లక్ష్యం, లౌక్యం నుంచి సాక్ష్యం మీదుగా..

దర్శకుడు శ్రీవాస్ నుంచి మరో సినిమా వస్తోంది. లక్ష్యం, లౌక్యం లాంటి హిట్ లు వున్నాయి. డిక్టేటర్, సాక్ష్యం, ఇంకా మరో రెండు డిజాస్టర్లు వున్నాయి. వీటన్నింటి పాఠాలతో ఇప్పుడు మళ్లీ మరోసారి తన…

దర్శకుడు శ్రీవాస్ నుంచి మరో సినిమా వస్తోంది. లక్ష్యం, లౌక్యం లాంటి హిట్ లు వున్నాయి. డిక్టేటర్, సాక్ష్యం, ఇంకా మరో రెండు డిజాస్టర్లు వున్నాయి. వీటన్నింటి పాఠాలతో ఇప్పుడు మళ్లీ మరోసారి తన హిట్ కాంబినేషన్ హీరో గోపీచంద్ తో సినిమా అందిస్తున్నారు. 

పీపుల్స్ మీడియా నిర్మించే ఈ సినిమా కాస్త భారీ సినిమానే. అటు గోపీచంద్, ఇటు శ్రీవాస్ కాంబినేషన్ ను మించి మరీ ఖర్చు చేయాల్సి వచ్చింది అని టాక్. దిగిన తరువాత లోతు గురించి ఆలోచించడానికి లేదు కనుక, ఖర్చు చేసారు. ఇప్పుడు సినిమా హిట్ కావాలి, ఓవర్ ఫ్లోస్ రావాలి. అదంతా వేరే సంగతి.

దర్శకుడు శ్రీవాస్ చాలా స్టయిలిష్ గా ఈ యాక్షన్ సినిమాను రూపొందించినట్లు కనిపిస్తోంది. యాక్షన్ ప్లస్ ఫ్యామిలీ ప్లస్ ఎంటర్ టైన్ మెంట్ కలిపి కథ, కథనాలు వుంటాయని తెలుస్తోంది. ఈ రామబాణం సినిమా ఫస్ట్ యారో అంటూ ఓ చిన్ని విడియో కట్ వదిలారు. డిష్యుం..డిష్యుం అంటూ నాలుగు చితక్కొట్టుళ్లు, ఆపై చిన్నోడా అంటూ ఓ మాంచి ఫ్యామిలీ హవుస్ సెటప్ నుంచి హీరో బయటకు రావడం..ఇదీ వివరం.

ఇంకా చాలా బాణాలే వుంటాయి కనుక, మెల మెల్లగా ఈ బాణం పదును ఏ మేరకు వుంటుందో తెలుస్తుంది. సీటీ మార్ తరువాత సరైన హిట్ లేదు. పైగా పక్కా కమర్షియల్ లాంటి అరి వీర భయంకర డిజాస్టర్ పడింది హీరో గోపీచంద్ కు. మరి ఇప్పుడు ఈ చేదు నుంచి రామబాణం రక్షిస్తుందేమో చూడాలి.