ఎట్టకేలకు మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఆశలు చిగురించాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి మోదీ సర్కార్ పట్టుదలతో వుంది. కొత్త పార్లమెంట్ భవనంలో అడుగు పెట్టిన శుభ సందర్భంలో చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలన్న ప్రధాని పిలుపును స్వాగతించాల్సిన అవసరం వుంది. ఈ బిల్లు ఆమోదంతో 33% మహిళలకు చట్టసభల్లో సీట్లు దక్కుతాయి.
ఈ నేపథ్యంలో బిల్లును మెజార్టీ రాజకీయ పక్షాలు స్వాగతిస్తున్నప్పటికీ, తమ సీట్లకు ప్రమాదం ముంచుకొస్తుందనే భయం మగ ప్రజాప్రతినిధుల్లో వుంది. ఈ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందితే 2029 ఎన్నికల నుంచి అమల్లోకి రానుంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంతో ఇప్పుడున్న లెక్కల ప్రకారం 58 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలు మహిళలకు దక్కనున్నాయి.
ఈ నేపథ్యంలో మహిళల జనాభా ప్రాతిపదికన చూస్తే ఎక్కువగా పట్టణ నియోజకవర్గాలు మహిళలకు రిజర్వ్ అయ్యే వాతావరణం కనిపిస్తోంది. దీంతో సంవత్సరాల తరబడి పాతుకుపోయిన పురుష ప్రజాప్రతినిధులు తమ నాయకత్వాన్ని జారవిడుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని ఎంత మాత్రం వారు అంగీకరించలేకపోయినప్పటికీ, అనివార్యమైన పరిస్థితి.
తమ సీటు మహిళలకు రిజర్వ్ కాకుండా ఏం చేయాలనే ప్రత్యామ్నాయ మార్గాలపై ఇప్పటి నుంచే నాయకులు దృష్టి సారించడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు నియోజకవర్గాల పునర్వభజన జరుగుతుండడంతో తమకు అనుకూలమైన స్థానాలను ఎంచుకునే ఆలోచన చేసే అవకాశం ఉంది. మహిళలకు తమ సీట్లు పోతాయనే ప్రచారం నేపథ్యంలో నాయకులు వెంటనే పునర్వభజన స్థానాల గురించి ఆలోచిస్తున్నారు.
ప్రజాసమస్యల పరిష్కారానికి చొరవ చూపని నాయకులు, తమ నాయకత్వం గల్లంతు అవుతుందంటే మాత్రం వెంటనే అప్రమత్తం అవుతున్నారు. నాయకుల్లో ముందు చూపును మహిళా రిజర్వేషన్ బిల్లు తెలియజేస్తోంది.