ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర రాజకీయ వివాదానికి దారి తీసిన జీవో-1 అమల్లో ఉన్నట్టా? లేనట్టా? అనేది చర్చనీయాంశమైంది. కందుకూరు, గుంటూరులలో చంద్రబాబు సభల్లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందడం, అలాగే పలువురు గాయాలపాలైన నేపథ్యంలో ఏపీ సర్కార్ జీవో-1ను తీసుకొచ్చింది. పట్టణాలు, నగరాల్లో రోడ్ల మీద, ఇరుకు వీధుల్లో సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్‌షోలు నిర్వహించకూడదనే నిబంధన తీసుకొచ్చింది.
తనను అడ్డుకునేందుకే ఈ జీవోను తీసుకొచ్చారని చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కుప్పంలో చంద్రబాబు పర్యటనలో అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో జీవో-1పై న్యాయ స్థానంలో విచారణ జరుగుతోంది. ఈ జీవోపై ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఇదిలా వుండగా చంద్రబాబు ఆదేం ఖర్మ మనరాష్ట్రానికి అంటూ మళ్లీ జనంలోకి వెళుతున్నారు.
కాకినాడు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఆయన పర్యటనల్లో పెద్ద ఎత్తున జనం వస్తున్నారు. కార్యక్రమాలన్నీ పట్టణాల్లోనే నిర్వహిస్తున్నారు. అయితే పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్న వార్తలేవీ రాలేదు. అసలు ఆ జీవో చర్చనీయాంశం కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రజల్లో చెడ్డపేరు వస్తుందనే భయంతో ఏపీ సర్కార్ భయంతో వెనక్కి తగ్గిందా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు లోకేశ్ పాదయాత్రలో తనకు మైక్ ఇవ్వలేదని, నిలిచి మాట్లాడ్డానికి బెంచి కూడా లాక్కెళ్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబుకే లేని ఇబ్బందులు లోకేశ్‌కు ఎదురు కావడం ఏంటో మరి? ఇకపై జీవో-1తో ప్రతిపక్ష పార్టీలకు ఇబ్బందులు ఎదురు కాకపోవచ్చని అర్థం చేసుకోవాలేమో!