చిలక పలుకులు చెబుతున్న చినబాబు!

తెలుగుదేశం పార్టీ చిన్న బాబు నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించి మహా అయితే మూడు వారాలు గడుస్తున్నదేమో..  అప్పుడే అయిన పాచిపోయిన పాత రికార్డులను వేస్తున్నారు. ప్రజలందరూ మూర్ఖులు.. వారికి ఏమీ తెలియదు..  ఏమీ…

తెలుగుదేశం పార్టీ చిన్న బాబు నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించి మహా అయితే మూడు వారాలు గడుస్తున్నదేమో..  అప్పుడే అయిన పాచిపోయిన పాత రికార్డులను వేస్తున్నారు. ప్రజలందరూ మూర్ఖులు.. వారికి ఏమీ తెలియదు..  ఏమీ గుర్తుండదు అని చినబాబు అనుకుంటున్నారో ఏమో తెలియదు గానీ..  రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం గురించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నిందించడానికి లోకేష్ సాహసిస్తున్నారు. 31 మంది ఎంపీలు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం గురించి ఏ మాత్రం ప్రయత్నించడం లేదని నిందలు వేసేందుకు ఆయన పూనుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంజీవని వంటి ప్రత్యేక హోదా అనే అంశాన్ని, విభజిత రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ, సమూలంగా సర్వనాశనం చేసేసింది అనే సంగతి రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు. కేంద్రం మెడలు వంచి అయినా సరే ప్రత్యేక హోదా సాధించాలనే తపన, స్ఫూర్తి రాష్ట్ర ప్రజలలో వెల్లువలా ఉన్న తరుణంలో.. ప్రజలు సాగిస్తున్న పోరాటాల మీద ఉక్కు పాదం మోపడం ద్వారా ఆ స్ఫూర్తిని అడుగంటా తొక్కేసిన నీచమైన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది.  

చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రోడ్డుమీదికి ఎక్కి పోరాటం చేస్తున్న యువతరం, ఉద్యోగులపై కూడా కేసులు నమోదు చేసిన సంఘటనలు ప్రజలు ఇంకా మరిచిపోలేదు.

కేంద్ర ప్రభుత్వంలో, అప్పటికి ఒకింత బలహీనంగానే ఉన్న భారతీయ జనతా పార్టీ చంక ఎక్కి, వారితో కలిసి అధికార పీఠాన్ని పంచుకున్న తెలుగుదేశం పార్టీ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసిన సందర్భమే లేదు. కేంద్ర ప్రభుత్వంలో తాము భాగస్వాములుగా ఉన్న రోజుల్లో కూడా ప్రత్యేక హోదా డిమాండ్ ను వారు వినిపించలేదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ప్రత్యేక ప్యాకేజీ అనే మాయమాటలకు లొంగిపోయి.. అడ్డగోలుగా నిధులు దండుకోవచ్చుననే అత్యాశతో ప్రత్యేక హోదా అనే అంశాన్ని పాతిపెట్టేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు! భారతీయ జనతా పార్టీతో డీల్ బెడిసి కొట్టిన తర్వాత, తన ప్రభుత్వం దిగిపోవడానికి కొన్ని నెలల ముందు నుంచి ధర్మ పోరాట దీక్షల పేరుతో డ్రామాలను నడిపించారు ఆయన. ఈ దుర్మార్గాలను ప్రజలు మరిచిపోలేదు!

అలాంటిది- ఇప్పుడు చిన్న బాబు వచ్చి ‘ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయండి’ అని చిలక పలుకులు పలికితే  నవ్వుకుంటున్నారు.  వైసీపీకి 31 మంది ఎంపీలు ఉన్నారు అని ఏడుస్తున్న నారా లోకేష్, గత ప్రభుత్వ హయాంలో వారికి ఉన్న ఎంపీల సంఖ్య తక్కువ అయినప్పటికీ కూడా మొత్తం అందరూ పదవులకు రాజీనామా చేసి..  ప్రత్యేక హోదా కోసం నినదించిన త్యాగాన్ని ప్రజలు గుర్తు చేస్తున్నారు.  

తెలుగుదేశానికి తక్కువ మంది సభ్యులు ఉంటే.. అదే తరహాలో రాజీనామాలు చేయడం ద్వారా తమ నిరసన గళాన్ని పోరాట స్వరాన్ని వినిపించవచ్చు కదా అనేది ప్రజల వాదన.   ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి అందరికంటే ఎక్కువగా తెలుగుదేశం అన్యాయం చేసిందనే స్పృహ ప్రజలలో ఉన్నప్పుడు.. వైసిపి నిందిస్తూ చినబాబు చిలక పలుకులు పలుకుతుంటే ఉపయోగం ఏముంటుంది?