ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థాయి, బతుకుపై జనసేనాని పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యాలు తీవ్ర దుమారం రేపాయి. జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పవన్‌కల్యాణ్ ప్రసంగిస్తూ …జగన్ నువ్వెంత? నీ బతుకెంత? నువ్వేమైనా దిగొచ్చాననుకుంటున్నావా? ప్రజలకు కోపం వస్తే కొట్టి చంపేస్తారని తీవ్రంగా హెచ్చరించారు.
జగన్, పవన్‌కల్యాణ్‌ల బతుకులేంటో, స్థాయిలేంటో వైసీపీ నేతలు గట్టిగానే సమాధానం ఇచ్చారు. పదేళ్ల పార్టీకి అధ్యక్షుడైన పవన్‌కల్యాణ్ ఇవాళ ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు చెబుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన ఆయన స్థాయి, బతుకేంటో ప్రతిబింబిస్తోంది. ఇంతకూ పవన్ విడుదల చేసిన ప్రకటన ఏంటంటే…
“జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా మరోసారి గ్లాస్‌ను కేటాయించినందుకు ఎన్నికల సంఘానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు గ్లాస్ గుర్తుపైనే పోటీ చేసిన సంగతి విదితమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 137 స్థానాలు, తెలంగాణ నుంచి 7 లోక్‌సభ స్థానాల్లో జనసేన అభ్యర్థులు నాడు పోటీలో నిలిచారు. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రజలకు సేవ చేయడానికి జనసేన అభ్యర్థులు సన్నద్ధమైన తరుణంలో రిజిస్టర్డ్ పార్టీ అయిన జనసేనకు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాలు, కేంద్ర ఎన్నికల సంఘంలోని అధికారులు యావన్మంది సిబ్బందికి పేరుపేరునా నా తరపున, జనసేన పార్టీ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను”
జనసేన స్థాపించి పదేళ్లకు ఇంకా స్థిరమైన గుర్తుకే దిక్కులేదని పవన్‌కల్యాణ్ నిరూపించారు. ఎన్నికల సంఘం దయాదాక్షిణ్యాలపై జనసేనకు గ్లాస్ గుర్తు కేటాయించినట్టు పవన్‌కల్యాణ్ కృతజ్ఞతా ప్రకటన తెలియజేస్తోంది. ఈ మాత్రం సంబడానికి సీఎం వైఎస్ జగన్ స్థాయి, బతుకుల గురించి పవన్ మాట్లాడితే… జనం నవ్విపోరా?
కనీసం గ్లాస్ గుర్తును కూడా కాపాడుకోలేని దయనీయ స్థితిలో జనసేనను నడుపుతున్నారని తన ప్రకటన ద్వారా యావన్మందికి పవన్ తెలియజేశారు. రిజిస్టర్డ్ పార్టీ అయిన జనసేనకు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి కేటాయించడం సంతోషదాయకమని పదేళ్ల పార్టీకి అధినేత అయిన నాయకుడు పేర్కొనడం అంటే, ఇంతకంటే సిగ్గుమాలిన పని ఏమైనా వుంటుందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కావున తన బతుకేంటో ఇప్పటికైనా తెలుసుకుని సీఎం జగన్‌పై జాగ్రత్తగా మాట్లాడాలని వైసీపీ నేతలు హితవు చెబుతున్నారు.