ఇటీవల రాజ్యసభలో జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్ల వ్యవహారం తెరపైకి తెచ్చారు. ప్రాజెక్ట్ నిర్వహణ సరిగా లేదని చిందులు తొక్కారు. అంతర్జాతీయ సమాజం ముందు తలదించుకోవాల్సి వచ్చిందని భారీ డైలాగులు కొట్టారు. తీరా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రాజెక్ట్ ల వల్ల జరిగిన ప్రాణ నష్టం గురించి వైసీపీ మంత్రులు ప్రశ్నించేసరికి వారికి మాట పడిపోయింది.
తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ రాజ్యసభలో ఏపీ అప్పుల గురించి ప్రస్తావించారు. టీడీపీ ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఏపీకి ఏయే బ్యాంకులు ఎంత అప్పులిచ్చాయి. ఆర్థిక లోటు ఎలా పెరిగిందో వివరించారు.
ఈ లెక్కల్ని కాసేపు పక్కనపెడితే బీజేపీ ఆధ్వర్యంలో, టీడీపీ సౌజన్యంతో వైసీపీపై దాడి మొదలైందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇది పొలిటికల్ దాడి అని తెలియకుండా.. ఇరు పార్టీలు రాజ్యసభను వేదికగా చేసుకున్నాయి. ఎల్లో మీడియాకు చేతినిండా పని కల్పించాయి.
ఇప్పటి వరకూ కేంద్రం వైసీపీని ఎప్పుడూ ఇరుకున పెట్టాలని చూడలేదు. ఉపాధి హామీ పథకం, కొవిడ్ వ్యాక్సిన్లు.. ఇతరత్రా వ్యవహారాల్లో కేంద్రం ఏపీ ప్రభుత్వానికి సహకరిస్తూనే ఉంది. అయితే ఇటీవలే ఆ ధోరణిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.
అటు తెలంగాణలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ టార్గెట్ చేసింది, ఇటు ఏపీలో కూడా వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని చూస్తోంది. అందుకే ఇలా పార్లమెంట్ లో వ్యూహాత్మకంగా దాడి మొదలు పెట్టింది. ఈ దాడి వెనక టీడీపీ హస్తం ఉందనేది బహిరంగ రహస్యం.
గజేంద్ర సింగ్ షెకావత్ వ్యాఖ్యలకు టీడీపీ కోవర్టు ఎంపీలు దర్శకత్వం వహించారని ఇట్టే తెలిసిపోతుంది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి వ్యాఖ్యలకు కారణం టీడీపీ ఎంపీ అడిగిన ప్రశ్నే. దీంతో ఈ రెండు సందర్భాల్లో టీడీపీయే పరోక్షంగా కేంద్రానికి ఓ అవకాశాన్నిచ్చి వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూసింది.
జగన్ పై వత్తిడి..
ఇప్పటివరకు జగన్ ఆ గట్టున లేరు, ఈ గట్టున లేరు. ఒకవేళ అదే తేల్చుకోవాల్సి వస్తే తాను తటస్థం అని కరాఖండిగా చెప్పే రకం. కానీ బీజేపీ జగన్ ని తనవైపు తిప్పుకోవాలని చూస్తోంది. 2024లో ఫలితాలు తేడా కొడితే వైసీపీ లాంటి బలమైన పార్టీ ఎంపీల అవసరం వారికి చాలా ఉంది. అందుకే ఒక రకంగా ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కి దిగింది కేంద్రం.
రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలను ఇలా పార్లమెంట్ లో హైలెట్ చేసి ఇరుకున పెట్టాలని చూస్తోంది. టీడీపీకి ఇది అవసరమే కాబట్టి.. ఆ పార్టీ కేంద్రానికి వంతపాడుతోంది. చివరకు జగన్ ఓకే అంటే.. టీడీపీని ముంచేసి వైసీపీతో జట్టుకట్టడానికి బీజేపీ ఎప్పుడూ రెడీనే. అయితే ఈ క్రమంలో ఇప్పుడు బ్లాక్ మెయిల్ ఎపిసోడ్ కొనసాగుతోంది.
గతంలో ఎప్పుడూ ఏ రాష్ట్రంలో జరిగిన సంఘటనల్లోనూ కేంద్రం ఇంతలా జోక్యం చేసుకోలేదు. ఏ రాష్ట్రం అప్పు గురించి కూడా ఇంతలా బాధఫడలేదు. ఇష్టముంటే ఆర్థిక సాయం చేస్తుంది, లేకపోతే పక్కనపెడుతుంది. కానీ ఈసారి మాత్రం వైసీపీని నేరుగా టార్గెట్ చేసింది కేంద్రం. ఎన్నికలకు సమయం దగ్గరపడే కొద్దీ మెల్లమెల్లగా బ్లాక్ మెయిల్ డోసు పెంచుతోంది. ఈ తాటాకు చప్పుళ్లకు జగన్ తనదైన రీతిలో సమాధానం చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది.