తెలుగుదేశం తప్ప కన్నాకు వేరే దారి లేదు!

ఇప్పటికి ఇంకా రాజకీయ భవిష్యత్తు ప్రస్థానం ఎలా ఉంటుందో తేల్చుకోలేదని అంటున్నారు గానీ..  భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ సారథి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిశ్చయించుకున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదైనా…

ఇప్పటికి ఇంకా రాజకీయ భవిష్యత్తు ప్రస్థానం ఎలా ఉంటుందో తేల్చుకోలేదని అంటున్నారు గానీ..  భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ సారథి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిశ్చయించుకున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప,  ఆయన మరో పార్టీలోకి మారే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

భారతీయ జనతా పార్టీ ప్రస్తుత రాష్ట్ర సారధి సోము వీర్రాజు ప్రవర్తన, శైలి నచ్చకపోవడం కారణంగానే పార్టీని వీడుతున్నట్లుగా కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. మోడీ మీద ఉన్న నమ్మకంతోనే ఆ పార్టీలో సామాన్య కార్యకర్తగా చేరానని, మోడీ మీద నమ్మకం విశ్వాసం ఎప్పటికీ తనలో అలా చెక్కుచెదరకుండా ఉంటాయని ఆయన అంటున్నారు. అయితే రాజకీయంగా ఏ పార్టీలోకి చేరుతారనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంచారు.

అయితే విశ్లేషకులు భావిస్తున్న ప్రకారం, విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారం ప్రకారం తెలుగుదేశంలో చేరడం తప్ప కన్నా లక్ష్మీనారాయణకు వేరే గత్యంతరం లేదు. అందుకు కారణాలు ఇలా ఉన్నాయి..

కన్నా లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరినట్లయితే కులం ముద్ర మరింత ఘాటుగా పడుతుంది. కులం కార్డు చూసుకుని, పవన్ కళ్యాణ్ పంచన చేరారంటూ ఆయన రాజకీయ ప్రత్యర్ధులు విమర్శలు గుప్పిస్తారు. అదే సమయంలో భవిష్యత్తు ఆశాజనకంగా ఉండాలంటే జనసేన కంటే తెలుగుదేశం పార్టీలో చేరడం బెటర్ అనే ఆలోచన కూడా కన్నా లక్ష్మీనారాయణ శిబిరంలో జరుగుతోంది.  

ఎందుకంటే.. కన్నా లక్ష్మీనారాయణ మంత్రి పదవి పొందగల స్థాయి సీనియర్ నాయకుడు అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీని వదిలిపెట్టడం వలన కొత్తగా మరో పార్టీ పంచన చేరితే, వారు అధికారంలోకి రాగలిగితే, తాను మళ్ళీ మంత్రి కావాలని కోరికతోనే కన్నా లక్ష్మీనారాయణ ఉంటారు.  

పవన్ కళ్యాణ్ తరఫున జనసేన పార్టీలో చేరితే ఒకవేళ అందరూ ఊహిస్తున్నట్లుగా జనసేన, తెలుగుదేశం కలిసి పోటీ చేసి..  ఇద్దరూ కలిసే అధికారంలోకి రావడం అంటూ జరిగితే.. జనసేనకు పరిమితంగా మాత్రమే మంత్రి పదవి బెర్తులు లభిస్తాయి. ఇప్పటికే ఆ పార్టీలో ఎందరో ఆశావహులు మంత్రి పదవుల మీద ఆశలు పెంచుకుంటున్నారో తెలియదు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఎందరికి మాట ఇచ్చారో కూడా తెలియదు.  

అలా కాకుండా, తెలుగుదేశం పార్టీలో చేరినట్లయితే కనుక, తాను గెలవడం, టిడిపి అధికారంలోకి రావడం జరిగినట్లయితే మంత్రి పదవి గ్యారెంటీ. అనే నమ్మకం ఆయనను పురి గొల్పుతోంది. అందుకే జనసేన నుంచి తనకు రెడ్ కార్పెట్ ఆహ్వానం ఉన్నప్పటికీ కూడా, ఆ పార్టీ కంటే తెలుగుదేశంలో చేరడమే మేలని కన్నా లక్ష్మీనారాయణ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.