లెజండ్రీ యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్.. రాజ్ కపూర్ బంగ్లాను కపూర్ ఫ్యామిలీ అమ్మేసింది. అంతకు ముందు ఆర్కే స్టూడియోను కూడా ఆ కుటుంబం విక్రయించింది. రాజ్ కపూర్ పేరిట ఉన్న ఆస్తుల్ని అమ్ముకోవడం, నిలబెట్టుకోవడం ఆ కుటుంబ వ్యక్తిగత వ్యవహారమే అయినా.. అలనాటి ఆనవాళ్లను మిగుల్చుకోకుండా తెగనమ్ముకోవడం మాత్రం కపూర్ ఫ్యామిలీ ఇమేజ్ ని డ్యామేజీ చేసే విషయమే.
గతంలో ఆర్కే స్టూడియోని సొంతం చేసుకున్న గోద్రెజ్ ప్రాపర్టీస్ సంస్థ, ఇప్పుడు రాజ్ కపూర్ బంగ్లాని కూడా కొనేసింది. అయితే బేరం ఎంతకి కుదిరిందనే విషయాన్ని మాత్రం ఆ సంస్థ ప్రతినిధులు బయటకు రానీయలేదు. ముంబైకి సమీపంలోని చెంబూరు వద్ద ఉన్న దియోనర్ ఫామ్ రోడ్ లో ఈ బంగ్లా ఉంది.
రాజ్ కపూర్ బంగ్లా అంటే అప్పట్లో భలే క్రేజ్. ఆ బంగ్లా బయట ఎంతోమంది అభిమానులు ఆయన్ను చూసేందుకు వేచి చూస్తుండేవారు. ఇప్పుడు ఆ జ్ఞాపకం కాస్తా చరిత్రలో కలసిపోతోంది. ఆ బంగ్లా స్థానంలో లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ తీసుకొస్తామంటున్నారు గోద్రెజ్ ప్రాపర్టీస్ ఎండీ గౌరవ్ పాండే.
చెంబూరులోని బంగ్లాతో తమ కుటుంబానికి అవినాభావ సంబంధం ఉందని అంటున్నారు రాజ్ కపూర్ తనయుడు రణధీర్ కపూర్. అయితే దాన్ని గోద్రెజ్ ప్రాపర్టీస్ వంటి గొప్ప సంస్థకు అప్పగించడం సంతోషంగా ఉందని చెప్పారు. వారి చేతుల్లోకి వెళ్లాక, ఆ ప్రాంతం మరింత గొప్ప పేరుతెచ్చుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.