ఆమెకు టికెట్ ఇస్తే….గెలుపు మ‌రిచిపోవాల్సిందే!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తిరుప‌తి అసెంబ్లీ, లోక్‌స‌భ నియోజ‌క వ‌ర్గాల‌కు అధిక ప్రాధాన్యం వుంది. ఈ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి కొలువుదీర‌డంతో ప్రాశ‌స్త్యం ద‌క్కింది. ఇక్క‌డ వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్య‌ర్థులు ఇప్ప‌టికే ఖ‌రార‌య్యారు.…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తిరుప‌తి అసెంబ్లీ, లోక్‌స‌భ నియోజ‌క వ‌ర్గాల‌కు అధిక ప్రాధాన్యం వుంది. ఈ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి కొలువుదీర‌డంతో ప్రాశ‌స్త్యం ద‌క్కింది. ఇక్క‌డ వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్య‌ర్థులు ఇప్ప‌టికే ఖ‌రార‌య్యారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి కేడ‌ర్ ఉంది. కానీ స‌రైన నాయ‌క‌త్వం లేదు. ఇదే తిరుప‌తిలో టీడీపీకి అతిపెద్ద స‌మ‌స్య‌. ఈ నేప‌థ్యంలో ముఖ్యంగా తిరుప‌తి అసెంబ్లీ టికెట్ విష‌య‌మై టీడీపీలో పెద్ద చ‌ర్చే సాగుతోంది.

ప్ర‌స్తుతం లోకేశ్ పాద‌యాత్ర‌లో భాగంగా ఎక్క‌డిక‌క్క‌డ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తూ, గెలిపించాల‌ని అభ్య‌ర్థిస్తున్నారు. న‌గ‌రి, స‌త్య‌వేడు, శ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గాల అభ్య‌ర్థుల విష‌య‌మై ఆయ‌న స్ప‌ష్ట‌త ఇచ్చారు. అభ్య‌ర్థుల‌ను ప‌క్కనే పెట్టుకుని మ‌రీ గెలిపించాల‌ని ఆయా నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జానీకానికి లోకేశ్ అప్పీల్ చేశారు. టీడీపీలో ఈ ప‌రిణామాల‌పై శ్రేణులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నాయి.

త‌న తండ్రి చంద్ర‌బాబునాయుడిలా లోకేశ్ నాన్చివేత ధోర‌ణితో వ్య‌వ‌హ‌రించ‌డం లేదు. సాధ్య‌మైనంత వ‌ర‌కూ ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌క‌త్వాన్ని బ‌లోపేతం చేసేందుకు హామీలు ఇస్తున్నారు. రెండు రోజుల్లో తిరుప‌తిలో ఆయ‌న అడుగు పెట్ట‌నున్నారు. దీంతో తిరుప‌తిలో అభ్య‌ర్థిపై క్లారిటీ ఇస్తారా? ఇవ్వ‌రా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ప్ర‌స్తుతం టీడీపీ ఇన్‌చార్జ్‌గా సుగుణ‌మ్మ వ్య‌వ‌హ‌రిస్ న్నారు. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆమె వైసీపీ అభ్య‌ర్థి భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి చేతిలో ఓడిపోయారు.

మొద‌టి నుంచి తిరుప‌తిలో భిన్న‌మైన రాజ‌కీయ ప‌రిస్థితిని చూడొచ్చు. 2014లో టీడీపీ అభ్య‌ర్థి వెంక‌ట‌ర‌మ‌ణ త‌న స‌మీప వైసీపీ అభ్య‌ర్థి భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డిపై 41 వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొందారు. వెంక‌ట‌ర‌మ‌ణ ఆకస్మిక మృతితో 2015లో ఉప ఎన్నిక జ‌రిగింది. వైసీపీ బ‌రిలో లేదు. కాంగ్రెస్ అభ్య‌ర్థి శ్రీ‌దేవిపై టీడీపీ అభ్య‌ర్థి సుగుణ‌మ్మ 1,16,544 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆ త‌ర్వాత నాలుగేళ్ల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ ప‌రిస్థితి త‌ల‌కిందులైంది.

2019లో వైసీపీ అభ్య‌ర్థి భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి త‌న స‌మీప టీడీపీ అభ్య‌ర్థి సుగుణ‌మ్మ‌పై 700 పైచిలుకు ఓట్ల‌తో గెలిచారు. అయితే ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన అంశం ఏంటంటే… 2014లో 41 వేల మెజార్టీ, అలాగే మ‌రో ఏడాదిలో జ‌రిగిన ఉప ఎన్నిక‌లో 1,16,544 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన టీడీపీ… 2019 ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి, ఆ ఓట్ల‌న్నీ పోగొట్టుకుని ఓట‌మిని మూట‌క‌ట్టుకోవ‌డం. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం టీడీపీ అభ్య‌ర్థి సుగుణ‌మ్మ‌, ప్ర‌ధానంగా ఆమె అల్లుడు సంజ‌య్ ప్ర‌జ‌ల్లో విశ్వాసం కోల్పోవ‌డ‌మే.

ముఖ్యంగా వ్యాపారాల కోసం వైసీపీ ముఖ్య నేత‌ల‌తో సుగుణ‌మ్మ అల్లుడు సంజ‌య్ ఇప్ప‌టికీ స‌త్సంబంధాలు కొన‌సాగిస్తున్నారు. దీంతో టీడీపీ ప్ర‌యోజ‌నాల కంటే వ్యక్తిగ‌త అవ‌సరాల కోస‌మే ఆ పార్టీని అంటిపెట్టుకుని సుగుణ‌మ్మ‌, ఆమె అల్లుడు ఉన్నార‌ని పెద్ద ఎత్తున చంద్ర‌బాబుకు ఫిర్యాదులు వెళ్లాయి. రాజ‌కీయాల్లో ఏ మాత్రం అటూఇటూ అయినా టీడీపీని వైసీపీకి తాక‌ట్టు పెట్ట‌డానికి సంజ‌య్ వెనుకాడ‌ర‌నే వాస్త‌వాన్ని చంద్ర‌బాబుకు చెవిలో జోరీగ‌లా తిరుప‌తి టీడీపీ నేత‌లు నూరిపోశారు. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌ల‌ను కూడా చంద్ర‌బాబుకు ఆధారాల‌తో స‌హా స‌మ‌ర్పించిన‌ట్టు తెలిసింది.

ముఖ్యంగా టీడీపీకి మొద‌టి నుంచి న‌మ్మ‌కంటా వుంటూ, ఇప్ప‌టికీ ప‌చ్చ వ‌స్త్రాలు త‌ప్ప‌, ఇత‌ర‌త్రా వాటిని ధ‌రించ‌ని టీడీపీ నాయ‌కులు, అలాగే ఆ పార్టీ బ‌లిజ నాయ‌కులు ఒకరికి తెలియ‌కుండా మ‌రొక‌రు చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌ను క‌లిసి సుగుణ‌మ్మ, ఆమె అల్లుడు సంజ‌య్ వైసీపీ కీల‌క నేత‌లు సాగిస్తున్న సంబంధాల‌పై ఫిర్యాదులు చేసిన‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా స‌మాచారం. 

ఆమెకు టికెట్ ఇస్తే మాత్రం… అమ్ముకుంటార‌ని, ఓడిపోతే త‌మ‌కు సంబంధం లేద‌ని వారంతా తేల్చి చెప్పిన‌ట్టు స‌మాచారం. దీంతో మ‌రోసారి సుగుణ‌మ్మ‌కు టికెట్ ఇచ్చి, చేజేతులా తిరుప‌తిని జారవిడుచుకునేందుకు సిద్ధంగా లేన‌ని చంద్ర‌బాబు అంటున్నార‌ని తెలిసింది. ఈ ప‌రిస్థితుల్లో తిరుప‌తిలో అడుగు పెట్ట‌నున్న లోకేశ్ టికెట్ విష‌య‌మై ఏం చెబుతారోన‌నే ఉత్కంఠ నెల‌కుంది.