రాపాకపై పవన్‌ ఎటూ తేల్చుకోలేక.!

జనసేన పార్టీకి వున్నదే ఒకే ఒక్క ఎమ్మెల్యే. అధినేత పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయినా, ఆయనొక్కరే ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనే రాపాక వరప్రసాద్‌. రాజోలు నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న…

జనసేన పార్టీకి వున్నదే ఒకే ఒక్క ఎమ్మెల్యే. అధినేత పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయినా, ఆయనొక్కరే ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనే రాపాక వరప్రసాద్‌. రాజోలు నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న రాపాక వరప్రసాద్‌కి, సొంత పార్టీలో తగిన ప్రాధాన్యత దక్కడంలేదన్నది నిర్వివాదాంశం. నాదెండ్ల మనోహర్‌ లాంటోళ్ళు రాపాక వరప్రసాద్‌ని లైట్‌ తీసుకుంటోంటే, పవన్‌ సైతం.. చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు.

అప్పుడప్పుడూ పవన్‌ కళ్యాణ్‌ వెంట రాపాక వరప్రసాద్‌ కన్పిస్తున్నారంటే.. జనసేన పార్టీ నుంచి తాను ఎమ్మెల్యేగా గెలిచానన్న విషయాన్ని గుర్తుపెట్టుకునే. పైగా, పలు సందర్భాల్లో పవన్‌ తనకు అండగా నిలిచినందున, పార్టీకి చెడ్డపేరు రాకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. అలాగని, నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తల ఆలోచనలకు భిన్నంగా ఆయన వ్యవహరించలేరు కదా.! ఆయనకుండే సమస్యలు ఆయనకున్నాయి.

ఇక, తాజాగా కాకినాడలో పవన్‌ కళ్యాణ్‌ 'రైతు సౌభాగ్య దీక్ష' చేపడితే, దానికి రాపాక హాజరు కాలేకపోయారు. 'హాజరు కావడంలేదు' అని సాక్షాత్తూ ఆయనే చెప్పారు. 'నాకు సమాచారం లేదు..' అని రాపాక చెప్పారంటూ పార్టీలో కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఎంత వుందో అర్థం చేసుకోవచ్చు. 'రాపాకని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలి..' అనే డిమాండ్లు పలు మార్లు జనసైనికుల నుంచే వస్తున్నాయి. వారిని పవన్‌ ఏనాడూ వారించలేదు. పార్టీ యంత్రాంగమూ, రాపాక వరప్రసాద్‌ని 'గౌరవించిన' దాఖలాలు లేవు.

ఈ పరిస్థితుల్లో రాపాక, వేరే ఆలోచనలు చేయడాన్ని ఎలా తప్పు పట్టగలం.? సరే, రాపాక ఆ ఆలోచనలు చేస్తున్నారో లేదోగానీ.. ఆయన మీద లేని పోని ప్రచారాన్ని సాక్షాత్తూ జనసేన పార్టీ ముఖ్య నేతలే సృష్టిస్తున్నారు. జనసేనను అప్పుడప్పుడూ వెనకేసుకొస్తోన్న 'ఎల్లో మీడియాదీ' అదే దారి. ఈ క్రమంలో చాలా ఊహాగానాలు తెరపైకొస్తున్నాయి. అంతమాత్రాన, మీడియా మీద పవన్‌ కళ్యాణ్‌ విరుచుకుపడితే ఎలా.?

పార్టీ లైన్‌కి భిన్నంగా రాపాక వరప్రసాద్‌ అసెంబ్లీలో వ్యవహరిస్తున్న మాట వాస్తవం. పార్టీలో ఆయనకు అవమానాలు జరుగుతున్న మాట కూడా వాస్తవం. ఈ పరిస్థితుల్లో అధినేతగా 'గ్యాప్‌' తగ్గించే ప్రయత్నం చేయాల్సింది పోయి, అక్కసు వెల్లగక్కితే ఎలా.? ఇలాగైతే జనసేన పార్టీ 'జీరో' అయిపోవడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. ఆల్రెడీ '1' వున్నా, జీరో కిందనే లెక్కేస్తున్నారు జనసేన పార్టీని చాలామంది.