భారతీయ జనతా పార్టీకి తాజాగా గుడ్ బై చెప్పిన సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ తనబోటి సీనియర్లు చాలామందికి ఒక చక్కటి మార్గం చూపించారు. ‘ప్రధానిగా తిరుగులేని అధికారాన్ని చలాయిస్తూ, కేంద్రంలో భారతీయ జనతా పార్టీని మూడోసారి కూడా ఏకపక్షంగా అధికారంలోకి తీసుకు రాగలరు అనేంత బలమైన నాయకుడిగా వర్ధిల్లుతున్న నరేంద్ర మోడీని కీర్తిస్తూనే ఉండాలి. నరేంద్ర మోడీని ప్రసన్నం చేసుకోవడం ద్వారా, తమకు ముందు ముందు ఎలాంటి ఇబ్బందులు, చికాకులు రాకుండా జాగ్రత్త పడాలి. అదే సమయంలో, రాష్ట్రంలో నామమాత్రపు బలంతో కునారిల్లుతున్న భారతీయ జనతా పార్టీని వదిలిపెట్టి, తమ రాజకీయ భవిష్యత్తు కోసం పక్కదారులు చూసుకోవాలి..’ అనే రూట్ మ్యాప్ కన్నా లక్ష్మీనారాయణ సిద్ధం చేశారు.
ఏపీలోని బిజెపి సీనియర్లు చాలామందికి కన్నా చూపించిన ఈ వంకర మార్గం ఆదర్శంగా కనిపిస్తోంది!. పార్టీకి రాజీనామా చేసిన కన్నా, ఆ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీని మాత్రం పొగడ్తలతో చెప్పారు. తన ప్రాణం ఉన్నంత వరకు మోడీ పట్ల అదే భక్తివిశ్వాసాలను కలిగి ఉంటానని అన్నారు. ‘తలతో చుట్టరికం.. తోకతో పగ’ అంటూ పాతసామెతను రివర్స్ చేసినట్టుగా.. ప్రధాని నరేంద్ర మోడీని మాత్రం అద్భుతమైన వ్యక్తి అని కీర్తిస్తూ.. రాష్ట్ర నాయకుడు సోమ వీర్రాజు మీద మాత్రమే విమర్శలు గుప్పించారు. సోము వైఖరి వల్ల మాత్రమే పార్టీని వీడిపోతున్నట్లుగా రంగు పులిమారు. కేంద్రంలోని బిజెపితో వైరం పెట్టుకోవడం ఎవరికీ ఇష్టం లేదు. అందుకే ఇలాంటి సరికొత్త నాటకానికి కన్నా లక్ష్మీనారాయణ స్క్రిప్ట్ రెడీ చేశారు.
ఏపీలో భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఉన్న స్థితికి.. వారు ఒక్క సీటు అయినా నెగ్గడం కష్టమే. పార్టీ మరియు వారి సిద్ధాంతాల మీద ప్రేమతో అక్కడ కొనసాగే వారు, పార్టీకి ఒక్క ఓటు రాకపోయినా సరే అక్కడే ఉంటారు. కానీ కేవలం అధికార లాలసతతో, బిజెపి పంచన చేరి, అధికార వైభవాన్ని అనుభవించవచ్చు అని ఉవ్విళ్లూరేవారికి ఈ పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది.
ఎన్నికల్లో తాము గెలిచే సీన్ లేదనే వాస్తవం వారిని కంగారు పెడుతోంది. అలాగని బిజెపిని వదిలి వెళ్లాలంటే, వెన్నుపోటు నాయకులుగా ముద్ర పడుతుందనే భయం మరోవైపు. ఇలాంటి వారందరికీ కన్నా లక్ష్మీనారాయణ మార్గం చూపించారు.
మోడీని కీర్తిస్తూ.. పార్టీ నాయకత్వం గుడ్ లుక్స్ లోనే ఉండాలి.. అదే సమయంలో తాము రాజకీయంగా గెలిచే పార్టీలో కొనసాగాలి.. అనే సిద్ధాంతాన్ని కన్నా లక్ష్మీనారాయణ తయారు చేశారు. మోడీ ఎంతగా దూరం పెడుతున్నా సరే, పట్టించుకోకపోయినా సరే.. ఆయనను కీర్తిస్తూ పబ్బం గడుపుకోవాలని చూసే చంద్రబాబు నాయుడు సిద్ధాంతాన్నే కన్నా ఒకపాటించి సీనియర్లకు ఒక దారి చూపించినట్లుగా కనిపిస్తోంది.