ఉస్తాద్.. హరీశ్ కు మిగిలింది ఈ 5 రోజులు మాత్రమే

ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ, ఉస్తాద్ భగత్ సింగ్ యూనిట్ కు ఏదీ కలిసిరావడం లేదు. అందరికంటే ముందు పవన్ కు అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతలు మైత్రీ వాళ్లు. అందరికంటే ముందు పవన్ కు…

ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ, ఉస్తాద్ భగత్ సింగ్ యూనిట్ కు ఏదీ కలిసిరావడం లేదు. అందరికంటే ముందు పవన్ కు అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతలు మైత్రీ వాళ్లు. అందరికంటే ముందు పవన్ కు స్టోరీ చెప్పిన దర్శకుడు హరీశ్. కానీ అందరికంటే లేటుగా సినిమా స్టార్ట్ చేశారు వీళ్లు.

పోనీ సెట్స్ పైకి వచ్చిన తర్వాతైనా షూటింగ్ సజావుగా నడిచిందా అంటే అదీ లేదు. మొదటి షెడ్యూల్ పూర్తయిందనుకునే లోపే రెండో షెడ్యూల్ కు లాంగ్ గ్యాప్ వచ్చేసింది. ఎట్టకేలకు రెండో షెడ్యూల్ మొదలైందనుకునే లోపు, చంద్రబాబు అరెస్ట్ తో షెడ్యూల్ మొత్తం కిందామీద అయింది.

షూటింగ్ మధ్యలోనే పవన్ ఓ 2 రోజులు బ్రేక్ తీసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ సెట్స్ పైకి వచ్చారు. ఇలా పడుతూలేస్తూ సాగుతున్న షెడ్యూల్ కు ఇంకా 5 రోజులు మాత్రమే గడువు ఉంది.

అవును.. రేపట్నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ షార్ట్ షెడ్యూల్ మొదలవుతుంది. అక్టోబర్ 1 నుంచి పవన్ నాలుగో విడత వారాహి యాత్ర పెట్టుకున్నారు. అంటే.. హరీశ్ శంకర్ కు ఉన్నది కేవలం ఈ 5 రోజుల టైమ్ మాత్రమే.

వారాహి యాత్ర తర్వాత పవన్ మూడ్ ఎలా ఉంటుందో? అప్పటికి చంద్రబాబు కేసు ఏ మలుపు తిరుగుతుందో? ఒకవేళ పవన్ మళ్లీ సెట్స్ పైకి రావాలని భావించినా, ఆయన ఏ సినిమాకు కాల్షీట్ ఇస్తాడో? ఇలా అన్నీ సమాధానం లేని ప్రశ్నలే.

పవన్ చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు ఓజీ కూడా ఉంది. మరోవైపు వెయిటింగ్ మోడ్ లో హరిహర వీరమల్లు సినిమా ఉండనే ఉంది. సో.. వారాహి పార్ట్-4 తర్వాత ఆయన ఏ సినిమా సెట్స్ పైకి వస్తారో? మళ్లీ 'ఉస్తాద్' మొదలుపెడితే హరీశ్ అదృష్టవంతుడే.