యివ్వడం, దానితో ఆ వంశం వృద్ధి చెందకుండా కొత్త పెళ్లికూతురో, లేదా పుట్టిన బిడ్డో చచ్చిపోవడం యిలాటివి జరిగేవి ఆ కథల్లో. తన పూర్వీకుడూ అలాటి నికృష్టపు పని ఏమైనా చేశాడేమోనని జమీందారుకి బెదురుండేది. పెళ్లి రోజున నవవధువు రక్తం కక్కుకుని చచ్చిపోతుందని ఎదురుచూశాడు. అదేమీ జరగలేదు. తర్వాత తనకు పిల్లలు పుట్టకుండా పోతారనుకున్నాడు. ఫ్రెడ్డీ పుట్టాడు. అయితే శాపం లాటిదేదీ లేదన్నమాట అనుకున్నాడు. తర్వాత అర్థమైంది. ఫ్రెడ్డీయే ఓ శాపమని. అతని పదో యేట తల్లి చచ్చిపోయి బతికిపోయింది. తను బతికుండి ఏ ముప్పుతెస్తాడోనన్న భయంతో అనుక్షణం ఛస్తున్నాడు.
ఇలాటి సమయంలో జమీందారు పట్ల అదృష్టదేవత అతని కోడలు ఏగీ రూపంలో కనికరించింది. ఫ్రెడ్డీ విహారయాత్రకు అమెరికా వెళ్లిన సమయంలో ఆమె పరిచయమైంది. అది ప్రణయంగా మారడమే కాదు, పరిణయానికి దారి తీసింది కూడా. ఆమెది సాధారణ కుటుంబం కాదు. వాళ్ల నాన్న కుక్కబిస్కట్ల వ్యాపారంలో కోట్లు గడించాడు. నిశ్చితార్థం అమెరికాలో జరుగుతోంది రమ్మనమని కొడుకు పిలిచినా జమీందారు వెళ్లలేదు. తనకు కాబోయే అల్లుడిలో లోపాలు కనిపెట్టడం కోటీశ్వరుడైన వ్యాపారస్తుడికి ఆట్టేసేపు పట్టదని, యీ ఎంగేజ్మెంట్ కూడా వారం పదిరోజుల్లో తునాతునకలవుతుందని ఆయన అనుకున్నాడు. అయితే ఆశ్చర్యకరంగా అది పెళ్లిదాకా వెళ్లింది. ఆ పెళ్లి నిలదొక్కుకుని ఏడెనిమిది నెలలుగా సాగుతోంది.
జమీందారు పెళ్లికి వెళ్లలేదు. కోడల్ని, కోడలి కుటుంబాన్ని చూడలేదు. చూడవలసిన అవసరం ఆయనకు కనబడలేదు. ఎవరో ఒకరు ఫ్రెడ్డీని తన నుంచి దూరంగా ఉంచారు, అంతే చాలు, భగవంతుడు వాళ్లను చల్లగా చూస్తాడు అని ఇంగ్లండు నుంచే వాళ్లకు నిత్యం ఆశీస్సులు పంపుతున్నాడు. ఇలా కులాసాగా, నిశ్చింతగా గడుపుతున్న తనకు ఫ్రెడ్డీ నుంచి యీ టెలిగ్రాం రావడంతో గుండెల్లో దడ పట్టుకుంది. అతనికి వచ్చిన ట్రబుల్ ఏమై ఉంటుందాన్న చింత కలిగి దీర్ఘాలోచనలో పడ్డాడు. ఆలోచనామగ్నుడైనప్పుడు తన చెక్కిలి నిమురుకోవడం ఆయనకు అలవాటు. ఇప్పుడలా నిమురుకుంటూ ఉంటే చెక్కిలి తగల్లేదు. ఈ మధ్యే పెంచనారంభించిన గడ్డం తగిలింది. ఈ గడ్డం కొంతమందికి ఎందుకు కంటగింపుగా మారిందో అన్న ఆలోచన తోడైంది.
కొంతమందికి ఒక్కో సమయంలో గడ్డం పెంచబుద్ధవుతుంది. ఎందుకలా అంటే ఎవరూ చెప్పలేరు. జమీందారుకి మాత్రం తెల్లటి గడ్డం కారణంగా మేధావిననే ముద్ర వస్తుందనే ఆశ కలిగిందన్నమాట వాస్తవం. ఆయనకు కాస్త తిక్క, మరికాస్త మతిమరుపు ఉన్నమాట అందరితో బాటు ఆయనకీ తెలుసు. ఆ మతిమరుపుకి కారణం యీ మేధావితనమే అని ప్రజలనుకుంటే అంతకంటె కావలసినదేముంది? అందుకే గత మూణ్నెళ్లగా గడ్డం పెంచసాగాడు. కానీ అది ఆయన బట్లర్‌కు నచ్చలేదు. ఈ విషయంగా ఉద్యోగం రాజీనామా చేసే ఆలోచన చేస్తున్నాడని పనిమనిషి చెప్పింది. ‘అయ్యవారి దగ్గర ఉద్యోగం చేస్తూ ఆయన దగ్గరకెళ్లి ‘ఇది మీకు నప్పలేదు, తీసేయండి’ అని చెప్పలేను. అందువల్ల పన్నెండేళ్లుగా చేస్తున్న కొలువుకి సెలవిచ్చి, విముక్తుడనై, అప్పుడు చెప్దామనుకుంటున్నాను’ అన్నాట్ట తనతో. మంచి బట్లర్‌ని పోగొట్టుకోవడం బాధాకరమే ఐనా, తన ముఖంపై పండినదానిపై తనకు హక్కు లేకపోతే ఎలా అని జమీందారు బెసకలేదు.
ఇంతలో ఆయన గదిలోకి ఎవరో తొంగి చూసి వెళ్లిపోయారు. మరు నిమిషంలోనే మళ్లీ తొంగి చూసి, దగ్గరకు వచ్చారు. వేరెవరో కాదు ఫ్రెడ్డీయే! ‘‘మీరేనా నాన్నా? ఎవరో అనుకున్నాను. ఈ గడ్డం ఎప్పణ్నుంచి? గుర్తుపట్టలేకపోయాను.’’ అంటున్నాడు.
‘‘నా గడ్డం సంగతి అటుంచు. నీ ట్రబుల్ సంగతేమిటో చెప్పు చాలు. ఈసారి డబ్బెంత కావాలి?’’ అన్నాడు జమీందారు బట్లర్‌పై చికాకును కొడుకుపై ప్రసరింపచేస్తూ. ‘‘అబ్బెబ్బే, డబ్బు కోసం నిన్ను అడిగేవాణ్ని కాను. ఈ మధ్య మా మావగారే సర్దుతున్నాడులే. పాపం ఏమీ అనుకోడు. అయితే ఆయన యికపై మా మావగారిగా ఎంతకాలం ఉంటాడో తెలియని పరిస్థితి వచ్చింది. మా ఆవిడ నన్ను వదిలేసి, లండన్ వచ్చింది. విడాకులకు సిద్ధపడుతోంది. నా తరఫున తనకు నచ్చచెప్పి నా పెళ్లి పెటాకులు కాకుండా చూడమని మిమ్మల్ని పిలిపించాను.’’ అన్నాడు ఫ్రెడ్డీ. జరక్కజరక్క ఫ్రెడ్డీకి జరిగిన పెళ్లి, దొరక్కదొరక్క తనకు దొరికిన మనశ్శాంతి మూణ్నాళ్ల, అదే ఏణ్నెల్ల ముచ్చటగా మారుతోందని తెలియగానే జమీందారు ఆందోళన పడ్డాడు. ఏమైందని ఆదుర్దాగా అడిగాడు.
ఫ్రెడ్డీ చెప్పిన కథనం ప్రకారం అతను సినిమారచనలోకి దిగాడు. తను ఎందుకూ కొరగాని, పనికిరాని వాజమ్మ అనే విషయంలో భార్యా, మావగారూ ఏకాభిప్రాయానికి వచ్చారని అనుమానం తగిలిందతనికి. అందుకని ఎవరూ చూడకుండా ఓ సినిమా కథను దృశ్యాలతో, సంభాషణలతో సహా రాసి పెట్టుకున్నాడు. ఎవరైనా సినిమావాళ్లకు చూపించి ఓకే చేయించుకుని, భార్యను సర్ప్రైజ్ చేసి, తనూ ప్రయోజకుడనని ఒప్పించాలనే ప్లాను వేశాడు. సినిమారచన పూర్తయింది కానీ సినిమావాళ్లెవరూ తగల్లేదు, తగిలించుకోవడానికి హాలీవుడ్ వెళితే భార్యకు తెలిసిపోతుంది. సస్పెన్స్ థ్రిల్ పోతుంది. అందుకని విధివిలాసం గురించి కలలు కంటూ ఊళ్లోనే ఉన్నాడు. కానీ విధే యితని విలాసం వెతుక్కుంటూ పాలీన్ అనే ఒక ప్రముఖ నటి రూపంలో యితని ఊరుకి వచ్చింది. ఫ్రెడ్డీకి తెలిసున్న ఒకతను యితన్ని ఆమె వద్దకు తీసుకెళ్లి పరిచయం చేశాడు. పది, పదిహేనుసార్లు ఆమె బసకు వెళ్లి కలవగా, చివరకు ఓ హోటల్లో డిన్నర్ వేళ కథ వినడానికి ఒప్పుకుంది.
ఇక్కడిదాకా చెప్పి, ఫ్రెడ్డీ ఆ సినిమా కథేమిటో చెప్తానన్నాడు. అక్కరలేదని జమీందారు వారించినా వినలేదు. కథేమిటో తెలిస్తేనే హావభావాలతో, అభినయపూర్వకంగా తను హీరోయిన్‌కు ఆ కథ చెప్పినప్పుడు చూసిన యితరులు అపార్థం చేసుకునే సందర్భం ఎలా వచ్చిందో అర్థమౌతుందన్నాడు. జమీందారు కాస్సేపు గడ్డం బరుక్కుని సరే కానీయమన్నాడు. ‘ఒకూళ్లో ఒక పేదవాడున్నాడు. అతనికి అందమైన భార్య ఉంది…’ అని ఫ్రెడ్డీ మొదలెట్టాడు. ‘ఇద్దరికీ ఒకరి మీద మరొకరికి చచ్చేటంత ప్రేమ. ఓ రోజు పేదవాడు చచ్చేటంత పనైంది. అతనికి ఓ యాక్సిడెంటయింది. ఆసుపత్రికి వెళితే డాక్టరు ఆపరేషన్ అన్నాడు. ఐదులక్షలవుతుంది, లక్ష ఎడ్వాన్స్ అన్నాడు. భార్య భోరుమంది. ఇంట్లో చిల్లిగవ్వ లేదు. తనంటే మోజు పడే ఓ కోటీశ్వరుడున్నాడని గుర్తు వచ్చింది. వెళ్లి అతన్ని అడిగింది. అతను సరే సాయం చేస్తాను, కానీ నా మాటేమిటన్నాడు…’
జమీందారు విసుక్కున్నాడు. ‘మీ ఆవిడ గొడవ చెప్తానంటూ మధ్యలో వేరేవాళ్ల ఆవిడ గొడవ చెప్తావేమిటి?’ అని. ఫ్రెడ్డీ ‘దీనికీ దానికీ లింకుంది. ఈ కథలో కోటీశ్వరుడు, పేదవాడి భార్యపై మోజు పడే ఘట్టాన్ని ప్రత్యక్షపురాణంగా పాలిన్కు చెపుతూండగా జేన్ చూసింది. ఆ జేన్ పాము రూపంలో ఉన్న సైతాను. సైతాను రూపంలో ఉన్న మా ఆవిడ ఏగీ స్నేహితురాలు. దుర్బుద్ధికి మారుపేరు. మా పెళ్లి తనకు యిష్టం లేదు. మా యిద్దరి మధ్య భేదాభిప్రాయాలు తెచ్చి, మమ్మల్ని విడగొట్టి, ఏగీని తన అన్నగారితో కలపాలని వ్యూహరచన చేసింది. అందుకని తను చూసినదానికి సినిమా మసాలాకు మించిన మసాలా దట్టించి ఏగీకి చెప్పింది. ఏగీ అలిగింది. పారిస్ వెళ్లి జేన్ అన్నగార్ని కలిసి అతను నచ్చగానే నాకు విడాకులివ్వాలని బయలుదేరింది. దారిలో లండన్ వచ్చింది. సవాయ్ హోటల్లో దిగింది. రూము నెంబరు 67. మీరు వెళ్లి నేనెంత అమాయకుణ్నో తనకు నచ్చచెప్పి ఎలాగైనా సయోధ్య కుదర్చాలి.’ అని గబగబా చెప్పేసి ఊపిరి పీల్చుకున్నాడు.
జమీందారుకి ఒళ్లు మండింది. ‘మధ్యలో నేనెళ్లి మాట్లాడడమేమిటి? ఆలూమగల మధ్య గొడవలుంటే వాళ్లే సర్దుకోవాలి. మధ్యలో మధ్యవర్తులు దూరితే వ్యవహారం చిక్కుముడి పడిపోతుంది. నన్నడిగి పెళ్లి చేసుకున్నావా? ఇప్పుడు మాత్రం నేను గుర్తొచ్చానా?’ అని కసురుకున్నాడు. ‘‘కానీ చాలా సినిమాల్లో ముగ్గుబుట్ట తలేసుకుని తండ్రులు వెళ్లి కోడల్ని బతిమాలడం చూశానే..’’ అంటూ తెల్లబోయాడు ఫ్రెడ్డీ. ‘‘నువ్వూ నీ సినిమాలూ, అవే కొంపముంచాయి.’’ అన్నాడు జమీందారు విసురుగా. ‘‘పోనీ, ఓ ఫోను చేసి, రెండు నిమిషాల్లో యిదీ సంగతి అని చెప్పేయవచ్చుగా’’ అని సూచించాడు ఆశ చావని ఫ్రెడ్డీ. కానీ తండ్రి ‘‘వెళ్లను, చెయ్యను..’’ అని కరాఖండీగా చెప్పడంతో హతాశుడయ్యాడు. ‘‘సరే, అలాగే కానీయండి. ఈ విడాకుల తర్వాత నేనిక ఏ పెళ్లి ప్రయత్నమూ చేయను. ఏదో ఒక ప్రశాంత ప్రదేశానికి వెళ్లి, అక్కడే చెట్టూచేమా మధ్య, పశుపక్ష్యాదుల మధ్య శేషజీవితాన్ని గడిపేస్తాను.’’ అని తన నిర్ణయాన్ని ప్రకటించి అక్కణ్నుంచి విసురుగా వెళ్లిపోయాడు.
జమీందారుగారు చలించలేదు. ఎవడి కర్మకు వాడే కర్త అనుకుని భుజాలెగరేసి ఊరుకున్నాడు. కానీ ఆ రాత్రి మధ్యలో మెలకువ వచ్చినపుడు హఠాత్తుగా తట్టింది, ఫ్రెడ్డీ అంటున్న ప్రశాంత ప్రదేశం వర్ణన ఎమ్‌స్వర్త్ ఎస్టేటుకి సరిగ్గా సరిపోతుందని. దమ్మిడీ ఆదాయం లేని ఫ్రెడ్డీకి ఉచిత లాడ్జింగ్ బోర్డింగు సౌకర్యం సమకూర్చే ప్రదేశం అదికాక భూమండలంలో వేరే ఎక్కడ ఉంది? తనూ, కొడుకూ ఒకే కప్పు కింద మళ్లీ ఉండాల్సి వస్తుందన్న ఆలోచన జమీందారుకి నిద్ర పట్టనివ్వలేదు. దాన్ని నివారించడానికి ఉన్న ఏకైకమార్గం తను వెళ్లి కోడలికి నచ్చచెప్పి ఫ్రెడ్డీని మళ్లీ ఆమెకు అంటగట్టేయడం! దానికోసం ఓ మెట్టు దిగినా ఫర్వాలేదు.
మర్నాడు మధ్యాహ్నానికల్లా జమీందారు సవాయ్ హోటల్ రూమ్ నెంబరు 67 ఎదుట నిలబడ్డాడు. రిసెప్షన్ నుంచి ఫోన్ చేయిస్తే తను ఫలానా అని తెలిసిపోయి కోడలు చూడను పొమ్మంటుందన్న భయంతో డైరక్టుగా వచ్చేశాడు. కాలింగ్ బెల్ కొడితే ఎవరూ పలకలేదు. చూస్తే తలుపు ఓరగా తెరిచి ఉంది. లోపలకి వెళ్లి హలో అందామని ఆ రూములో అడుగుపెట్టాడు. ఎక్కడ చూసినా రకరకాల గులాబీపూలు కుండీల్లో అమర్చి ఉన్నాయి. పూలంటే ప్రాణం పెట్టే జమీందారుకి వాటిని చూడగానే ప్రాణం లేచొచ్చింది. తను వచ్చిన పని మరచి, లోపలకి వెళ్లి ఒక్కో కుండీ దగ్గర నిలబడి ఆఘ్రాణించసాగాడు. అలా యిరవయ్యో దాని దగ్గరకు వచ్చేసరికి తను గట్టిగా గాలి పీల్చిన ప్రతీసారి ఏదో ప్రతిధ్వని వినవస్తున్నట్లు తోచింది. అందుకని యిరవై ఒకటోసారి గట్టిగా చప్పుడు చేస్తూ ఊపిరి పీల్చాడు. ఈసారి ఆ ప్రతిధ్వని గుర్రు శబ్దంతో వినబడింది. అది కూడా పాదాల దగ్గర్నుంచి వచ్చింది.
వెంటనే కిందకు చూస్తే ఒంటి నిండా బొచ్చున్న ఓ బుజ్జి కుక్కపిల్ల కనబడింది. అది ఎంత నేలబారుగా ఉందంటే కాళ్లు లేకుండా పొట్టమీద పాకుతోందేమో అనిపించింది. ఇలాటి జాతి రకాల కుక్కలంటే జమీందారుకి భయం. ఏ మాత్రం హాని చేయని రకంలా నటిస్తూ హఠాత్తుగా మడమ కరిచి పట్టుకుని వదలవు. అందుకే ఆయన ‘ఛీఛీ పోపో’ అన్నాడు. కానీ అది పోలేదు. దాంతో జమీందారు పక్క గది తలుపు తీసి ఉంటే దానిలోకి దూరాడు. తీరా చూస్తే అది బెడ్రూమ్! కుక్కపిల్ల కూడా వెంట రావడంతో ఆయన మంచం మీదకు ఉరికాడు. అంత హైజంప్ చేయలేక కుక్కపిల్ల నేల మీదే నిలబడి గుర్రుగుర్రు మంటోంది. ఈయన ఛీఛీ అనగానే కుక్క జవాబేమీ యివ్వలేదు కానీ కర్టెన్ వెనక్కాలున్న బాత్రూమ్ లోంచి ‘ఎవరది?’ అని వినబడింది.
‘ఖర్మ, కోడలు స్నానాలగదిలో ఉండగా ఆమె బెడ్రూమ్లోకి యిలా రావలసి వచ్చిందా’ అని వాపోతూనే జమీందారు ‘కంగారు పడకమ్మాయి..’ అంటూ మొదలుపెట్టాడు.
‘‘కంగారు పడాలో లేదో నేను తేల్చుకుంటాను. ముందు నువ్వెవరో, నా పడగ్గదిలో ఏం చేస్తున్నావో చెప్పు.’’ అని గద్దించింది బాత్రూమ్ అమ్మాయి. జవాబేం చెప్పాలా అని ఆలోచిస్తున్న జమీందారుకి చేతిలో పిస్టల్‌తో ఓ పొట్టిగా, గుమ్మటంలా ఉన్న ఓ అమ్మాయి గుమ్మంలో కనబడింది. వెంటనే ఆయన విధేయుడైన బందీలా చేతులు పైకెత్తాడు. ‘‘ఎవరది?’’ మళ్లీ అడిగింది జమీందారు కోడలు. ‘‘ఓ మగాడు’’ అని జవాబిచ్చింది తుపాకీరాణి. ‘‘గొంతుబట్టి మగాడని తెలుస్తోందిలే! ఎవడు వాడని?’’ విసుక్కుంది కోడలు.
‘‘బవిరి గడ్డం వేసుకుని, చూడగానే దొంగలా ఉన్నాడు. కారిడార్‌లో తచ్చాడుతున్నపుడే అనుమానం వచ్చింది. ఏం చేస్తాడా అని చూస్తూండగానే తలుపు తోసుకుని లోపలకి జొరబడ్డాడు. నా గదిలోకెళ్లి తుపాకీ పట్టుకొచ్చి బెడ్రూమ్లో రెడ్‌హేండెడ్‌గా పట్టుకున్నాను. అమెరికాలో ఉండగానే నీ వజ్రాలు కొట్టేయడానికి స్మిత్ అనేవాడు ప్రయత్నిస్తున్నాడని అక్కడి పోలీసులు చెప్పారు కదా, వాడే వీడనుకుంటా.’’ అంది జేన్.
‘‘తలుపు ఓరగా ఉంటే లోపలకి వచ్చాను తప్ప వజ్రాల కోసం రాలేదు. నేను స్మిత్తూ, గిత్తూ ఎవర్నీ కాను. ఎమ్‌స్వర్త్ జమీందారుని. నా కోడల్ని చూడడానికి వచ్చాను.’’
‘‘ఏదీ మా మావగార్ని చూడనీ, జేన్..’’ అని వెక్కిరిస్తూ ఓ యువతి కిమోనో వేసుకుని బాత్రూమ్లోంచి బయటకు వచ్చింది. ఇంతటి సౌందర్యవతి ఫ్రెడ్డీని మోహించడమేమిటి, పెళ్లాడి యిన్నాళ్లు కాపురం చేయడమేమిటి, సృష్టికర్త లీల కాకపోతే’ అనుకున్నాడు జమీందారు. ఇదే సందర్భంలో యీ తుపాకీరాణి పేరు జేన్ అని కూడా తెలిసింది. తన కొడుకు చెప్పిన గడ్డివాములో త్రాచుపాము, జంటలు విడగొట్టే గుంటనక్క వగైరా యీమేనన్నమాట అనుకున్నాడు. ‘వీడి మొహం చూస్తే జమీందారులా ఉన్నాడా, అబ్బే చౌకీదారులా ఉన్నాడు. పోలీసుల్ని పిలు, ఏగీ’’ అంది ఆ అమ్మాయి. కానీ ఏగీ కుక్కపిల్లను చేతిలోకి తీసుకుంటూ మంచం దిగితే మంచిందంటూ జమీందారుకి సైగ చేసింది. దిగాక అతన్ని ఎగాదిగా చూసి ‘‘చూడబోతే ఫ్రెడ్డీ పోలికలు కనబడుతున్నాయి, జేన్..’’ అంది సాలోచనగా.
గండం గట్టెక్కుతున్నందుకు ఓ పక్క సంతోషిస్తూనే తనకూ ఫ్రెడ్డీకి పోలికలున్నాయని కోడలు అనడం జమీందారు మనసును గాయపరిచింది. తనను కూడా ఫ్రెడ్డీలాటి చవటగా లెక్కకట్టిందాన్న సంశయం కలిగింది. ఏగీ మాటను జేన్ మరోలా అర్థం చేసుకుంది. ‘‘ఫ్రెడ్డీలా ఉండడమేమిటి? ఫ్రెడ్డీయే గడ్డం తగిలించుకుని వచ్చి ఉంటాడు. ఇప్పుడే తేల్చేస్తాను.’’ అంటూ జమీందారు మీద పడి అతని గడ్డం పట్టుకుని లాగింది. పీకింది. రాలేదు. జమీందారు కుయ్యోమొర్రో మంటున్నా వినకుండా ‘‘తుమ్మ జిగురు పెట్టి అంటించేసి ఉంటాడు.’’ అని గోకింది, రక్కింది. ఇంకా ఏం చేసేదో కానీ ఏగీ ‘ఫ్రెడ్డీ అయితే నాకీపాటికే తెలిసిపోయుండేది’ ఆమెను ఆపింది. ‘అయితే స్మిత్తే అయివుంటాడు. మిస్టర్, పోలీసులు వచ్చేదాకా యీ బీరువాలో నిలబడు’ అంటూ జేన్ తుపాకీ ఊపింది.
జమీందారుకి కోపం వచ్చింది. ‘‘నేను బీరువాలోకి వెళ్లనే వెళ్లను. నీ పేరు జేన్ అనగానే నాకు సమస్తం తెలిసిపోయింది. నువ్వు పచ్చటి కాపురంలో ఎఱ్ఱటి నిప్పులు ఉమిసే డ్రాగన్వి. నిన్న మా అబ్బాయి నన్ను యిక్కడకు రమ్మనమని చెప్పి నీ గురించి చెప్పేశాడు. వాడికీ, వాడి భార్యకూ మధ్య పొరపొచ్చాలు సృష్టిద్దామని చూస్తున్న సైతాను రూపంలో ఉన్న పామువని అన్నాడు. వాడు ఒక ఉద్దేశంతో ఒక సినిమా తారని, తన పేరేదో చెప్పాడు, కలిస్తే నువ్వు దాన్ని..’’
జేన్ విషపునవ్వు నవ్వింది. ‘‘సినిమాస్టార్లని ఏ ప్రయోజనంతో పదేపదే కలుస్తారో అందరికీ తెలుసు. నేను చూసేసరికి ఏదో కథ అల్లబోయాడు…’’ అని అడ్డుకుంటూండగా ఏగీ ‘‘ఏది ఏమైనా యీయన ఫ్రెడ్డీ తండ్రే అనిపిస్తోంది. లేకపోతే యివన్నీ ఎలా తెలుస్తాయి?’’ అంది. ‘‘ఏగీ, నువ్వు అమాయకురాలివి. మోసగాళ్లు, మారువేషగాళ్లు యిలాటివన్నీ ముందే కనుక్కుని వస్తారు. వీడు నిజంగా స్మిత్తే..’’ అని జేన్ అంటూండగానే రిసెప్షన్ నుంచి కాల్ వచ్చింది. జేన్ మాట్లాడి, జమీందారు కేసి తిరిగి, ‘‘దొరికిపోయావ్ స్మిత్, అసలైన ఎమ్‌స్వర్త్ జమీందారు కింద రిసెప్షన్లో వెయిట్ చేస్తున్నారు. పైకి రమ్మనమన్నాను.’’ అంది. జమీందారుకి దిమ్మ తిరిగింది. కోడలి కళ్లల్లో గౌరవం ఆవిరై పోయింది. జేన్ విజయగర్వంతో పొంగిపోతూ కొయ్యబారిన జమీందారును కొయ్య బీరువాలో నెడదామని చూస్తోంది.
కొద్ది నిమిషాల్లో ఒక వృద్ధుడు గుమ్మంలో ప్రత్యక్షమయ్యాడు. అతని వయసు 120 ఉంటాయి, 150 ఏళ్లగా తెల్లగడ్డాన్ని పెంచుతున్నాడులా ఉంది. నెత్తి పెద్ద సైజు ముగ్గుబుట్టలా ఉంది. ‘‘ఏగీ తల్లీ’’ అంది ఆ ఆకారం వణుకుతున్న గొంతుతో. ఏగీ ముందుకు వచ్చి అతన్ని చూసి ‘‘ఫ్రెడ్డీ, ఏవిటీ పగటివేషం?’’ అని అరిచింది. తన తండ్రి రాజీ ప్రయత్నాలు చేయనన్నాడు కాబట్టే తనే తండ్రిలా వెళ్లి ఏగీకి నచ్చచెపుదామని ముసలి వేషంలో వచ్చిన ఫ్రెడ్డీ, ఒక్క నిమిషంలోనే పట్టుబడిపోయినందుకు తెల్లబోయి, తలదించుకున్నాడు. అంతలోనే తనకు పరిచితమైన మొహం గదిలో కనబడిన విషయం గుర్తుకు వచ్చి తల పైకెత్తి ‘‘నాన్నా, మీరా? రానన్నారు కదా?’’ అని జమీందారుపై ప్రశ్నలవర్షం కురిపించాడు.
ఏగీ జేన్ కేసి తిరిగి, ‘‘చూశావా నేను చెప్పలే ఈయన ఫ్రెడ్డీ తండ్రేనని! పెట్టుడు గడ్డంలో ఫ్రెడ్డీని, యీయన్నీ కలిపి చూడు, కవలల్లా ఉన్నారు.’’ అంది కొత్త విషయం కనిపెట్టిన అరిస్టాటిలంత ఉత్సాహంగా. జేన్ దాన్ని పట్టించుకోలేదు. ‘‘అసలెందుకు వచ్చాడో కనుక్కో ముందు. మధ్యలో టైము దొరికింది కాబట్టి ఏదో కథ అల్లి, బాగా రిహార్సల్ వేసుకుని వచ్చి ఉంటాడు. వాడి బుట్టలో పడకు..’’ అంది. ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడుతున్న ఫ్రెడ్డీని ఆ విదిలింపు కదల్చలేకపోయింది. ముందుగా విగ్గూ గట్రా పీకేసి, కిమోనోలో ఏగీ అందాన్ని మెచ్చుకోడంతో మొదలుపెట్టి, సినిమా కథను అమ్మడానికి తను చేసిన ప్రయత్నాలను చెప్పి, ఒక పాప్యులర్ హీరోయిన్ను ప్రసన్నం చేసుకోవడానికి డజను సార్లు తిరగవలసిన అవసరాన్ని భార్య గుర్తించేలా చేసి, ఆ హీరోయిన్ అందం ఏగీ కాలిగోటికి ఎలా సరిపోలదో నిష్కర్షగా వర్ణించి, ఫైనల్‌గా తన కథను అంగీకరించినట్లు న్యూయార్కు నుంచి సినిమా కంపెనీవాళ్లు పంపిన టెలిగ్రాం చూపించాడు.
అది చూడగానే ఏగీ కళ్లలో కనబడిన మెరుపును ఎత్తి చూపి, దీని కోసమే తనను మొత్తం వ్యవహారాన్ని రహస్యంగా ఉంచవలసి వచ్చిందని సంజాయిషీ చెప్పుకున్నాడు. ఏగీ ముగ్ధురాలై పోయింది. అందుకే జేన్ ‘ఆ టెలిగ్రాం బోగస్‌ది కావచ్చు, ఫ్రెడ్డీయే తన ఫ్రెండ్ ద్వారా న్యూయార్క్ నుంచి తెప్పించి ఉండవచ్చు’ అంటున్నా కొట్టిపారేసింది. అంతేకాదు తన స్నేహితురాళ్ల జాబితాలోంచి ఆమె పేరును కూడా కొట్టేసింది. జీవితంలో మళ్లీ తనకు మొహం చూపించవద్దంది. ఫ్రెడ్డీ కేసి తిరిగి ‘‘ఇంతకీ వాళ్లను అంతగా మెప్పించిన సినిమా కథేమిటి, డార్లింగ్, నాకూ చెప్పవా?’’ అని అడిగింది గోముగా.
వ్యవహారమంతా మౌనంగా గమనిస్తూ వచ్చిన జమీందారు తను అక్కణ్నుంచి కదిలే సమయం వచ్చిందనుకున్నాడు. వెళ్లబోయే ముందు ఒక్క సందేహం తీర్చుకుందామనుకున్నాడు. ‘‘ఏగీ, నాకూ ఫ్రెడ్డీకి పోలికలున్నా యన్నావు. నిజమేనా?’’ అని అడిగాడు. ‘‘అవును మావగారూ, ముఖ్యంగా యిద్దరికీ గడ్డాలున్నపుడు పోలిక కొట్టవచ్చినట్లు కనబడుతోంది.’’ అందామె. జమీందారు యింకేమాత్రం ఆలస్యం చేయలేదు. హోటల్లోనే సెలూన్ ఉందన్న సంగతి కనుక్కుని అక్కడే గడ్డం గీయించేసుకుని, సాయంత్రాని కల్లా ఎమ్‌స్వర్త్ చేరాడు.
మర్నాడు మధ్యాహ్నం యజమాని నూతనరూపాన్ని చూసి ఆనందభరితుడై ఒయ్యారంగా కాఫీని అందిస్తున్న బట్లర్ కేసి చూసి జమీందారు ‘‘ఫ్రెడ్డీకి ఫోన్ చేసి, తను రాసిన కథకు ముగింపు ఏమిటో కనుక్కో.’’ అని ఆదేశించాడు. ఎందుకంటే ఫ్రెడ్డీ రాసిన కథ గురించి రాత్రంతా ఆయన ఆలోచిస్తూనే ఉన్నాడు. తనకు ఏ మాత్రం నచ్చని ఆ కథ సినీనిర్మాతకు ఎలా నచ్చింది? లక్షలు వెచ్చించి ఎందుకు కొంటున్నాడు? అనుకుని కథ చివర్లో బ్రహ్మాండమైన ట్విస్టు ఏదో ఉండుంటుందని ఊహించాడు.
ఓ గంట తర్వాత సమాధానం దొరికింది- కథలో కోటీశ్వరుణ్ని పేదవాడి భార్య బెడ్రూమ్లోకి తీసుకెళుతుంది. అక్కడ మంచం కోడుకి ఓ చిరుతపులి కట్టేసి ఉంటుంది. ఏమిటిది అని కోటీశ్వరుడు అడిగితే ‘మీరు నన్నేమీ చేయకుండా…’ అంటుందామె. నీ పాతివ్రత్యానికి మెచ్చా. మీ ఆయన చికిత్సకయ్యే మొత్తం ఖర్చు నేనే భరిస్తా అంటాడు కోటీశ్వరుడు. ఆపరేషన్ విజయవంతమౌతుంది. భార్యా, భర్తా డ్యూయట్ పాడుతూండగా, కోటీశ్వరుడు తాళం వాయిస్తూండగా తెర పడుతుంది.’ అంతా విని జమీందారు నిట్టూర్చాడు. ఇప్పుడాయన సినీనిర్మాత నాన్న గురించి దిగాలు పడసాగాడు. (పిజి ఉడ్‌హౌస్ ‘‘లార్డ్ ఎమ్‌స్వర్త్ యాక్ట్స్ ఫర్ ద బెస్ట్’’ నుంచి కథాంశం తీసుకోవడం జరిగింది)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2023)