ప్రజాధనంతోనే వైకాపా సొంత ప్రచారం…!

ప్రభుత్వాలు ఏవైనా పిచ్చి పనులు చేస్తే, ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే  న్యాయస్థానాలు అక్షింతలు వేయక తప్పదు. ఒక విధంగా ఇది అవమానమే. ఇప్పుడు ఏపీలో వైకాపా ప్రభుత్వానికి  హైకోర్టు అక్షింతలు వేసింది. ప్రజాధనాన్ని…

ప్రభుత్వాలు ఏవైనా పిచ్చి పనులు చేస్తే, ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే  న్యాయస్థానాలు అక్షింతలు వేయక తప్పదు. ఒక విధంగా ఇది అవమానమే. ఇప్పుడు ఏపీలో వైకాపా ప్రభుత్వానికి  హైకోర్టు అక్షింతలు వేసింది. ప్రజాధనాన్ని అనవసరంగా వృథా చేయబోమని చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హైకోర్టు వేసిన అక్షింతలకు ఏం సమాధానం చెబుతారో తెలియదు. ఏ విషయంలోనండీ? అని అంటున్నారు కదా. ప్రభుత్వ కార్యాలయాలకు 'వైకాపా రంగులు' వేస్తున్న వ్యవహారంలో. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఎన్ని మంచి పనులు చేసిందనేది తరువాత సంగతి. కాని అది బాగా చిత్తశుద్ధిగా చేస్తున్న కార్యక్రమం ప్రభుత్వ కార్యాలయాలకు, వివిధ కట్టడాలకు విచక్షణ మరచి పార్టీ రంగులు వేయడం.  కనబడ్డ ప్రతి నిర్మాణానికి, నేతల విగ్రహాలకు పార్టీ రంగులేస్తూ 'రంగు రాజకీయం' చేస్తున్న  వైకాపా ప్రభుత్వం చివరకు ఆచార్య నాగార్జున వర్శిటీ ప్రాంగణంలో జగన్‌ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం ప్రతిష్టించింది. 

ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులేయడంతో వైకాపా సంతృప్తి చెందలేదు. పంచాయతీ కార్యాలయాలు మొదలుకొని గాంధీ విగ్రహాల వరకు వైకాపా పార్టీ రంగులు (నీలం, ఆకుపచ్చ, తెలుపు) వేశారు. వైకాపా వారు పంచాయతీ కార్యాలయ భవనాలు, హాస్టల్‌ భవనాలు, శ్మశానాల ప్రవేశ ఆర్చీలు, మంచినీటి ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, ప్లాస్టిక్‌ క్యాన్లు, ఆలయాలకు పార్టీ రంగులు వేశారు. ఇతంటితో వదల్లేదు. బర్రెల కొమ్ములకు కూడా పార్టీ రంగులు వేశారు. ఈ పాడు పనికి ప్రభుత్వ డబ్బు ఖర్చు చేశారో, పార్టీ డబ్బు ఖర్చు చేశారో మొన్నటివరకు తెలియలేదు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు పార్టీ మీద, వైఎస్‌ఆర్‌, జగన్‌ మీద ప్రేమతో ఇలా రంగులు వేశారని, ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేయలేదని నాయకులు చెప్పారు.  వైఎస్‌ జగన్‌ అనేక పథకాలు ప్రవేశపెట్టి జనాలకు మేలు చేస్తున్నందుకు వారు కృతజ్ఞతగా, సంతోషంతో రంగలు వేస్తున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కొన్ని రోజుల క్రితం చెప్పాడు. 

మొన్న శాసనమండలిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చాడు. దీంతో ఎమ్మెల్యే, నాయకులు అబద్ధం చెప్పారని అర్థమైపోయింది. ప్రభుత్వ కట్టడాలకు పార్టీ రంగులు వేయడంపై టీడీపీ సభ్యుడు చిక్కాల రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు మంత్రి పెద్దిరెడ్డి సమాధానం చెబుతూ ''పంచాయతీ కార్యాలయాలకు, గ్రామ సచివాలయాలకు రంగులు వేయమన్నాం. ఒక్కో బిల్డింగుకు 12 వేల రూపాయలు ఖర్చవుతాయి. మేం వేసే రంగులతో పార్టీకి సంబంధం లేదు. ఏదో ఒక రంగు వేయాలి కాబట్టి వేస్తున్నాం'' అని చెప్పాడు.  రంగులు వేసే పనికి, పార్టీకి సంబంధం లేదన్నాడంటే  ఇందుకు ప్రజాధనాన్ని ఉపయోగిస్తున్నారని అర్థమైంది కదా.  హైకోర్టు కూడా ఈ పనికి నిధులు ఎక్కడివని ప్రశ్నించింది. 

ఏదో ఒక రంగు వేయాలి కాబట్టి వేస్తున్నామన్నాడు మంత్రి. ఏదో ఒక రంగు వేయాలనుకున్నప్పుడు ఏదైనా రంగు (సింగిల్‌ కలర్‌) వేయొచ్చు కదా. వైకాపా జెండా రంగు ఎందుకు వేయాలి? అంటే ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేస్తున్నారని తెలుస్తోంది. ఏదో ఒక రంగు వేయాలనుకున్నామని మంత్రి చెప్పడం కూడా అబద్ధమే. వైకాపా పార్టీ రంగు వేయాలని ప్రభుత్వం విడుదల చేసిన సర్క్యులర్‌లో స్పష్టంగా ఉంది. పైగా ఇది క్లియర్‌గా అర్థమయ్యేందుకు దానికి వైకాపా రంగులున్న ఓ భవనం పోటో కూడా జత చేశారు. అధికారంలోకి రాగానే పొదుపు మంత్రాలు వల్లించిన సీఎం జగన్‌ పార్టీ ప్రచారానికి ప్రజాధనం అప్పనంగా వాడుకున్నారు. నిన్న ఓ టీవీ ఛానెల్‌ చర్చలో పాల్గొన్న వైకాపా ఎమ్మెల్సీ గోవింద రెడ్డి పార్టీ రంగులు వేయడం తమ హక్కు అన్నట్లుగా నిర్లక్ష్యంగా మాట్లాడాడు. 

ఇక తాజా పరిణామం ఏమిటంటే…వైకాపా రంగుల రాజకీయంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు ఎలా వేశారంటూ నిలదీసింది. రంగులు వేయొద్దని చెబుతూ దీనిపై పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు గుంటూరు జిల్లా కలెక్టరును ఆదేశించినా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మొటింటకాయులు వేసినట్లే. రాష్ట్రంలో త్వరలోనే పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు ఎన్నికల కమిషన్‌ వైకాపా రంగులు తీసేయాలని ఆదేశిస్తుంది. ఆ పని చేయడానికి కొన్ని లక్షలు ఖర్చు చేయాలి కదా. అవినీతిని అరికడతామంటూ అదే పనిగా చెప్పుకుంటున్న జగన్‌కు ఈ రంగుల రాజకీయం గురించి తెలియదా?