ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేధస్సును సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నారా చంద్రబాబునాయుడు చౌర్యం చేశారు. నిత్యం వైఎస్ జగన్‌ను సైకో ముఖ్యమంత్రిగా చంద్రబాబు సహా టీడీపీ నేతలంతా తిట్టిపోసే సంగతి తెలిసిందే. సైకో పోవాలి, సైకిల్ రావాలని విస్తృతంగా ప్రచారం చేస్తే…. చంద్రబాబు అండ్ కో, ఇప్పుడు తమ పార్టీని జనంలోకి తీసుకెళ్లడానికి ఎవరి మేధస్సును ఆలోచించారో తెలుసా? చంద్రబాబు రాజకీయ, పరిపాలన అనుభవమంత వయసు లేని వైఎస్ జగన్ బుర్ర నుంచి పుట్టిన పథకాన్ని కాపీ కొట్టాల్సి వచ్చింది.
తన పార్టీని జనంలోకి, అలాగే హామీలను జనంలోకి తీసుకెళ్లడానికి కుటుంబ సాధికార సారథులను త్వరలో తీసుకురానున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. ఇది వైసీపీ తీసుకొచ్చిన గృహ సారథులకు పోటీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చంద్రబాబు ఓ పెద్ద విజనరీ అని టీడీపీ అనుకూల మీడియా ఊదరగొడుతూ వుంటుంది. కానీ వైసీపీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు సీఎం జగన్ తీసుకొచ్చిన గృహ సారథుల మాదిరిగానే, చంద్రబాబు అదే రీతిలో సైన్యాన్ని తయారు చేయాలనుకోవడం గమనార్హం.
ప్రతి 50 కుటుంబాలకు ఇద్దరేసి చొప్పున గృహ సారథులను వైసీపీ నియమించడం, వారికి శిక్షణ కూడా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. మార్చి 18 నుంచి ఆల్రెడీ మనుగడలో ఉన్న వాలంటీర్లతో పాటు గృహ సారథులతో కలిసి మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ఉధృతంగా జనంలోకి వెళ్లేలా సీఎం జగన్ ఇటీవల దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యుద్ధతంత్రంతో బెంబేలెత్తిన చంద్రబాబునాయుడు… చివరికి జగన్‌నే అనుసరించాల్సిన దయనీయ స్థితి ఏర్పడింది.
ఆగమేఘాల మీద కుటుంబ సారథులను బరిలోకి దింపనున్నట్టు చంద్రబాబు ప్రకటించడం విశేషం. ఒక్కో వ్యక్తికి 30 కుటుంబాలను కేటాయించనున్నట్టు బాబు వెల్లడించారు. ఇక్కడ కూడా జగన్ నియమించిన మాదిరిగానే ప్రతి టీమ్‌లో ఒక మహిళ, ఒక పురుషుడు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. జగన్‌ను సైకో అంటూ, మళ్లీ ఆయన తీసుకొచ్చిన విధానాలనే అనుసరించడానికి చంద్రబాబు, ఆయన టీమ్‌కు సిగ్గనిపించడం లేదా? అనే ప్రశ్న వైసీపీ నుంచి ఎదురవుతోంది.
ఇదే విధంగా నవరత్నాల పేరుతో తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను, అలాగే సచివాలయ వ్యవస్థ, దానికి అనుబంధంగా వాలం టీర్లను కొనసాగిస్తామని ఇటీవల టీడీపీ కొత్త పల్లవి అందుకుంది. సైకో సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పడానికి మనసెలా ఒప్పిందనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. సైకో సీఎం అని విమర్శిస్తూనే, తమ పార్టీని కాపాడుకోడానికి , అలాగే అధికారాన్ని సొంతం చేసుకోడానికి జగన్‌ను అనుసరించాల్సిన తప్పని సరి పరిస్థితి ఎందుకు ఎదురైందో చంద్రబాబు ఇప్పటికైనా ఆలోచించాలి.
ఇకపై జగన్‌ను సైకో అంటే… జనం అలా అన్న వాళ్ల మనస్తత్వం గురించి మరోలా అనుకోవాల్సి వుంటుందని హెచ్చరించక తప్పదు.