అలిపిరి నడక మార్గంలో మరో చిరుతను టీటీడీ, అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. తాజాగా బందీ అయిన చిరుత ఆరోది కావడం గమనార్హం. తిరుమల నడక మార్గంలో చిరుతల సంచారం భక్తులను భయపెడుతోంది. ఆ మధ్య భక్తులపై చిరుతల దాడి తీవ్ర కలకలం రేపింది. ఆరేళ్ల చిన్నారి లక్షితను చిరుత బలి తీసుకున్న సంగతి తెలిసిందే. అంతకు ముందు ఐదేళ్ల బాలుడిపై చిరుత దాడి చేసింది. తృటిలో ప్రాణపాయం తప్పింది.
దీంతో తిరుమల నడక మార్గంలో భక్తుల భద్రతా చర్యలు చేపట్టాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. భక్తులకు శాశ్వతంగా భద్రతా చర్యలు చేపట్టడంపై తీవ్ర కసరత్తు జరుగుతోంది. ఇదే సందర్భంలో భక్తులకు తాత్కాలిక ఉపశమనంగా కర్రలను టీటీడీ ఇస్తోంది. అటవీశాఖ అధికారుల అనుమతిలో నడక మార్గంలో ఇరువైపులా కంచె ఏర్పాటు చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం సుముఖంగా వుంది.
ఇదిలా వుండగా నడక మార్గంలో చిరుతలను బందించేందుకు టీటీడీ, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా బోన్లను ఏర్పాటు చేశారు. గత రాత్రి అలిపిరి కాలిబాట మార్గంలో లక్ష్మీనరసింహ స్వామి ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన బోనుకు చిరుత చిక్కింది. ఇదే ప్రాంతంలో చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసినట్టు అధికారులు తెలిపారు.
తాజాగా చిక్కిన చిరుతతో కలుపుకుంటే ఇప్పటి వరకు ఆరింటిని పట్టుకున్నట్టు అటవీ అధికారులు వెల్లడించారు.