ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నిందించడం, తప్పు పట్టడం, ఆయన అవినీతికి పాల్పడుతున్నారని.. డబ్బు స్వాహా చేస్తున్నారని ఆరోపణలు గుర్తించడం ఒక్కటే లక్ష్యం. ఆరోపణలలో ఔచిత్యం ఉండాలనే పట్టింపు ఆమెకు ఉన్నట్లుగా లేదు. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న మద్యం వ్యాపారంతో ముడిపెట్టి.. అవాకులు చవాకులు పేలుతూ.. లాజిక్ కు అందని కాకి లెక్కల విమర్శలతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చెలరేగిపోతున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వందల వేల కోట్ల రూపాయలు స్వాహా చేస్తున్నారంటూ ఆమె తనదైన రీతిలో గణాంకాలను వెల్లడిస్తున్నారు.
2024 నాటికి మద్యం విక్రయాలను ఫైవ్ స్టార్ హోటల్లో కు మాత్రమే పరిమితం చేసి.. ఆ తర్వాతే ఓట్ల కోసం మీ వద్దకు వస్తానని గత ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని పురందేశ్వరి గుర్తు చేస్తున్నారు.
జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు రాష్ట్రంలో మద్య నిషేధం గురించి హామీలు ఇచ్చిన మాట వాస్తవం. అధికారంలోకి వచ్చిన తర్వాత అంచెలంచెలుగా దానిని అమలు చేయాలని ఆయన నిర్ణయించారు. అందులో భాగంగానే లిక్కర్ రేట్లు పెరిగాయి. లిక్కర్ దుకాణాల సంఖ్యను బాగా తగ్గించారు. అయితే ఇలాంటి చర్యలను గుర్తించలేని ప్రతిపక్షాలు మాత్రం తమకు తోచిన విధంగా విమర్శలు చేస్తూనే ఉంటున్నాయి. కొత్తగా సారధ్య బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. జగన్ ను నిందించడంలో తన ముద్ర చూపించుకోవాలని తపన పడుతున్న పురందేశ్వరి కూడా అదే బాటలో సాగుతున్నారు.
జగన్ హామీ ఇచ్చిన మధ్య నిషేధమును అమలులోకి తీసుకు రాకపోవడం గురించి విమర్శలు చేస్తే అదొక రకంగా ఉండేది. కానీ ఆమె విమర్శలు దారి తప్పుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల ద్వారా ఏడాదికి 15 వేల కోట్ల ఆదాయం వస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో 32 వేల కోట్లకు పెరిగిందని ఆమె అంటున్నారు. పాత ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం రాలేదని ఆమె దిగులు చెందుతున్నారో ఏంటో అర్థం కావడం లేదు.
రాష్ట్రంలో రోజుకు 80 లక్షల మంది మద్యం తాగుతున్నారని, ఒక్కొక్కరు రోజుకు 200 ఖర్చు పెడితే.. 160 కోట్ల ఆదాయం వస్తుందని, అంటే నెలకు 4800 కోట్లు, ఏడాదికి 57,600 కోట్లు ఆదాయం వస్తుందని దగ్గుబాటి పురందేశ్వరి కాకి లెక్కలు చెబుతున్నారు. ప్రభుత్వం 32 వేల కోట్ల ఆదాయాన్ని ప్రకటిస్తుండగా, మిగిలిన 25 వేల కోట్లు ఎక్కడికి వెళుతున్నాయని.. దీనిపై శ్వేత పత్రం విడుదల చేయాలని పురందేశ్వరి అనడం తమాషాగా ఉంది.
వందల కోట్ల రూపాయల స్వాహా చేసిన అవినీతి బాగోతంలో మరిది కటకటాల వెనుక ఉన్న ప్రస్తుత సందర్భంలో.. దగ్గుబాటి పురందేశ్వరి, ముఖ్యమంత్రి జగన్ కూడా వేలకోట్ల స్వాహా చేశాడని ఆరోపించడం, అందుకు ఇలాంటి కాకి లెక్కలు రుజువులుగా చెప్పడం యాదృచ్ఛికం కాకపోవచ్చునని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.