చెరుకూరి రామోజీరావు, వేమూరి రాధాకృష్ణ…ఇద్దరూ ఎల్లో మీడియాధిపతులే. అయితే చంద్రబాబు దృష్టిలో ఇద్దరి స్థానాలు వేర్వేరు. బాబుకు రామోజీ రాజగురువు. బాబుకు రాధాకృష్ణ పరమ భక్తుడు. ఇద్దరు మీడియాధిపతులు బాబు ఆదేశాలతో పనిలేకుండా టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం ఒళ్లు దాచుకోకుండా మరీ శ్రమిస్తుంటారు. ఈ దఫా ఎన్నికలు కేవలం చంద్రబాబుకే కాదు, తమకు కూడా చావోరేవో అని వారు భావిస్తున్నారు.
మార్గదర్శి సంస్థ పీకల్లోతు ఆర్థిక అక్రమాల కేసులో ఇరుక్కుంది. దీంతో ఆ సంస్థ బాధ్యులైన రామోజీరావు, ఆయన కోడలు శైలజాకిరణ్ ఆర్థిక నేరాల కేసులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలు దఫాలు ఏపీ సీఐడీ దర్యాప్తును మామకోడలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో రామోజీరావుకు నిద్రలేని రాత్రుల్ని కరవు చేయాలని సాటి ఎల్లో మీడియాధిపతి ఆర్కే భావించినట్టున్నారు.
రామోజీతో పాటు లోకేశ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని ఏపీ సీఐడీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించినట్టు ఆర్కే తన పత్రికలో కథనాన్ని వండివార్చడం విశేషం. అసలే సీఎం జగన్ వేటకు రామోజీ, ఆయన కోడలు శైలజా విలవిలలాడుతున్నారు. శైలజా కిరణ్ ఇప్పటికే దేశం దాటిపోయారని వైసీపీ సోషల్ మీడియా సెటైర్స్ విసురుతోంది. ఈ నేపథ్యంలో జగన్ ఆదేశాల గురించి తనకు మాత్రమే విశ్వసనీయంగా తెలిసినట్టు రాయడం రాధాకృష్ణ పత్రిక ప్రత్యేకత.
ఈ పత్రిక గతంలో ఢిల్లీ పర్యటనలో జగన్‌కు ప్రధాని మోదీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా క్లాస్ తీసుకున్నట్టు రాయడం తెలిసిందే. ఎవరికీ తెలియని రహస్యాలన్నీ వారాంతపు పలుకుల సార్‌కు భలే తెలుస్తుంటాయి. తాజాగా ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం ఈ నెల 12న తాడేపల్లిలో సీఎం జగన్ కొందరు ముఖ్యులతో సమావేశం అయ్యారు. సీఎంతో భేటీ అయిన వారిలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, సీఐడీ చీఫ్ సంజయ్, అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, మరికొందరు అధికారులు ఉన్నట్టు ఆ పత్రిక రాసుకొచ్చింది.
జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి ఈ రోజుకి రామోజీరావు, లోకేశ్‌ను అరెస్ట్ ఉదంతాన్ని వారాంతపు పలుకుల సార్ పత్రిక సార్ తెరపైకి తేవడాన్ని గమనించొచ్చు.
‘మీరేం చేస్తారో నాకు తెలియదు. తొందరలోనే లోకేశ్‌ను, రామోజీరావును అరెస్ట్ చేయండి. నేను ఎంతో క్లియర్‌గా చెప్పినా కూడా ఎందుకని వదిలేశారు? మీ నిర్లక్ష్యం వల్లే మార్గదర్శి ఎండీ శైలజ అమెరికా వెళ్లిపోయారు. ఇట్టా అయితే ఎట్టా? కానియ్యండి. త్వరగా మిగిలిన వారిని అరెస్ట్ చేయండి’ అని అధికారులను జగన్ ఆదేశించినట్టు పచ్చ పత్రిక పేర్కొంది.
అసలే రామోజీరావుకు నిద్ర పట్టడం లేదు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత, ఇక తననే టార్గెట్ చేస్తారని రామోజీ భయంభయంగా కాలం గడుపుతున్నారు. లోకేశ్ ఏకంగా ఏపీ వదిలి ఢిల్లీ వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. అక్కడేమీ చేసేది లేకపోయినా ఏపీకి వెళితే అరెస్ట్ చేస్తారని ఇదే ఎల్లో మీడియా హెచ్చరించడంతో లోకేశ్‌కు ఏం చేయాలో తోచడం లేదు.
ఈ నేపథ్యంలో రామోజీరావు, లోకేశ్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేయాలనే పచ్చ పత్రిక కథనంతో వారిలో మరింత భయాన్ని పెంచినట్టు అవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అరెస్ట్ కంటే, ఆ పని చేస్తారనే వార్తలే ఎక్కువగా భయపెడుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. వృద్ధాప్యంలో కంటిపై కునుకు కరువైన తరుణంలో, పుండుపై కారం చల్లిన చందంగా ఆర్కే పత్రిక కథనం వుందని టీడీపీ వర్గాలు వాపోతున్నాయి. రామోజీపై ఎందుకయ్యా ఆర్కే మీకు అక్కసు అని నెటిజన్లు సరదా కామెంట్స్ చేస్తున్నారు.