సాధారణంగా ఒక నాయకుడు ప్రజలలో మంచి పేరు తెచ్చుకొని గొప్ప సంక్షేమ పథకాలను ఆచరణలోకి తెస్తే గనుక, దానిని మక్కీకి మక్కీగా కాపీ కొట్టి తాము కూడా కీర్తి ప్రతిష్టలు గడించాలని ఇతర నాయకులు ఉత్సాహపడుతుంటారు. పథకాలను కాపీ కొట్టడానికి సాధారణంగా నాయకులు మొహమాట పడరు. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన అమ్మఒడి లాంటి పథకాలను తమ తమ రాష్ట్రాల్లో కూడా అమలు చేయడానికి ఇతర ప్రాంతాల ముఖ్యమంత్రులు కూడా ప్రయత్నిస్తున్నారు అనే సంగతి అందరికీ తెలిసిందే.
అయితే చంద్రబాబు నాయుడు మరీ టూమచ్.. ఇతరుల పథకాలను మాత్రమే కాదు.. వారి ఆలోచనలను కూడా కాపీ కొడతారు. ఇంత ఘోరంగా కాపీ కొడుతుంటే ప్రజలు తనను చూసి నవ్వుతారని వెరపు కూడా ఆయనకు ఉండదు. తన ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి అమలులో పెట్టిన ఆలోచనగా కాపీ చేయడానికి కూడా ఆయన సిగ్గుపడరు. అది చంద్రబాబు స్టైల్.
వివరాల్లోకి వెళితే.. చంద్రబాబు నాయుడు తాజాగా, ‘ ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా టూర్ చేస్తూ పార్టీ కార్యకర్తలకు ఒక విషయం ప్రకటించారు. తెలుగుదేశం పార్టీలో ఒక సరికొత్త వ్యవస్థను తీసుకురాబోతున్నట్లుగా ఆయన వెల్లడించారు. కుటుంబ సాధికార సారధుల పేరిట ఈ వ్యవస్థ పేద ప్రజలకు, పార్టీ అనుసంధానంగా పనిచేస్తుందని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. కుటుంబ సాధికార సారథి అనే హోదాలో ఉండే పార్టీ కార్యకర్తలు.. తమ తమ పరిధిలో 30 కుటుంబాలకు నిత్యం టచ్లో ఉండాలని.. తెలుగుదేశం పార్టీ గురించి, పేదల కోసం తెలుగుదేశం చేసే కృషి గురించి వారికి చెబుతూ ఉండాలని ఆయన సందేశం ఇచ్చారు.
తాము టచ్ లో ఉండే 30 కుటుంబాలతో నిత్యం జగన్ మోహన్ రెడ్డి పై బురద చల్లుతూ ఉండాలని సందేశం కూడా అందించారు. ఇంకా ఈ కుటుంబ సాధికార సార్లు ఏమేం బాధ్యతలు నిర్వర్తించాలో ఎప్పటికప్పుడు తాను తెలియజేస్తూ ఉంటానని ఆయన ప్రకటించారు.
ఒక అందమైన తెలుగు మాట, కార్యకర్తలకు డాబుసరిగా కనిపించే ఒక హోదా.. అంతా బాగానే ఉంది. కానీ ఈ ఆలోచన అచ్చంగా జగన్మోహన్ రెడ్డి నుంచి కాపీ కొట్టింది అని ప్రజలు నవ్వుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి 50 కుటుంబాలతోనూ నిత్యం టచ్ లో ఉంటూ వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా.. ప్రభుత్వంతో పనులుంటే అవి నెరవేరేలా సమన్వయ బాధ్యతలు చూడడానికి జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున ఇటీవల గృహసారథులు అనే వ్యవస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఈ ఐడియాను ఏమాత్రం సిగ్గుపడకుండా మక్కీకి మక్కి కాపీ కొట్టి చంద్రబాబు నాయుడు ఒక కొత్త పేరు పెట్టారు. కుటుంబ సాధికార సార్లు అంటూ వారు పార్టీ కోసం పనిచేయాలని 30 కుటుంబాలకు ఒకరు వంతున అని అంటున్నారు. కనీసం తన పార్టీని తాను కాపాడుకోవడానికి, ఎలాంటి కొత్త ఆలోచన చేయలేనంత వార్ధక్యంలోనికి ప్రవేశించిన చంద్రబాబు.. ఒక వేళ ఆయన ఆశిస్తున్నట్లుగా చివరిసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం దక్కినట్లయితే రాష్ట్రం కోసం ఏ కొత్త ఆలోచన చేయగలరు? అని ప్రజలు నవ్వుకుంటున్నారు.
జగన్ ను కాపీ కొట్టడం మానేసి సొంత ఆలోచనలతో ముందుకు సాగితే చంద్రబాబుకు విజయం దక్కడం సంగతి తర్వాత, ముందు పరువు దొరుకుతుందని వారు అంటున్నారు.