ఒక్క సంతకంతో జాతకాలు మారిపోయే రోజులు పోయాయ్, ఒక్క మెయిల్ తో జాతకాలే తిరగబడే రోజులొచ్చేశాయి. రాత్రికి రాత్రే మెయిల్ చేసి 453మంది ఉద్యోగులపై వేటు వేసింది గూగుల్ కంపెనీ. ఈ వేటు కేవలం భారత్ లో పనిచేస్తున్నవారిపై మాత్రమే.
ఏదో చిన్నా చితకా కంపెనీ మెయిల్ పంపించి రేపటి నుంచి ఉద్యోగాల్లోకి రావొద్దు అన చెప్పడం వేరు, గూగుల్ కంపెనీ మెయిల్ చేసి రేపటి నుంచి మీ సేవలు అవసరం లేదు అని చెప్పడం వేరు. ఆమధ్య ట్విట్టర్ కూడా ఉదయం ఆఫీస్ కి బయలుదేరినవారికి మెయిల్స్ పంపించి ఇంటికెళ్లిపోవాలి చెప్పింది. అదే కోవలో ఇప్పుడు గూగుల్ కూడా భారత్ లోని ఉద్యోగులకు షాకిచ్చింది.
గూగుల్ వైస్ ప్రెసిడెంట్, భారత ఇన్ చార్జ్ సంజయ్ గుప్తా పేరుతో ఉద్యోగులకు రాత్రి మెయిల్ వచ్చింది. మీతోపాటు మొత్తం 453మంది ఉద్యోగాలు తీసేశాం, మీరిక ఆఫీస్ కి రావొద్దు అని చెప్పేసింది. సెటిల్మెంట్ కోసం హెచ్ఆర్ ని కలవాలని సూచించింది. దీంతో ఉద్యోగులు లబోదిబోమంటున్నారు.
ఐటీలో సంక్షోభం ముదిరిపోయింది, కంపెనీలన్ని లేఆఫ్ లు ప్రకటించేస్తున్నాయి. ఇటీవల గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ 12వేలమందిని ఉద్యోగాల్లోనుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఆ 12వేలమందిలో ఇప్పుడు తొలగించిన 453మంది ఉన్నారా, లేక వీరు అదనపు సిబ్బందా అనేది తేలాల్సి ఉంది.
పేరు గొప్ప సంస్థలన్నీ..
ఇటీవల మైక్రోసాఫ్ట్ సంస్థ ఏకంగా 10వేలమందిపై వేటు వేసింది. అమెజాన్ 18వేలమందిని తొలగించింది. మెటాగా మారిన ఫేస్ బుక్ సంస్థ 11వేలమందిని ఉద్యోగాల్లోనుంచి ఊడబీకేసింది. గూగుల్ ఆల్రడీ 12వేల మంది లిస్ట్ రెడీ అయినట్టు హింట్ ఇచ్చింది. ఇప్పుడు ఆ తొలగింపుల ప్రక్రియ మొదలు పెట్టింది. భారత్ లో 453మందికి షాకిచ్చారు. కఠినమైన నిర్ణయాలు ఆలస్యం చేస్తే, సమస్య మరింత జఠిలం అవుతుందని, అది అసలుకే ఎసరు తెస్తుందని ఆమధ్య గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ చెప్పిన మాటల్ని మరోసారి సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.