వైసీపీ ప్రభుత్వంపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యూహాత్మకంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. తనపై ప్రభుత్వం అణచివేత చర్యలకు దిగిందని ఆరోపిస్తూ, అధికార పార్టీని ఆత్మరక్షణలో పడేసేలా ఆయన వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కోటంరెడ్డి తీవ్రస్థాయిలో టార్గెట్ చేయడం చర్చనీయాంశమైంది.
ఈ సందర్భంగా సజ్జల తాత, తండ్రుల వరకూ కోటంరెడ్డి హెచ్చరిస్తున్నారంటే, వ్యవహారం ఏ స్థాయికి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ఒక కేసు విషయమై కోటంరెడ్డి ముఖ్య అనుచరులు తాటి వెంకటేశ్వరరావుతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయడం నెల్లూరు రాజకీయాలను మరోసారి వేడెక్కించింది. తన వాళ్లను అరెస్ట్ చేయడంపై కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సజ్జలపై విరుచుకుపడ్డారు. తనతో పాటు తనవాళ్లపై కేసులతో వేధించి బలహీనం చేయాలని ప్రభుత్వం చూస్తుందని ముందే చెప్పానన్నారు.
షాడో ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకే ఈ పథకం అంతా అమలవుతోందన్నారు. షాడో ముఖ్యమంత్రి అన్ని పనులూ మానేసి నెల్లూరు రూరల్ పనిలో మాత్రమే ఉన్నట్టున్నారన్నారు. మంచిదే అన్నారు. కానీ తన అనుచరులెవరూ భయపడరని ఆయన స్పష్టం చేశారు. చివరికి తన డ్రైవర్ కూడా పట్టించుకోడన్నారు. ఇలాంటి వేధింపు మరెన్ని చేసుకుంటారో చేసుకోండని ఆయన సవాల్ విసిరారు. నీకు మానసిక శునకానందం, వికృతా నందం తప్ప ఎలాంటి ప్రయోజనం వుండదని సజ్జలను ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శించారు. తాను ఆ రోజే చెప్పానని, ఇది సినిమా డైలాగ్ కాదు, ఎందాకైనా సిద్ధం, దేనికైనా సిద్ధమని, తగ్గేదేలే అని మరోసారి ఆయన వార్నింగ్ ఇచ్చారు.
తాను వేదాయపాలెం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా అక్కడ వెంకటేశ్వర రావు లేకపోవడంతో పోలీసులను నిలదీశానన్నారు. 24 గంటల్లో న్యాయస్థానంలో ప్రవేశపెడతామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో నిరసన విరమించానన్నారు. నేతలను అరెస్ట్ చేసిన తీరుపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. హైవేపై రాత్రి 11:30 గంటల వరకూ తిప్పారన్నారు.
పిస్టల్ అటూ ఇటూ తిప్పుతూ బెదిరించాలని చూస్తే భయపడేవారెవ్వరూ లేరని కోటంరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటివి చిన్నప్పుడు వీఆర్ హైస్కూల్, కాలేజీ రోజుల్లోనే చూశామంటూ సజ్జలకు తనదైన స్టైల్‌లో కోటంరెడ్డి చెప్పడం గమనార్హం. ఇలాంటివి మీకేమైనా కొత్తేమీ అని సజ్జలను ఉద్దేశించి అన్నారు. తనను మానసికంగా వేధించడానికే కేసులో చేర్చారన్నారు. తనతో పాటు 11 మందిపై కేసు పెట్టారన్నారు.
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డికి ఆయన ఓ హెచ్చరిక చేశారు. తన తమ్ముడిని మీవైపు లాగాలని అనుకుంటున్నావని, నీ తరం, నీ తండ్రి, తాత తరం కూడా కాదని ఘాటుగా హెచ్చరించడం గమనార్హం.