2022: థియేటర్ కలెక్షన్స్ వెనుక నగ్నసత్యాలు

సినిమా హాల్స్ కి జనం రావడం తగ్గించేసారని చాలా సార్లు చాలా చోట్ల చర్చలు జరిగాయి. అది వాస్తవం కూడా. కరోనాకి ముందు- కరోనాకి తర్వాత అన్నట్టుగా సినిమా హాల్స్ వద్ద కలెక్షన్స్ పరిస్థితిని…

సినిమా హాల్స్ కి జనం రావడం తగ్గించేసారని చాలా సార్లు చాలా చోట్ల చర్చలు జరిగాయి. అది వాస్తవం కూడా. కరోనాకి ముందు- కరోనాకి తర్వాత అన్నట్టుగా సినిమా హాల్స్ వద్ద కలెక్షన్స్ పరిస్థితిని చెప్పుకున్నాం. 

అయితే కేజీఎఫ్ 2, ఆర్.ఆర్.ఆర్, అవతార్ 2, కాంతార వంటి సినిమాలు దుమ్ము దులిపేయడంతో నచ్చిన సినిమాని ఆదరించడానికి జనం ఎప్పుడూ ఉంటారని, థియేటర్ వ్యాపారానికి ఢోకా లేదని కొందరు తీర్పులు చెప్పేయడం మొదలుపెట్టారు. 

అయితే కొన్ని నగ్నసత్యాలు లెక్కల రూపంలో బయటికొచ్చాయి. “ఒర్మాక్స్ మీడియా అండ్ గ్రూప్ ఎం” ఒక రిపోర్టుని వెల్లడించింది. దాని ప్రకారం తెలిసిన విషయమేంటంటే థియేటర్స్ వద్ద కలెక్షన్ పెరిగినా కానీ తెగిన టికెట్స్ గతంతో పోలిస్తే తక్కువని. మరి తక్కువ తెగితే ఎక్కువ కలెక్షన్ ఎలా వచ్చిందని అడగొచ్చు. దానికి కారణం టికెట్స్ రేట్స్ లో పెరుగుదల మాత్రమేనట. 

విషయంలోకి వెళ్తే, 2022 జనవరిలో సినిమా హాళ్లు కరోనా కారణంగా దాదాపు మూతపడే ఉన్నాయి. తెరుచుకున్నా పలు చోట్ల 50% మాత్రమే నిండాలనే ఆంక్షలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ 2022 మొత్తంలో రూ 10600 కోట్ల వసూళ్లు బాక్సాఫీసు వద్ద అయ్యాయి. అయితే 2019లో ఈ మొత్తం రూ 10950 కోట్లు. ఇక కరోనా నామసంవత్సరమైన 2020లో ఈ మొత్తం రూ 2000కోట్లని, 2021లో రూ 3770 కోట్లని ఆ సంస్థ వెల్లడించింది. 

ఇంతవరకు వసూళ్ల అంకెలు అటుఇటుగా సమంజసంగానే ఉన్నా 2022లో తెగిన టికెట్ల సంఖ్య 89.2 కోట్లు. అదే 2019లో 103 కోట్ల టికెట్లని లెక్క చెప్పింది ఈ సంస్థ. అంటే దాదాపు 14 కోట్ల టికెట్లు తగ్గాయన్నమాట.  

ఇక్కడ గమనించాల్సిన ఒక పెద్ద విషయం ఉంది. 2022లో కేజీఎఫ్2, ఆర్.ఆర్.ఆర్, అవతార్2 వంటి సినిమాల వల్ల ఏర్పడిన పాన్ ఇండియా చిత్రాల వెల్లువ 2019లో ఏమాత్రం లేదు. అయినప్పటికీ 2019నాటి కలెక్షన్స్ కానీ, తెగిన టికెట్ల లెక్కగానీ 2022తో పోలిస్తే చాలా ఎక్కువ అనుకోవాలి. 

ఇక ఈ లెక్కల్లో ప్రత్యేకించి బాలీవుడ్ పరిస్థితి మాత్రం చాలా దీనంగా కనిపిస్తోంది. 2019లో 34.1కోట్ల టికెట్లు సినిమాహాల్స్ వద్ద తెగితే 2022 లో కేవలం 18.9 కోట్ల టికెట్లు మాత్రమే తెగాయి. అంటే ఏ మాత్రం జనాదరణకి నోచుకోని సినిమాలతో బాలీవుడ్ 2022లో చతికిలపడిపోయింది. 

ఇప్పుడు తాజాగా “పఠాన్” ఇచ్చిన ఊపుకి రాబోయే సల్మాన్ చిత్రం “కిసి కా భాయ్ కిసి కి జాన్” కూడా ఏప్రిల్ 21 న విడుదలై దుమ్ము దులుపుతుందని ఆశిస్తున్నాయి బాలీవుడ్ వర్గాలు. అదే జరిగితే మళ్లీ ఈ రంగానికి ప్రాణవాయువు అందినట్టే. 

భారతీయ బాక్సాఫీస్ వద్ద 2022లో అధికంగా వసూళ్లు చేసిన సినిమాల్లో టాప్-1 కేజీఎఫ్2 అయితే టాప్-2 ఆర్.ఆర్.ఆర్. ఆ తర్వాత వరుసగా అవతార్2, కాంతార, పొన్నియన్ సెల్వన్-1, బ్రహ్మాస్త్ర-1, ది కాశ్మీర్ ఫైల్స్, విక్రం, దృశ్యం-2, భూల్ భులయ్యా2 ఉన్నాయి. 

అంటే తెలుగు చిత్రం 1, కన్నడ చిత్రాలు 2, తమిళ సినిమాలు 2, మళయాళం 1, ఇంగ్లీష్ 1, హిందీ 3 అన్నమాట. అంత దయనీయ స్థితిలోనూ 2022లో టాప్-10 లో హిందీ సినిమాలే 3 ఉండడం గొప్ప విషయమే.

శ్రీనివాసమూర్తి