రేవంత్ థియరీ, చంద్రబాబుకు సమాధి కడుతుందా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక సరికొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అన్ని వర్గాల నాయకులను ఆకట్టుకోవడం, అందరు ప్రజల్లో ఓట్లను పొందడం మీదనే సాధారణంగా అన్ని రాజకీయ పార్టీలు  శ్రద్ధ పెడతాయి.…

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక సరికొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అన్ని వర్గాల నాయకులను ఆకట్టుకోవడం, అందరు ప్రజల్లో ఓట్లను పొందడం మీదనే సాధారణంగా అన్ని రాజకీయ పార్టీలు  శ్రద్ధ పెడతాయి. అయితే రేవంత్ రెడ్డి మాత్రం తాను కేవలం సగం ఓట్లను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. మిగిలిన సగాన్ని గాలికి వదిలేస్తున్నారు. నిజానికి ఆయన్ని చెబుతున్న సిద్ధాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గనుక ఆచరణలోకి వస్తే.. అది తెలుగుదేశం పార్టీకి సమాధి కట్టినట్టు అవుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు.  

ఇంతకూ, తెలంగాణలో  హత్ సే హాత్ జోడో  కార్యక్రమం కింద పాదయాత్ర చేస్తున్న రేవంత్ రెడ్డి, ప్రతిపాదిస్తున్న ఆ సరికొత్త  థియరీఏమిటి?.. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాల లబ్ధిదారులు అందరూ, భారాస పార్టీకి ఓట్లు వేయాలట! ప్రభుత్వ పథకాలు పొందకుండా ఉండిపోయిన వారు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే చాలునట. ఇది స్వయంగా టిపిసిసి సారధి చెబుతున్న మాట.  

కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తామని, ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇస్తామని అలవిమాలిన, తన చేతిలో లేని హామీల వర్షం కూడా రేవంత్ రెడ్డి కురిపిస్తున్నారు. అవన్నీ పక్కన పెడితే .. కేసీఆర్ పథకాల లబ్ధిదారులు అందరూ ఆయన పార్టీకే ఓటు వేయాలని ప్రతిపక్ష నాయకుడు పిలుపు ఇవ్వడమే చిత్రంగా కనిపిస్తుంది. . ప్రధానంగా రైతుబంధు దగ్గర్నుంచి అనేకానేక రూపాలలో, సమాజంలో చాలామందికి కేసీఆర్ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి.  

ఎవరైనా సరే ప్రతిపక్ష నాయకులు ఈ పథకాలను మరింత లోపరహితంగా, మరింత ఎక్కువ మంది లబ్ధిదారులకు అందజేస్తామనే ప్రకటన ద్వారా జనాన్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు కానీ.. లబ్ధిదారులందరూ  భరాస పార్టీకి ఓట్లు వేయాలని చెప్పడం ఏమిటో తమాషాగా ఉంది.

కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు నాయుడు కోవర్టుగా పనిచేస్తున్నారని ముద్రగలిగి ఉన్న రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన ఈ సిద్ధాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో అమలులోకి వస్తే..  అచ్చంగా తెలుగుదేశం పార్టీకి సమాధి కట్టినట్టు అవుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ఏపీలో దాదాపుగా ప్రతి ఇంటికి జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతూనే ఉన్నాయి. . గడపగడపకు కార్యక్రమం ద్వారా ఇంటింటికి తిరుగుతున్న ఎమ్మెల్యేలు.. తమ ప్రభుత్వం,  ఆయా కుటుంబాలకు ఏ మేరకు మేలు చేసిందో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు.  

ప్రతి కుటుంబానికి ఏయే పథకాల రూపేణా ఎంత లబ్ధి చేకూరిందో కూడా వివరిస్తున్నారు. మరి రేవంత్ థియరీ ప్రకారం వారందరూ వైఎస్ఆర్ కాంగ్రెసుకు మాత్రమే ఓట్లు వేస్తే గనుక.. తెలుగుదేశం పార్టీకి ఎక్కడ డిపాజిట్లు కూడా దక్కవు. చివరి ఛాన్స్ ఇవ్వండి అంటూ ప్రజల ముందు దేబిరిస్తున్న చంద్రబాబు నాయుడు ఆశలు నెరవేరవు. పొరుగున ఉన్న తెలంగాణలో  ప్రతిపక్ష నాయకుడే ఇలాంటి మాట చెబుతుండగా.. ఏపీ ప్రజలు కూడా ఈ దిశగా ఆలోచించారంటే మాత్రం తెలుగుదేశం పార్టీ పాతాళానికి పతనం అవుతుంది.