తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం తాజా ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావడానికి బీఆర్ఎస్సే కారణమని కవిత అనడంపై డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా బిల్లును కవిత కోసమే కేంద్రంలోని తమ ప్రభుత్వం ప్రవేశ పెడుతుందన్నట్టు ఆమె మాట్లాడుతున్నారని అరుణ మండిపడ్డారు.
కేసులను తప్పుదోవ పట్టించేందుకు నాటకాలు ఆడొద్దంటూ కవితకు డీకే అరుణ చురకలు అంటించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎంత మంది మహిళలకు టికెట్లు ఇచ్చారో చెప్పాలని డీకే అరుణ నిలదీశారు. తామిచ్చిన హామీలను ప్రధాని మోదీ నెరవేరుస్తున్నారని అరుణ చెప్పుకొచ్చారు. మహిళ అయిన తనపై కేసీఆర్ అడ్డగోలుగా మాట్లాడారని డీకే అరుణ విరుచుకుపడ్డారు. కేసీఆర్‌కు మహిళలంటే కనీస గౌరవం లేదని ఆమె విమర్శించారు.
కవితా…మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని మీ నాన్నకు చెప్పు అని డీకే అరుణ హితవు పలికారు. కేంద్రంలోనూ, తెలంగాణ రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వం వస్తుందని ఆమె జోస్యం చెప్పారు. తెలంగాణలో తమ పార్టీని ఆదరించాలని డీకే అరుణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు.
అధికారం కోసం తెలంగాణలో అమలుకు నోచుకోని హామీలను కాంగ్రెస్ పార్టీ ఇస్తోందని ఆమె విమర్శించారు. తమ ఎమ్మెల్యేలు పార్టీ మారరని, అధికారంలోకి వస్తే స్కామ్‌లు చేయరని, అలాగే తెలంగాణ చరిత్రను తప్పుదారి పట్టించమని కాంగ్రెస్ పార్టీ మూడు గ్యారెంటీ ఇవ్వాలని వ్యంగ్యంగా అన్నారు.